Chandra Mohan: ఎంజీఆర్‌ సోదరుడిగా మెరుపులు 

12 Nov, 2023 10:45 IST|Sakshi
చంద్రమోహన్‌(ఫైల్‌ ఫోటో)

 కోలీవుడ్‌తో చంద్రమోహన్‌కు ఆత్మీయ అనుబంధం

తమిళసినిమా: సినిమా ముద్దు బిడ్డలు చాలా తక్కువ మందే ఉంటారు. అందులో నటుడు చంద్రమోహన్‌ పేరు కచ్చితంగా ఉంటుంది. ఎల్లలు దాటిన నటకులోత్తముడు ఈ చంద్రమోహనుడు. ఐదు దశాబ్దాలకు పైగా అలుపెరుగని నట దురంధరుడు. అందరికీ కావలసిన చంద్రమోహన్‌ నట జీవితం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది చెన్నైనే. ఇక్కడే సాధారణ వ్యక్తి నుంచి అసాధారణ నటుడిగా ఎదిగిన చంద్రమోహన్‌. ఆబాల గోపాలానికి ఇష్టుడిగా ముద్రపడ్డారు. అందుకే భాషా భేదం, పక్షపాతం చూడకుండా అన్ని భాషల వారి ఆదరణను పొందిన అతి కొద్దిమంది నటుల్లో ఆయన కూడా స్థానం సంపాదించుకున్నారు.

చెన్నై రంగరాజపురంలోని యునైటెడ్‌ కాలనిలోని చంద్రమోహన్‌ నివాసం తెలియని చిత్ర ప్రముఖులు, సినీ ప్రియులు లేరంటే అతిశయోక్తి కాదు. ఆయన ఇంటి పక్కనే దర్శక దిగ్గజం కె.విశ్వనాథ్‌ నివాసం. వీరిద్దరి మధ్య సినిమాకు అతీతమైన అనుబంధం. చంద్రమోహన్‌ తెలుగుతో పాటు తమిళం, మలయాళం సినీ ప్రేక్షకులకు సుపరిచితులే. ముఖ్యంగా తమిళంలో మక్కళ్‌ తిలకం ఎంజీఆర్‌తో కలిసి నటించిన ఘనత సాధించారు.

నాన్‌ నమదే అనే సూపర్‌ హిట్‌ చిత్రంలో ఎంజీఆర్‌ కు తమ్ముడిగా చంద్రమోహన్‌ నటించి తమిళ ప్రేక్షకుల గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచి పోయారు. ఆ చిత్రంలో ఎంజీఆర్‌తో కలిసి చంద్రమోహన్‌  నటించిన అన్బు మలర్‌ అనే పాట క్లాసిక్‌గా నిలించింది. మరో విషయం ఏమిటంటే ఇది తెలుగులో ఎన్‌టీఆర్, మురళీమోహన్, బాలకృష్ణ కలిసి నటించిన అన్నదమ్ముల అనుబంధం చిత్రానికి రీమేక్‌. ఇకపోతే చంద్రమోహన్‌ తమిళంలో కథానాయకుడిగా నటించిన చిత్రం నీయా. నటి శ్రీప్రియ కథానాయకిగా నటించి నిర్మించిన ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఏ తరహా పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేసే చంద్రమోహన్‌ నటుడిగా ఎప్పటికీ చిరంజీవే అంటే అతిశయోక్తి కాదు. 

మరిన్ని వార్తలు