దీపావళి నాకు కలిసొచ్చిన పండగ.. జపాన్‌ విజయం ఖాయం: కార్తీ

9 Nov, 2023 06:41 IST|Sakshi

క్వాంటిటీ కంటే క్వాలిటీకే ప్రాముఖ్యతనిచ్చే నటుడు కార్తీ. అందుకే నటుడిగా పరిచయం అయ్యి సుమారు 18 ఏళ్లు కావస్తున్నా.. ఇప్పుటికి 25 చిత్రాలే చేశారు. అయితే ప్రస్తుతం వరుసగా చిత్రాలు చేస్తున్నారు. ఈయన ఇటీవల నటించిన విరుమాన్‌, సర్థార్‌, పొన్నియిన్‌సెల్వన్‌ పార్టు 1, 2 చిత్రాలు మంచి విజయాన్ని సాధించారు. కాగా కార్తీ తాజాగా కథానాయకుడిగా నటించిన చిత్రం జపాన్‌. ఇది ఈయన 25వ చిత్రం కావడం విశేషం. రాజుమురుగన్‌ దర్శకత్వంలో డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ఆర్‌.ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్‌.ప్రభు నిర్మించిన ఈ భారీ చిత్రానికి జీవీ.ప్రకాశ్‌కుమార్‌ సంగీతాన్ని ,రవివర్మన్‌ ఛాయాగ్రహణను అందించారు.

నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం దీపావళి పండగ సందర్భంగా శుక్రవారం తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఈ సందర్భంగా నటుడు కార్తీ చైన్నెలో మీడియాతో ముచ్చటించారు. ఆయన మాట్లాడుతూ జపాన్‌ చిత్రం తనకు చాలా స్పెషల్‌ అని పేర్కొన్నారు. దర్శకుడు రాజుమురుగన్‌ కథ,సంభాషణలు తనకు చాలా నచ్చాయన్నారు. జపాన్‌ చిత్రంలో కార్తీ కనిపించడని, పాత్రే కనిపిస్తుందని అన్నారు.

ఇంతకు ముందు కాశ్మోరా చిత్రంలో భిన్నమైన పాత్రను పోషించినా జపాన్‌లో పూర్తిగా వైవిధ్యభరిత కథా పాత్రను చేసినట్లు చెప్పారు. జీవీ.ప్రకాశ్‌కుమార్‌ సంగీతం, రవివర్మన్‌ ఛాయాగ్రహణ చిత్రానికి పక్కా బలంగా ఉంటాయన్నారు. నటుడు సునీల్‌, విజయ్‌ మిల్టన్‌ లతో కలిసి నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. ఇక దీపావళి తనకు కలిసొచ్చిన పండగ అని, ఈ పండగ సందర్భంగా జపాన్‌ చిత్రం విడుదల కావడం సంతోషంగా ఉందని చెప్పారు. జపాన్‌ చిత్ర విజయంపై చాలా నమ్మకం ఉందనే అభిప్రాయాన్ని కార్తీ వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు