Akshay Kumar: 'బాయ్‌కాట్‌' ట్రెండింగ్‌.. ఆర్థిక వ్యవస్థకు లాభమా?

8 Aug, 2022 19:39 IST|Sakshi

Akshay Kumar Says Mischievous People Are Boycotting Films: బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ ఎప్పుడూ వరుసపెట్టి సినిమాలు చేస్తూ అలరిస్తుంటాడు. ఇటీవల సూర్యవంశీ, ఆత్రంగి రే, బచ్చన్‌ పాండే, సామ్రాట్‌ పృథ్వీరాజ్‌ సినిమాలతో పలకరించాడు. ఆయన తాజాగా నటించిన చిత్రం 'రక్షా బంధన్‌'. అయితే ఈ మధ్య 'బాయ్‌కాట్ బాలీవుడ్‌' అంటూ సోషల్‌ మీడియాలో ట్రెండింగ్ అయిన విషయం తెలిసిందే. రణ్‌బీర్‌ కపూర్‌ 'బ్రహ్మాస్త్రం', అమీర్ ఖాన్ 'లాల్ సింగ్‌ చద్దా', అలియా భట్‌ 'డార్లింగ్స్‌'తో పాటు అక్షయ్ కుమార్‌ 'రక్షా బంధన్‌' చిత్రాలను బహిష్కరించాలని నెట్టింట్లో ట్రోలింగ్‌ జరిగింది. 

రక్షా బంధన్ ప్రమోషన్‌లో పాల్గొన్న అక్షయ్‌ కుమార్‌ బాయ్‌కాట్‌పై స్పందించాడు. అమీర్ ఖాన్ 'లాల్ సింగ్ చద్దా బాయ్‌కాట్‌' ట్రెండింగ్‌లో ఉండటం తనను బాధించిందని తెలిపాడు. 'ఇలా బాయ్‌కాట్‌ పేరుతో అల్లరిపాలు చేసేవాళ్లు కొంతమంది మాత్రమే ఉంటారు. అల్లరి చేసేవాళ్లు మాత్రమే ఇలా బాయ్‌కాట్‌ చేస్తారు. అది పర్వాలేదు. ఇది స్వేచ్ఛాయుత భారతదేశం. ప్రతి ఒక్కరూ తమకు నచ్చినవి చేసేందుకు అనుమతిస్తారు. కానీ ఇది ఆర్థిక వ్యవస్థకు చాలా ఉపయోగపడుతుందా?. అలా జరగడం లేదు కదా. ప్రజలు ఇలాంటి పనులు చేయడంలో ఎలాంటి అర్థం లేదు. మన భారతదేశాన్ని గొప్పగా పెంపొందిచడంలో తోడ్పడాలి కానీ, ఇలాంటివి చేయకూడదు. ఇలాంటి పనులు ఎవరు చేయకూడదని నేను అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే దీనివల్ల మన దేశానికి ఎలాంటి ఉపయోగం లేదు' అని అక్కీ పేర్కొన్నాడు. 

కాగా ఆనంద్‌ ఎల్ రాయ్‌ దర్శకత్వంలో ఒక్క అన్న, నలుగురు చెళ్లెళ్ల మధ్య అనుబంధంగా తెరకెక్కింది 'రక్షా బంధన్‌' చిత్రం. ఇందులో భూమి పెడ్నేకర్‌, సాదియా ఖతీబ్, సాహెజ్మీన్ కౌర్, స్మృతి శ్రీకాంత్, దీపికా ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ మూవీ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదే రోజున అమీర్‌ ఖాన్‌ 'లాల్‌ సింగ్ చద్దా' కూడా విడుదల కానుంది. 

మరిన్ని వార్తలు