‘కోట బొమ్మాళి పీఎస్‌’లో హీరోలు లేరు: అల్లు అరవింద్‌

22 Nov, 2023 08:23 IST|Sakshi

‘పోలీసులనే పోలీసులు వెంటాడే విచిత్రమైన కథ ‘కోట బొమ్మాళి పీఎస్‌’. ఈ సినిమాలో హీరోలు లేరు.. కథే హీరోగా వెళుతుంటుంది. ఈ చిత్రం ఏ రాజకీయ నాయకుడిని, పోలీస్‌ ఆఫీసర్‌ని ఉద్దేశించి తీయలేదు. ఈ వైవిధ్యమైన చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు నిర్మాత అల్లు అరవింద్‌. రాహుల్‌ విజయ్, శివానీ రాజశేఖర్‌ జంటగా శ్రీకాంత్, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘కోట బొమ్మాళి పీఎస్‌’. తేజా మార్ని దర్శకత్వంలో ‘బన్నీ’ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానుంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రీ రిలీజ్‌ వేడుకలో నిర్మాత ‘దిల్‌’ రాజు మాట్లాడుతూ– ‘‘లింగిడి లింగిడి..’ పాట తర్వాత ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. ఈ చిత్రం మంచి హిట్టవ్వాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమా ట్రైలర్‌ చూశాను. ఇప్పుడున్న పరిస్థితులకి చెప్పాలనుకున్న విషయాన్ని క్లియర్‌గా చెప్పారు’’ అని దర్శకుడు బోయపాటి శ్రీను అన్నారు. ‘‘ప్రేక్షకులను ఆలోచింపజేసే చిత్రమిది’’ అని ‘బన్నీ’ వాసు  అన్నారు. 

మరిన్ని వార్తలు