Pawan Kalyan And KTR: మల్లన్న... కొండపోచమ్మ సాగర్లలోనూ షూటింగ్‌లు చేయాలి – మంత్రి కేటీఆర్‌

24 Feb, 2022 07:23 IST|Sakshi
సంయుక్త, రానా, కేటీఆర్, సాగర్‌ కె. చంద్ర, తమన్, పవన్‌ కల్యాణ్, త్రివిక్రమ్, తలసాని, నాగవంశీ

Pawan Kalyan Bheemla Nayak Pree Release Event: ‘‘భారతీయ చలన చిత్ర పరిశ్రమకు హైదరాబాద్‌ని హబ్‌గా చేయాలని సీఎం కేసీఆర్‌ కోరుకుంటున్నారు. కేసీఆర్‌గారు కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో అతి ముఖ్యమైన మల్లన్న సాగర్‌ 50 టీఎంసీల రిజర్వాయర్‌ను ఈరోజే (బుధవారం) ప్రారంభించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా గోదారమ్మకు భూదారి చూపించారు కేసీఆర్‌గారు. గోదావరి జలాలను 82 మీటర్ల నుంచి 612 మీటర్లకు పెంచి, ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ను మూడేళ్లలోనే పూర్తి చేశారు.  గోదావరితో పాటు తెలంగాణాలో ఉన్న మల్లన్న, కొండపోచమ్మ సాగర్‌లలో కూడా సినిమా షూటింగ్‌లు చేసుకోవాలని పవన్‌ కల్యాణ్, సినిమా పరిశ్రమను కోరుకుంటున్నాను’’ అని మంత్రి కేటీఆర్‌ అన్నారు.

పవన్‌ కల్యాణ్, రానా హీరోలుగా సాగర్‌ కె. చంద్ర దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘భీమ్లా నాయక్‌’. దర్శకుడు త్రివిక్రమ్‌ ఈ సినిమాకు డైలాగ్స్, స్క్రీన్‌ ప్లే అందించారు. పీడీవీ ప్రసాద్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం రేపు(ఫిబ్రవరి 25) విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్న తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ‘భీమ్లా నాయక్‌’ కొత్త ట్రైలర్‌ను విడుదల చేశారు.

ఈ వేడుకలో ఇంకా కేటీఆర్‌ మాట్లాడుతూ – ‘‘నాలుగేళ్ల క్రితం ఇదే గ్రౌండ్‌కి చరణ్‌ చిత్రం కోసం వచ్చినప్పుడు ‘తండ్రేమో మెగాస్టార్‌.. బాబాయ్‌ పవర్‌స్టార్‌’ అని మీ (పవన్‌ కల్యాణ్‌) పేరు చెప్పినపుడు నన్ను అభిమానులు మట్లాడనివ్వలేదు. మంచి మనిషి, విలక్షణమైనౖ శైలితో పాటు కల్ట్‌ ఫాలోయింగ్‌ ఉన్న సూపర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌. మేమందరం కాలేజీ రోజుల్లో మీ ‘తొలిప్రేమ’ చూసినవాళ్లమే. అప్పటినుండి ఇప్పటివరకూ 25 ఏళ్ల పాటు ఒకే రకమైన స్టార్‌ ఫాలోయింగ్‌ సొంతం చేసుకోవడం అసాధరణమైన విషయం. నల్గొండ నుండి వచ్చి ఈ సినిమాకు దర్శకత్వం వహించిన సాగర్‌ కే చంద్ర మరిన్ని విజయాలు సాధించాలి. ఈ చిత్రం ద్వారా చాలా మంది అజ్ఞాతసూరీడులను అందించిన చిత్రబృందానికి అభినందనలు. ఈ సినిమా ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.  


మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ – ‘‘ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌గార్లు హైదరాబాద్‌ సినిమా హబ్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. సినిమాలకు సంబంధించిన  సింగిల్‌ విండో, ఐదో షో, టికెట్స్‌ రేట్స్‌ తదితర సమస్యలను త్వరితగతిన ప్రభుత్వం పరిష్కరిస్తుంది. ‘భీమ్లా నాయక్‌’ ఘనవిజయం సాధించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. 

పవన్‌ కల్యాణ్‌ మాట్లాడుతూ – ‘‘సోదరులు కల్వకుంట్ల తారాక రామారావుగారిని నేను ఆప్యాయంగా రాంభాయ్‌ అని పిలుస్తాను. నా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చినందుకు నా తరఫున, నిర్మాతలు, చిత్రయూనిట్‌ తరఫున కేటీఆర్‌గారికి ధన్యవాదాలు. నేను జనజీవితంలో ఉన్నా కానీ, సినిమా అనేది నాకు అన్నం పెట్టింది. సినిమా లేకపోతే నేను ఈ రోజు ప్రజాసేవలో ఉండే పరిస్థితి ఉండేది కాదు. ఏదో అయిపోదామని కాదు కానీ.. మన దేశానికి, ప్రాంతానికి, మన రాష్ట్రాలకు, మనవాళ్లకీ ఎంతో కొంత చేయాలని... నాకు వేరే వృత్తి తెలియదు. సినిమానే నాకు డబ్బు సంపాదించుకునే వృత్తి. రాజకీయాల్లో ఉన్నా సినిమాల పట్ల బాధ్యతగానే ఉన్నాను.

‘తొలిప్రేమ, ఖుషీ’ సినిమాలను ఎంత బాధ్యతగా చేశామో ‘భీమ్లా నాయక్‌’ను అంతే బాధ్యతగా చేశాం. చిత్రపరిశ్రమకి రాజకీయాలు ఇమడవు. కళాకారులు కలిసే ప్రాంతం ఇది. నిజమైన కళాకారుడికి ప్రాంతం, కులం, మతం అనేవి పట్టవు. అలా కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఎక్కడో చెన్నైలో ఉండిపోయిన తెలుగు చలనచిత్ర పరిశ్రమను.. హైదరాబాద్‌ ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు ఇక్కడికి వచ్చేలా కృషి చేశారు అనేకమంది పెద్దలు, మాజీ ముఖ్యమంత్రి చెన్నారెడ్డిగారు వంటి రాజకీయ ప్రముఖులు. ప్రస్తుతం సీఎం చంద్రశేఖర్‌గారు మరింత ముందుకు తీసుకుని వెళ్లేలా ప్రోత్సాహం అందిస్తూ, తెలుగు చిత్రపరిశ్రమకు అందిస్తున్న తోడ్పాటుకి నా ధన్యవాదాలు. ఎప్పుడైనా సరే చిన్నపాటి అవసరం ఉందంటే... ఆప్యాయంగా దగ్గరకు తీసుకునే తలసానిగారికి ధన్యవాదాలు. అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య ఒక మడమ తిప్పని యుద్ధమే ‘భీమ్లా నాయక్‌ చిత్రం’’ అన్నారు.

‘‘ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు ఒకలా ఉంటే ఇకపై మరోలా ఉంటాయి. కల్యాణ్‌గారిని చూసి నేను చాలా నేర్చుకున్నాను’’ అన్నారు రానా. ‘‘పంజా’ ప్రీ రిలీజ్‌ ఫంక్షన్‌కు పాస్‌ ఉన్నా కూడా లోపలికి వెళ్లి కల్యాణ్‌గారిని చూడలేకపోయాను. ఇప్పుడు ఆయనతో సినిమా చేయడం సంతోషంగా ఉంది’’ అన్నారు సాగర్‌ కె. చంద్ర. సంగీతదర్శకుడు తమన్, రచయిత కాసర్ల శ్యామ్, కెమెరామేన్‌ రవి కె. చంద్రన్, హీరోయిన్‌ సంయుక్తా మీనన్, గాయకుడు మొగిలయ్య, గాయని దుర్గవ్వ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు