బిగ్‌బాస్‌: టీఆర్పీలో స‌రికొత్త రికార్డు

17 Sep, 2020 19:12 IST|Sakshi

ప్ర‌తి ముగ్గురిలో ఇద్ద‌రు బిగ్‌బాస్ చూస్తున్నారు

క‌రోనా అంద‌రికీ షాకులిస్తే బిగ్‌బాస్‌కు మాత్రం బాగా క‌లిసొచ్చింది. వినోదాలు, విహారాలు అంటూ బ‌య‌ట‌కు వెళ్లే ప‌రిస్థితి లేక‌పోవ‌డంతో జ‌నాలు టీవీల‌కు అతుక్కుపోయారు. పైగా టీవీల్లోనూ స‌రైన వినోదం కోసం వెతుకులాడుతున్న స‌మ‌యంలో "వంద రెట్ల ఎంట‌ర్‌టైన్‌మెంట్‌.. నెవ‌ర్ బిఫోర్" అంటూ బిగ్‌బాస్ ప్రేక్ష‌కుల కంట ప‌డ్డాడు. ఇంకేముందీ తెలుగు రాష్ట్రాల ప్ర‌జ‌లు షో చూడ‌టం కోసం వేయి క‌ళ్ల‌తో ఎదురు చూశారు. తీరా ఆ రోజు రానే వ‌చ్చింది. సెప్టెంబ‌ర్ ఆరున‌ వేడుక‌లు, డ్యాన్సులు, కంటెస్టెంట్ల ఎంట్రీల‌తో షో ఘ‌నంగా ప్రారంభ‌మైంది. ప్రేక్ష‌కులు ఛాన‌ల్ మార్చ‌కుండా బిగ్‌బాస్ షోను చూస్తూ ఉండిపోయారు. దీంతో ముందు సీజ‌న్ల టీఆర్పీ రికార్డుల‌ను కింగ్ నాగార్జున బ‌ద్ధ‌లు కొడుతూ స‌రికొత్త రికార్డు సృష్టించారు. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: ముందు తనే వెళ్లిపోతానన్న గంగవ్వ))

అలా షో ప్రారంభ‌ ఎపిసోడ్‌కు 18.5 టీఆర్పీ రేటింగ్ వ‌చ్చింది. ఈ ఎపిసోడ్‌ను దాదాపు 4.5 కోట్ల మంది వీక్షించారు. అంటే ప్ర‌తీ ముగ్గురిలో ఒక‌రు ఈ షోను చూశారు. బిగ్‌బాస్ ఆద‌ర‌ణ ఇంకా ఏమాత్రం త‌గ్గ‌లేద‌ని రుజువు చేస్తున్న ఈ టీఆర్పీ రేటింగ్స్‌ను స్టార్ మా సోష‌ల్ మీడియాలో స‌గ‌ర్వంగా వెల్ల‌డించింది. గ‌త మూడు సీజ‌న్లు కూడా దీనిక‌న్నా త‌క్కువ టీఆర్పీల‌నే ద‌క్కించుకోవ‌డం గ‌మ‌నార్హం. కాగా ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన మొద‌టి సీజ‌న్‌కు 16.18, నాని రెండో సీజ‌న్‌కు 15.05, నాగ్ మూడో సీజ‌న్‌కు 17.9 టీఆర్పీ రేటింగ్స్ వ‌చ్చాయి.  (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: తొలివారం ఎలిమినేట్‌ అయ్యేది అతనే!)

మరిన్ని వార్తలు