Pallavi Prashanth Winning Reasons: బిగ్‌బాస్ 7 టైటిల్‌ ముద్దాడిన రైతుబిడ్డ.. ఆ బలమైన కారణాల వల్లే విజయం..

18 Dec, 2023 07:42 IST|Sakshi

పల్లవి ప్రశాంత్‌.. బిగ్‌బాస్‌ షోకు రావడానికి ముందు సోషల్‌ మీడియా ఉపయోగించే కొద్దిమందికే తెలుసు. కానీ బిగ్‌బాస్‌ 7లోకి వచ్చిన తర్వాత తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఒదిగి ఉండే స్వభావం, చురుకుతనం, టాలెంట్‌, అమాయకత్వం.. ఇవన్నీ జనాలకు బాగా నచ్చేశాయి. మట్టి మనిషిని అని చెప్పుకునే ప్రశాంత్‌.. తాను గెలిస్తే వచ్చే డబ్బును కష్టాల్లో ఉన్న రైతు కుటుంబాలకే ఇస్తానని చెప్పడం ఎంతోమంది మనసులను కదిలించింది. అలా ఇప్పుడు 7వ సీజన్ విజేతగా నిలిచాడు. మరి అతడి గెలుపు వెనకున్న కారణాలేంటి?

చెప్పులరిగేలా తిరిగాడు
'మల్లొచ్చినా అంటే తగ్గేదేలే'.. అని సోషల్‌ మీడియాలో వీడియోలు చేసుకునే ప్రశాంత్‌.. ఎలాగైనా బిగ్‌బాస్‌ షోలో అడుగుపెట్టాలనుకున్నాడు. అన్నపూర్ణ స్టూడియో చుట్టూ చెప్పులరిగేలా తిరిగాడు. ఇప్పుడు విజేతగా గెలిచాడు. అయితే ప్రశాంత్.. బిగ్‌బాస్‌ తెలుగు ఏడో సీజన్‌లో అడుగుపెట్టినప్పుడే తొలి విజయం సాధించాడు.

(ఇదీ చదవండి: బీటెక్‌ కుర్రాడు అమర్.. బిగ్‌బాస్‌ ద్వారా ఎంత సంపాదించాడంటే?)

గెలుపే అంతిమ లక్ష్యంగా..
రైతుబిడ్డగా హౌస్‌లో అడుగుపెట్టిన ప్రశాంత్‌ టాస్కుల్లో విజృంభించి ఆడేవాడు. గెలుపే అంతిమ లక్ష్యంగా పోరాడాడు. విజయం కోసం ఎంతవరకైనా పోరాడతానన్న అతడి ధృడ సంకల్పమే తనను ముందుకు నడిపించింది. ఓడిన ప్రతిసారి రెట్టింపు కసితో ఆడటం జనాలకు ఎంతగానో నచ్చింది. తనను తాను నిరూపించుకునేందుకు దొరికిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు.

నామినేషన్స్‌లో మాత్రం..
షోలో మిగతా టైమ్ అంతా కూడా సింపుల్‌గా ఉండే ప్రశాంత్‌.. నామినేషన్స్‌ వచ్చేసరికి తనలోని మరో యాంగిల్‌ను బయటకు తీసేవాడు. తానేమీ తక్కువవాడిని కాదని, మీకు పోటీనిచ్చే బలమైన కంటెస్టెంట్‌ను అని హౌస్‌మేట్స్‌కు గుర్తు చేశాడు. నామినేషన్స్‌లో అతడి వైఖరిని చూసి ప్రశాంత్‌కు అపరిచితుడిగా ముద్ర వేశారు. అయితే రానురానూ తన తప్పొప్పులను సరిదిద్దుకుంటూ విజయానికి మెట్లు వేసుకుంటూ పోయాడు.

(ఇదీ చదవండి: Bigg Boss 7: అమర్‌దీప్ కారుపై రైతుబిడ్డ ఫ్యాన్స్ దాడి.. అద్దాలు ధ్వంసం)

ఈ సీజన్‌లోనే తొలి కెప్టెన్‌
మొదట్లో రతిక రోజ్‌తో క్లోజ్‌గా ఉంటూ రాంగ్‌ ట్రాక్‌ ఎక్కాడు ప్రశాంత్‌. ఆమె వెన్నుపోటు పొడవడంతో గేమ్‌పై తిరిగి ఫోకస్‌ పెట్టాడు. అప్పటినుంచి తప్పటడగులు వేయకుండా ఎవరి జోలికీ వెళ్లకుండా ఆటమీదే తన ధ్యాసను కేంద్రీకరించాడు. బిగ్‌బాస్‌ హౌస్‌లో ఫస్ట్‌ కెప్టెన్‌గా నిలిచి తన సత్తా ఏంటో చూపించాడు. అలాగే ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ గెలిచి.. తనకు ఆటలో తిరుగులేదని నిరూపించాడు. అయితే ఈ పాస్‌ను తన స్నేహితుల కోసం వాడాలనుకున్నాడు. ఆ అవకాశం రాకపోవడంతో కష్టపడి సంపాదించిన పాస్‌ను వెనక్కు ఇచ్చేందుకు సైతం వెనుకాడలేదు. ఈ నిజాయితీ ప్రేక్షకులకు ఎంతో నచ్చింది.

నిష్కల్మషమైన మనసుకు ఫిదా
నామినేషన్స్‌లో ఎన్ని తిట్టుకున్నా సరే తర్వాత అందరినీ తనే వెళ్లి మరీ పలకరించేవాడు. మనసులో ఎటువంటి కోపాలు పెట్టుకోకుండా హౌస్‌మేట్స్‌ను కలుపుకుపోయేవాడు. ఎవరెన్ని పనులు చెప్పినా కాదనకుండా చేసేవాడు. ఈ వినయం, విధేయత, మంచితనానికి జనాలు ఫిదా అయ్యారు. కామన్‌ మ్యాన్‌ కేటగిరీలో వెళ్లిన ప్రశాంత్‌ రైతుబిడ్డ కావడంతో జనాలకు బాగా కనెక్ట్‌ అయ్యాడు. హౌస్‌లో ఉన్నవాళ్లందరూ సెలబ్రిటీలేనని, ప్రశాంత్‌ మాత్రం మనలో ఒకరైన రైతుబిడ్డ అని ఫీలయ్యారు. దీంతో షో మొదటినుంచే అతడిని మనలో ఒకడిగా ఫీలయ్యారు. వీటితో పాటు చాలా విషయాల్లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ తనదైన మార్క్ చూపించాడు. బిగ్‌‌బాస్ 7వ సీజన్ విజేతగా నిలిచి చరిత్ర సృష్టించాడు.

(ఇదీ చదవండి: బిగ్‌బాస్‌ విన్నర్‌ ప్రశాంత్‌.. మొత్తం ఎన్ని లక్షలు సంపాదించాడంటే?)

A post shared by MALLA OCHINA (@pallaviprashanth_)

>
మరిన్ని వార్తలు