అతిపెద్ద సొరంగం.. హమాస్‌ మాస్టర్‌ ప్లాన్‌ భగ్నం!

18 Dec, 2023 07:39 IST|Sakshi

ఇజ్రాయెల్‌ ఆసక్తికర వీడియో ఫుటేజీ ఒకటి విడుదల చేసింది. గాజా స్ట్రిప్‌ కింద హమాస్‌కు చెందిన భారీ సొరంగం కనుగొన్నట్లు ఆదివారం ప్రకటించింది. దాదాపు నాలుగు కిలోమీటర్ల దూరం ఉన్న ఈ టన్నెల్‌.. కీలకమైన ఎరెజ్‌ ప్రాంత సరిహద్దు ప్రాంతానికి అనుసంధానమై ఉందని  తెలిపింది. అంతేకాదు.. ఇజ్రాయెల్‌పై దాడుల కోసం హమాస్‌ దాచుకున్న భారీ ఆయుధ సంపత్తిని స్వాధీనం చేసుకున్నట్లు ఐడీఎఫ్‌ ఒక ప్రకటన విడుదల చేసింది. 

ఉత్తర గాజా ఎరెజ్‌ సరిహద్దు వద్ద 400 మీటర్ల దూరం నుంచి మొదలైన ఈ టన్నెల్‌.. మొత్తం నాలుగు కిలోమీటర్ల దూరం గాజాకు కలిపి ఉంది.  చిన్నసైజు వాహనాలు సైతం ఆ టన్నెల్‌ గుండా ప్రయానించగలవని, మందమైన గోడలతో ఏర్పాటు చేసిన ఈ సొరంగంలో కొంత భాగం కాంక్రీట్‌తో ఏర్పాటు చేసిన రోడ్డు మార్గం ఉందని ఇజ్రాయెల్‌ ఆర్మీ(ఐడీఎఫ్‌) తన ప్రకటనలో తెలిపింది. 

టన్నెల్‌ గుండా రవాణా సదుపాయంతో పాటు విద్యుత్‌ సరఫరా, వెంటిలేషన్‌ సౌకర్యం, డ్రైనేజీ వ్యవస్థలు ఉన్నాయని పేర్కొంటూ ఇజ్రాయెల్‌ ఆర్మీ ఒక వీడియోను సైతం విడుదల చేసింది.  అక్టోబర్‌ 7వ తేదీన ఇజ్రాయెల్‌ సరిహద్దు ప్రాంతాల్లో హమాస్‌ జరిపిన దాడుల ప్రధాన సూత్రధారి మహమద్‌ యహ్యా నేతృత్వంలోనే ఈ టన్నెల్‌ ఏర్పాటు అయ్యిందని ఆ ప్రకటనలో పేర్కొంది. ఈ టన్నెల్‌ కోసం భారీ సంఖ్యలో ఖర్చు అయ్యి ఉంటుందని అంచనా వేస్తోంది. హమాస్‌ చీఫ్‌ యహ్యా సిన్వార్‌ సోదరుడే ఈ మహమద్‌ యహ్యా.  

ఇదిలా ఉంటే.. డిసెంబర్‌ ప్రారంభం నుంచి ఇప్పటిదాకా 800 వద్ద సొరంగాల్ని కనిపెట్టినట్లు, అందులో 500 టన్నెల్స్‌ని నాశనం చేసినట్లు ఐడీఎఫ్‌ ప్రకటించుకుంది.

>
మరిన్ని వార్తలు