Bigg Boss 5 Telugu: వామ్మో, సన్నీని కొట్టబోయిన ప్రియ, చెంప పగలగొడతానని వార్నింగ్‌

19 Oct, 2021 23:59 IST|Sakshi

Bigg Boss Telugu 5, Episode 45: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఏడోవారం జరిగిన నామినేషన్స్‌ కంటెస్టెంట్లు కాకుండా సన్నీ ఒక్కడే చేసినట్లు ఉందన్నాడు మానస్‌. ఈ మాట హౌస్‌మేట్స్‌ అంటున్నారని సన్నీతో చెప్పుకొచ్చాడు. దీనిపై స్పందించిన సన్నీ.. ప్రియ రవిని నామినేట్‌ చేసింది, దాన్ని నేను ఓకే చేశానంతే అని సింపుల్‌గా చెప్పేశాడు. నామినేషన్స్‌లో సిల్లీ రీజన్స్‌ చెప్తారా? వాళ్లాడితే గేమ్‌, నేనాడితే క్రైమా? అని అసహనం వ్యక్తం చేశాడు. ఏదేమైనా టాస్కుల్లో ఫ్రెండ్‌షిప్‌ చూపిస్తే ఓడిపోయినట్లేనని జెస్సీతో చెప్పుకొచ్చాడు షణ్ముఖ్‌.

ఇక నామినేషన్స్‌ మంట నుంచి ఇంకా బయటపడని ప్రియాంక.. దమ్ముంటే గేమ్‌ ఆడు, సేఫ్‌ గేమ్‌ కాదంటూ కాజల్‌నుద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఆమె డ్రామా క్వీన్‌ అని పేరు పెట్టింది. ఆఖరికి తనను మానస్‌ కూడా అర్థం చేసుకోవట్లేదంటూ ఏడ్చేసింది. అతడిని ఇంత ఇష్టపడుతాను కదా, అతడికి నా మనసేంటో అర్థం కాలేదా? నన్నెందుకు దూరం పెడుతున్నాడు అంటూ యానీ మాస్టర్‌ దగ్గర తన గోడు వెల్లబోసుకుంది. ఇంతలో మానస్‌.. ఆమె దగ్గరకు వెళ్లి ఓదార్చాడు. అంతేకాదు, ఆమె కోరికమేరకు గోరుముద్దలు తినిపించాడు. దీంతో అప్పటిదాకా ముఖం మాడ్చుకున్న పింకీ ముఖం మానస్‌ రాకతో సంతోషంతో విప్పారింది. తను కూడా ఒక కెమెరా అని, నీ మీద స్పెషల్‌ ఫోకస్‌ ఉంటుందని మానస్‌ను హెచ్చరించింది.

నామినేషన్స్‌లో సన్నీ తప్పు చేసి ఒప్పుకోడేంటని రవి చిరాకు పడుతుండగా.. వాడు తప్పు చేశాడంటే నేను ఒప్పుకోనని తెగేసి చెప్పింది కాజల్‌. దీంతో వారిద్దరూ ఈ విషయంపై కాసేపు చర్చోపచర్చలు చేసుకోగా చివరికి రవికి సారీ చెప్పింది కాజల్‌. అనంతరం బిగ్‌బాస్‌ బంగారు కోడిపెట్ట అనే కెప్టెన్సీ పోటీదారుల టాస్క్‌ ఇచ్చాడు. ఇందులో ప్రభావతి అనే కోడి.. కూత పెట్టి గుడ్లు పెడుతుంది. కొన్నిసార్లు కోడిగుడ్ల వర్షం కూడా కురుస్తుంది. ఏ ఇంటిసభ్యుడు ఎక్కువ గుడ్లను అందుకుని వాటిపై తమ ముఖం ఉన్న స్టిక్కర్స్‌ పెడతారో వారే కెప్టెన్సీకి పోటీపడతారు.

నేను అందరి గుడ్ల జోలికొస్త, దొంగతనం చేస్తా, ఎవరేం చేసుకుంటరో చేసుకోండి, అదే నా స్ట్రాటజీ అని ముందుగానే హౌస్‌మేట్స్‌ను హెచ్చరించింది ప్రియ. దీంతో ముందు జాగ్రత్తగా సన్నీ తన గుడ్లను కాపాడమంటూ కాజల్‌ సాయం కోరాడు. అయితే ఇది ఇండివిడ్యువల్‌ టాస్క్‌ అని, సన్నీ, కాజల్‌ కలిసి ఆడటం వల్ల ఈ టాస్క్‌ రద్దయ్యే అవకాశం ఉంటుందని రవి దగ్గర అనుమానం వ్యక్తం చేసింది యానీ. ఇక సన్నీ బుట్టలోని గుడ్లను అదును చూసి మాయం చేసింది ప్రియ. తన కష్టం అంతా బూడిదలో పోసిన పన్నీరైందని బాధపడ్డ సన్నీ తన జోలికొస్తే ఊరుకోనని వార్నింగ్‌ ఇచ్చాడు. దీంతో స్పందించిన ప్రియ ఆ గుడ్లను తానే దోచుకున్నానని క్లారిటీ ఇచ్చింది.

ఆమెను ఏమనాలో అర్థమవక సతమతమైన సన్నీ.. చేతగానోళ్లలాగా ఒక మూలన కూచోవడం కాదు, మంచిగా గేమ్‌ ఆడు అని సూచించాడు సన్నీ. నేను బరాబర్‌ దొంగతనం చేస్తానని కౌంటరిచ్చింది ప్రియ. తనను రెచ్చగొట్టడంతో ఆవేశపడ్డ సన్నీ అక్కడున్న కడ్డీని కొట్టాడు. దీంతో కామన్‌ సెన్స్‌ వాడంటూ మరింత రెచ్చిపోయింది ప్రియ. ఇదిలా వుంటే మానస్‌ ప్రియ దగ్గరకు వెళ్లి, ఆమె ఇచ్చిన గుడ్లు తీసుకోవడం గమనార్హం. ఈ టాస్క్‌లో లోబో ఆడితే మస్త్‌ మజా వచ్చేదని గుర్తు చేసుకున్నారు సన్నీ, రవి. ఇది చూసి సీక్రెట్‌ రూమ్‌లో ఉన్న లోబో ఫుల్‌ ఖుషీగా ఫీలయ్యాడు. చివర్లో సన్నీ, కాజల్‌ బుట్టల్లోని గుడ్లను సిరి, శ్రీరామ్‌ లేపేశారు. ఇంతటితో ఫస్ట్‌ రౌండ్‌ ముగియగా ఈ రౌండ్‌లో అత్యధికంగా మానస్‌ దగ్గర 32 గుడ్లు ఉన్నాయి. అయితే పింకీ అతడికి తన గుడ్లన్నీ ఇచ్చేసిందని, పైగా మానస్‌ ప్రియ దగ్గర కూడా తీసుకున్నాడని విమర్శించింది యానీ.

షణ్ముఖ్‌, సిరి మరోసారి లొల్లి పెట్టుకోగా సిరి ఏడ్చేసింది. అటు మానస్‌.. సన్నీ దగ్గరకు వెళ్లి ఏడ్చేశాడు. దీంతో అతడిని దగ్గరకు తీసుకున్న సన్నీ.. మనం బయటకెళ్లాక లైఫ్‌ టైం బెస్ట్‌ ఫ్రెండ్స్‌లా ఉంటామంటూ ఓదార్చాడు. ఇక రేపటి ఎపిసోడ్‌లో ప్రియ- సన్నీల గొడవ తారాస్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. ప్రియ సన్నీ బుట్ట మీద కన్నేయగా అతడు వెంటనే వచ్చి తన బుట్టను కాపాడుకున్నాడు. ఈ క్రమంలో ప్రియను నెట్టేయగా ఆమె అతడి మీదకు చేయి చేసుకోబోయింది. అంతేకాకుండా చెంప పగలగొడతానంటూ వార్నింగ్‌ ఇచ్చింది. కొట్టుకునేంతవరకు వెళ్లిన వీరిద్దరినీ ఆపడం ఇంటిసభ్యుల వల్ల కావట్లేదు. మరి ఈ గొడవ చల్లారుతుందా? లేదా? అనేది రేపటి ఎపిసోడ్‌లో చూడాలి!

మరిన్ని వార్తలు