Bigg Boss 5 Telugu: షణ్ను, సిరిలను ఓ రేంజ్‌లో ఆడుకున్న మాజీ కంటెస్టెంట్లు

19 Dec, 2021 00:22 IST|Sakshi

Bigg Boss Telugu 5, Episode 105: బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ ఫైనలిస్టులతో మాజీ సీజన్ల కంటెస్టెంట్లు రచ్చరచ్చ చేశారు. మొదటగా ఫస్ట్‌ సీజన్‌ కంటెస్టెంట్లు శివబాలాజీ, హరితేజ హౌస్‌మేట్స్‌తో ముచ్చటించారు. శ్రీరామ్‌తో ఎవరు ఫ్రెండ్‌షిప్‌ చేసినా వారు వెళ్లిపోతారని సెటైర్‌ వేయడంతో అతడు తల పట్టుకున్నాడు. తర్వాత ఒక పీపా పట్టుకుని ఊదితే ఆ పాటేంటో హౌస్‌మేట్స్‌ గెస్‌ చేయాలి. పాట సరిగ్గా గెస్‌ చేస్తే దానికి డ్యాన్స్‌ చేయాలి. ఈ క్రమంలో షణ్ను, సిరి కలిసి జంటగా స్టెప్పులేస్తుంటే మిగతా ముగ్గురు మాత్రం ఎవరికి వారే డ్యాన్స్‌ చేశారు. ఇది చూసిన హరితేజ మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌ అయిన ముగ్గురిపై జాలి చూపించింది. దీంతో రెచ్చిపోయిన శ్రీరామ్‌ సిరిని ఎలిమినేట్‌ చేసినట్లే చేసి మళ్లీ తీసుకొచ్చారంటూ జోక్‌ చేశాడు. ఇక హరితేజ బిగ్‌బాస్‌ షో గురించి, టాప్‌ 5 కంటెస్టెంట్ల గురించి హరికథ చెప్పి వీడ్కోలు తీసుకున్నారు.

తర్వాత రెండో సీజన్‌ కంటెస్టెంట్లు గీతా మాధురి, రోల్‌ రైడా ఆటపాటలతో హౌస్‌మేట్స్‌ను అలరించారు. టాప్‌ 5లో చోటు దక్కించుకున్న సిరి తెలుగు రాష్ట్రాల్లోని మహిళలకు ఆదర్శం అంటూ తెగ పొగిడాడు. అయితే వచ్చిన కంటెస్టెంట్లు అందరూ పొగడ్తలతో పాటు షణ్ను, సిరిల ఫ్రెండ్‌షిప్‌పై సెటైర్లు వేస్తూ వారిని ఓ ఆటాడుకుండటంతో సన్నీ, మానస్‌, శ్రీరామ్‌ పడీపడీ నవ్వారు. అసలే చిన్న మాట అంటేనే తట్టుకోలేని షణ్ను ఇలా అందరూ కలిసి తన మీద పడిపోవడంతో అట్టుడికిపోయాడు. మనిద్దరం హైలైట్‌ అయిపోతున్నామని ముగ్గురికీ మండిపోతున్నట్లుందని సిరితో వాపోయాడు. అయితే సిరి మాత్రం ఏ షిప్‌ అయినా బిగ్‌బాస్‌ హౌస్‌ వరకే అని షణ్ను అన్న మాటను గుర్తు చేసుకుని బాధపడింది. దీంతో అతడు సిరిని ఓదార్చుతూ హగ్‌ చేసుకున్నాడు. ఇది చూసిన సన్నీ.. బయటకు వెళ్లాక షణ్ను హగ్‌ గురూ అయిపోతాడని కామెంట్‌ చేశాడు.

అనంతరం నాలుగో సీజన్‌ కంటెస్టెంట్లు శివజ్యోతి, సావిత్రి హౌస్‌మేట్స్‌తో కబుర్లాడారు. బెలూన్లలోని హీలియం పీల్చుకుని పాట లేదా డైలాగులు చెప్పాలన్నారు. ఈ గేమ్‌లో హౌస్‌మేట్స్‌ గొంతులు మారిపోవడంతో అందరూ పడీపడీ నవ్వారు. ఐదో సీజన్‌ కంటెస్టెంట్లు అఖిల్‌ సార్థక్‌, అరియానా వచ్చీరాగానే శ్రీరామ్‌ చేసిన మొట్ట మొదటి ఆల్బమ్‌లోని సాంగ్‌ ప్లే చేయడంతో అతడు సర్‌ప్రైజ్‌ అయ్యాడు. ఆ వెంటనే కంటెస్టెంట్లందరినీ కొన్ని సరదా ప్రశ్నలడిగారు. అందులో భాగంగా డేటింగ్‌ యాప్‌లో ఎవరినైనా కలిశారా? అని అడగ్గా సన్నీ ఒకరిని కలిశాను కానీ ఆ అమ్మాయి బాయ్‌ఫ్రెండ్‌ గురించి చెప్పుకుంటూ పోయిందని, దీంతో తానే ఆమెను ఓదార్చాల్సి వచ్చిందన్నాడు.

వేరే కంటెస్టెంట్‌ టవల్‌ వాడారా? అన్న ప్రశ్నకు షణ్ను.. శ్రీరామ్‌ టవల్‌ వాడానని చెప్పగా మధ్యలో సిరి కలగజేసుకుంటూ తన టవల్‌ కూడా వాడాడని ఆరోపించింది. కొన్ని ఫొటోలు చూపించి అవి హౌస్‌లో ఎక్కడ ఉన్నాయో చెప్పాలన్న గేమ్‌లో శ్రీరామ్‌ గెలిచాడు. సిరి తాను తీసుకోవాలనుకుని మర్చిపోయిన ఫొటోను అఖిల్‌, అరియానా చూపించడంతో ఆమె చాలా సర్‌ప్రైజ్‌ అయింది. అంతేకాదు షణ్ను, సిరి ఆ ఫొటోలో ఏ పాటకైతే డ్యాన్స్‌ చేశారో మరోసారి అదే సాంగ్‌కు స్టెప్పులేశారు. మొత్తానికి ఈరోజు ఎపిసోడ్‌ సరదా సరదాగా సాగింది.

మరిన్ని వార్తలు