Bigg Boss 5 Telugu: కాజల్‌ ఎలిమినేషన్‌కు అసలు కారణాలివే!

13 Dec, 2021 22:17 IST|Sakshi

బిగ్‌బాస్‌ అంటే చాలామందికి ఇష్టం. కానీ ఈమెకు మాత్రం పిచ్చి. ఆ పిచ్చి ప్రేమతోనే బిగ్‌బాస్‌ షోలో అడుగు పెట్టింది ఆర్జే కాజల్‌. ప్రతిచిన్న విషయానికి కూడా తెగ ఎగ్జైట్‌ అయ్యేది. బిగ్‌బాస్‌ తన పేరును పిలిస్తే కూడా పరవశించిపోయేది. అతి సర్వత్రా వర్జయేత్‌ అన్నట్లుగా ఈ అతి ఆమె కొంప ముంచింది. ఫలితంగా 14వ వారంలో ఎలిమినేట్‌ అయింది. దీంతో టాప్‌ 5లో అడుగు పెట్టాలన్న కోరిక ఫలించకుండానే వెనుదిరిగింది.

కాజల్‌ ఎలిమినేషన్‌ వెనక పెద్ద రాజకీయాలు, కుట్రలు ఏమీ జరగలేవనే చెప్పాలి. ఎందుకంటే ఉన్న ఆరుగురిలో కాజల్‌కు తక్కువ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉంది. వారందరితో పోలిస్తే కాజల్‌ టాస్కుల్లోనూ వెనకబడిందనే చెప్పుకోవాలి. పైగా ఇన్ని వారాలు హౌస్‌లో ఉండగలిగినా ఒక్కసారి కూడా కెప్టెన్‌ కాలేకపోయింది. గత బిగ్‌బాస్‌ సీజన్ల కంటెస్టెంట్స్‌ను ఇంటర్వ్యూ చేయడమే కాక రివ్యూలు కూడా ఇచ్చింది కాజల్‌. దీంతో ఆమెకు బిగ్‌బాస్‌ షో మీద మంచి పట్టు ఉందని, ఎప్పుడేం చేయాలో అంతా ముందే ప్లాన్‌ చేసుకుని వచ్చిందని అంతా భావించారు. ఆమె మాట్లాడినా, ఏం చేసినా కూడా అదంతా గేమ్‌లో భాగమనే నిర్ణయానికి వచ్చారు.

ప్రతి విషయంలో తలదూర్చడం, అతిగా ఎగ్జైట్‌ అవడంతో ఆమెకు కంటెంట్‌ క్వీన్‌, నాగిణి, ట్రాకులు సెట్‌ చేస్తుంది, మ్యారేజ్‌ బ్యూరో నడుపుతుందంటూ రకరకాల బిరుదులు ఇచ్చారు. అలా ఇంటాబయటా నెగెటివిటీ పెరిగింది. దాదాపు అందరు కంటెస్టెంట్లతో గొడవపడింది కాజల్‌. హౌస్‌ నుంచి ఎలిమినేట్‌ అయిన ఎంతోమంది హౌస్‌మేట్స్‌ కాజల్‌తో మాకు కనెక్షన్‌ లేదని తెగేసి చెప్పారు. హౌస్‌లో ఉన్నవాళ్లలో కూడా ఆమె నుంచి నెగెటివ్‌ వైబ్స్‌ వస్తున్నాయంటూ దూరం పెట్టారు. ఇలా మొదటి నుంచి ఆమె నెగెటివిటీని మోస్తూనే వచ్చింది. యానీ మాస్టర్‌ అయితే కాజల్‌ను చూస్తే చాలు తోక తొక్కిన త్రాచులా లేచేది. వీళ్ల గొడవ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అటు రవిని కూడా ఫ్రెండ్‌ అంటూనే పదేపదే తగాదా పడుతూ వచ్చింది. కంటెంట్‌ కోసమే ఇలా గొడవలు పడుతుంది అని హౌస్‌మేట్స్‌ ఓ భావనకు వచ్చారు.

మొదట్లో షణ్ముఖ్‌, తర్వాత మానస్‌, సన్నీలతో ఉండటాన్ని కూడా ప్రేక్షకులు తప్పుపట్టారు. మారుతున్న గేమ్‌ను బట్టి ఆమె తను ఫ్రెండ్‌షిప్‌ను మార్చుకుంటుందని అభిప్రాయపడ్డారు. అయితే ఎప్పుడైతే కాజల్‌కు మానస్‌, సన్నీలతో దోస్తానా కుదిరిందో అప్పటినుంచి ఆమెపై పాజిటివిటీ పెరిగింది. అప్పడం గొడవలో సన్నీ తరపున వకీల్‌సాబ్‌లా వాదించి నాగార్జుననే ఎదిరించింది. ఈ విషయంలో స్నేహం కోసం ఎంతకైనా తెగిస్తుందని ఆమెపై ప్రేక్షకుల్లో అభిమానం పెరిగింది. హౌస్‌మేట్స్‌ అంతా తనను విమర్శిస్తున్నా అవేమీ పట్టించుకోకుండా సన్నీకి ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ వచ్చేలా చేసింది. హౌస్‌లో అందరూ ఆమెను అందరూ టార్గెట్‌ చేసినా చిరునవ్వుతో ఎదురించింది. మాటల్లో క్లారిటీ, ఆత్మవిశ్వాసం, గుండెధైర్యం, స్నేహం విషయంలో నిజాయితీ.. ఆమెను ఇన్నివారాలు ఇంట్లో ఉండనిచ్చాయి.

మొత్తంగా ముళ్లదారిలో ప్రయాణం మొదలుపెట్టిన కాజల్‌ పాజిటివిటీతో బయటకు వచ్చింది.

మరిన్ని వార్తలు