Bigg Boss 5 Telugu: బిగ్‌బాస్‌ హౌస్‌లో అతడు హీరో, ఆమె విలన్‌!

6 Nov, 2021 23:13 IST|Sakshi

Bigg Boss 5 Telugu, Episode 63: సిరిని ఓదార్చడానికి షణ్నుకు తల ప్రాణం తోకకొచ్చింది. 'దీనమ్మ ప్రేమేందిరాబై గిట్ల సంపుతున్నాది, పోరీ పీకినాక హ్యాంగోవర్‌ టార్చరున్నాది..' అంటూ ఒంటరిగా పాటందుకున్నాడు. అయినా దీపు(దీప్తి సునయన)ను భరిస్తే ఎవరినైనా భరించగలను అంటూ తనను తానే ఓదార్చుకున్నాడు. మరోపక్క పింకీ.. దేవుడు నాకు మంచి లైఫ్‌ ఇచ్చి ఉంటే బాగుండేది అంటూ అర్ధరాత్రి ఏడుపందుకుంది. అప్పుడు నీతో హ్యాపీగా ఉండేదాన్నని మానస్‌తో గోడు చెప్పుకుంటూ బాధపడింది. దీంతో మానస్‌.. ఆమెను చేరదీసి ఓదార్చాడు.

కెప్టెన్‌గా షణ్నుకు 9 మార్కులు: నాగ్‌
కానీ మరుసటి రోజు మాత్రం పింకీకి క్లాస్‌ పీకాడు. 'నువ్వు కావాలని, ఏదో అనుకుని నాతో మాట్లాడుతున్నావు, నేను చిన్నపిల్లాడిని కాదు, నాకు తెలీదు అనుకోకు..' అని చురకలంటించాడు. దీంతో పింకీ సరేనని తలూపింది. కెప్టెన్సీ టాస్క్‌లో షణ్ను తమను సపోర్ట్‌ చేయలేదని అటు సిరి, ఇటు జెస్సీ బాగా హర్టయ్యారు. దీంతో షణ్ను వాళ్లిద్దరినీ బతిమాడలేక చచ్చిపోయాడు. నాగార్జున స్టేజీపైకి వచ్చీరావడంతోనే యానీ కెప్టెన్‌ అయిందంటూ ఆమెను మెచ్చుకున్నాడు. కెప్టెన్‌గా నీకు నువ్వు ఎన్ని మార్కులిచ్చుకుంటావని నాగ్‌ అడగ్గా అతడు 7 అని టపీమని ఆన్సరిస్తాడు. కానీ తాను మాత్రం 9 మార్కులిస్తానని చెప్పాడు నాగ్‌. ఇక కొద్దిరోజులుగా దూరందూరంగా ఉంటున్న సిరి, షణ్నులను ఫ్రెండ్‌షిప్‌ సాంగ్‌తో కలిపేశాడు నాగ్‌.
(చదవండి: Archana: ఆ హీరో వంకరగా ఆలోచించేవాడు.. అతడి నిజస్వరూపం వేరే..)

కాజల్‌తో నాగిన్‌ జ్యూస్‌ తాగిపించిన యానీ
కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్క్‌లో నిన్ను చిత్రహింసలు పెట్టిన టీమ్‌లో నుంచి ఒకరిపై ప్రతీకారం తీర్చుకోమని అవకాశం ఇచ్చాడు నాగ్‌. దీంతో రవి.. సోయా సాస్‌, చిల్లీ సాస్‌, గుడ్డు.. అన్నీ కలిపి దానికి షణ్స్‌ సిర్స్‌ జెస్స్‌ కాక్‌టెయిల్‌ అని పేరుపెట్టాడు. తప్పించుకునే దారి లేక షణ్ను దాన్ని అతి కష్టం మీద దాన్ని తాగేశాడు. యానీ... కాజల్‌తో మిర్చి తినిపించి తర్వాతో నాగిన్‌ జ్యూస్‌ తాగమని చేతికందించింది. అయితే కాజల్‌ ఎత్తిన గ్లాసు దించకుండా తాగి అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రియాంక ఇచ్చిన పచ్చిగుడ్డును మింగేశాడు రవి. శ్రీరామ్‌.. సన్నీతో మిర్చి తినిపించాడు. ఆ వెంటనే జ్యూస్‌లో ఇంకేవేవో కలపడానికి ప్రయత్నించగా మొగడా ఆగరా అంటూ విసుక్కుంటూనే మొత్తానికి తాగేశాడు సన్నీ.

నేను నమ్మే ఏకైక వ్యక్తి ఇతడే: కాజల్‌
హౌస్‌మేట్స్‌తో నాగ్‌.. ఎవరు హీరో? ఎవరు విలన్‌? గేమ్‌ ఆడించాడు. ముందుగా సిరి.. షణ్ముఖ్‌కు స్టార్‌ బ్యాడ్జ్‌ పెట్టి అతడు ఎప్పుడూ హీరోనే అని చెప్తూ మురిసిపోతూ, ప్రియాంక సింగ్‌ తనకు విలన్‌ అని పేర్కొంది. ప్రియాంక.. మానస్‌ హీరో అని, సిరి విలన్‌ అని తెలిపింది. శ్రీరామ్‌.. విశ్వ తన హీరో అని, సిరి విలన్‌ అని పేర్కొన్నాడు. కాజల్‌.. నన్ను విలన్‌ అనుకుంటున్న యానీయే విలన్‌ అని చెప్పుకొచ్చింది. ఇక సన్నీకి హీరో బ్యాడ్జ్‌ పెట్టబోగా అతడు ఇది ఎక్స్‌పెక్ట్‌ చేయలేదన్నాడు. దీంతో కాజల్‌ యూటర్న్‌ తీసుకుని మానస్‌కు స్టార్‌ బ్యాడ్జ్‌ పెట్టింది. నేను నమ్ముతున్న ఏకైక వ్యక్తి మానస్‌ అంటూ అతడిని హీరోను చేసింది. సన్నీ.. జెస్సీ హీరో అవ్వాలంటూ అతడికి స్టార్‌ బ్యాడ్జ్‌ పెట్టాడు. ప్రియాంకను విలన్‌ అని చెప్పుకొచ్చాడు. తర్వాత సిరి సేఫ్‌ అయినట్లు ప్రకటించాడు నాగ్‌.

నాకెప్పుడూ ఒకరే విలన్‌: షణ్ను
తర్వాత రవి వంతు రాగా.. తన నమ్మకం ఎప్పుడూ వమ్ము చేయలేదని, టాస్కుల్లో 100 శాతం కష్టపడతాడంటూ విశ్వను హీరోగా పేర్కొన్నాడు. ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియని షణ్ను విలన్‌ అని చెప్పాడు. ఇక షణ్ను.. తనకెప్పుడూ ఒకరే విలన్‌ అంటూ రవి మీద క్రాస్‌ గుర్తు గుద్దాడు. ఈ విలన్‌ లేకపోతే తాను హీరో అవలేనన్నాడు. అబ్బాయిల కంటే దారుణంగా గేమ్‌ ఆడే సిరి హీరో అని పొగిడాడు. యానీ.. కాజల్‌తో కంఫర్టబుల్‌గా లేనంటూ ఆమెను విలన్‌గా పేర్కొంది. మొదటి వారం నుంచి చాలా చక్కగా ఆడుతాన్నాడంటూ విశ్వకు స్టార్‌ బ్యాడ్జ్‌ ఇచ్చింది. విశ్వ.. గేమ్‌ ఛేంజర్‌ శ్రీరామ్‌ హీరో అని, ప్రియాంక సింగ్‌ విలన్‌ అని అభిప్రాయపడ్డాడు.

పాపం సన్నీ, ఆఖరికి కమెడియన్‌..
జెస్సీ.. తన గురించి ఎంతో కేర్‌ తీసుకుంటూ, అమ్మలా చూసుకునే సిరి హీరో అని ఆకాశానికెత్తాడు. గేమ్‌లో డల్‌ అవుతున్న కాజల్‌ విలన్‌ అని చెప్పుకొచ్చాడు. మానస్‌.. ప్రియాంక తనకు హీరో అని చెప్పడంతో ఆమె ఆనంద భాష్పాలు కార్చింది. అనంతరం రవి విలన్‌ అని చెప్పాడు. మొత్తంగా ఈ టాస్క్‌లో విశ్వ ఈ హౌస్‌కు హీరోగా, ప్రియాంకను విలన్‌గా తేల్చేశాడు నాగ్‌. హీరో, విలన్‌ ఏ ట్యాగూ రాని సన్నీని హీరోకు, విలన్‌కు మధ్యలో ఉన్న కమెడియన్‌ అన్నాడు నాగ్‌. ఏదేమైనా విశ్వను హీరో అంటూనే హౌస్‌ నుంచిం పంపించి వేస్తున్నట్లు తెలుస్తోంది.

]

మరిన్ని వార్తలు