బిగ్‌ బాస్‌ అర్జున్‌కు సినిమా ఛాన్స్‌ ఇచ్చిన డైరెక్టర్‌ బుచ్చిబాబు..!

13 Nov, 2023 08:11 IST|Sakshi

బిగ్‌ బాస్‌తో వచ్చిన గుర్తింపు కొందరికి వరంలా మారుతుంది. వారి జీవితాన్ని కూడా ఉన్నతస్థాయికి తీసుకెళ్తుంది. ఇప్పటికే కొందరి విషయంలో అది నిజమైంది కూడా.. ఈ సీజన్‌లో వైల్డ్‌ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన అర్జున్‌కు ఊహించని అవకాశం దక్కింది. ప్రముఖ డైరెక్టర్‌ బుచ్చిబాబు బిగ్‌ బాస్‌ వేదికపైకి గెస్ట్‌గా వచ్చిన విషయం తెలిసిందే.. ఆ సమయంలో అర్జున్‌కు సినిమా ఛాన్స్‌ ఇచ్చాడు బుచ్చిబాబు... తను రామ్‌ చరణ్‌తో తీయబోయే సినిమాలో ఛాన్స్‌ ఇస్తున్నట్లు ప్రకటించడంతో అర్జున్‌ ఎగిరిగంతేశాడు. దీపావళి సందర్భంగా బిగ్‌బాస్‌ హౌస్‌లోకి వెళ్లిన బుచ్చిబాబు.. అర్జున్‌ ఆట తీరును మెచ్చుకున్నారు.

తన కోసం వచ్చినందుకు బుచ్చిబాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపాడు అర్జున్​.  'మీ ఉప్పెన సినిమాకు అవార్డు వచ్చిన తర్వాత మిమ్మల్ని కలవడానికి రెండు మూడుసార్లు ఆఫీస్‌కు వచ్చాను. కానీ మీరు చెన్నై వెళ్లారని చెప్పారు. ఫోన్‌ చేద్దామనుకున్నా కుదరలేకపోయింది. ఈలోగా ఉన్నపలంగా బిగ్​బాస్​కు రావాల్సి వచ్చింది' అని అర్జున్‌ అన్నారు. దీనిపై స్పందించిన బుచ్చిబాబు.. 'రామ్‌ చరణ్‌ సర్‌ మూవీలో నువ్వొక సూపర్‌ పాత్ర చేయబోతున్నావ్‌. ఫిక్స్‌ అయిపో' అంటూ పండగ వేళ అర్జున్‌కి ఊహించని సర్​ప్రైజ్​ ఇచ్చారు. 

ఈ చిత్రం కోసం ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్​ గ్రహీత ఏఆర్‌ రెహమాన్‌ పనిచేస్తున్నట్లు బుచ్చిబాబు అధికారికంగా ప్రకటించారు. దీంతో బిగ్​బాస్​ కంటెస్టెంట్లు అందరూ కేరింతలు కొట్టారు. గేమ్‌ చేంజర్‌ తర్వాత RC 16 షూటింగ్‌ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అంబటి అర్జున్‌ కూడా  పలు సీరియల్​లతో బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. అర్ధనారి, సుందరి వంటి సీరియల్స్‌లలో ఆయన ముఖ్యపాత్ర పోషించారు. అంతేకాకుండా గోపీచంద్‌ 'సౌఖ్యం'లో విలన్‌గానూ మెప్పించాడు. క్రీడా నేపథ్యంలో రూపొందనున్న రామ్‌ చరణ్‌ సినిమాలో అర్జున్‌కు ఛాన్స్‌ దక్కడం గొప్ప విషయమేనని చెప్పవచ్చు. 

మరిన్ని వార్తలు