Bigg Boss Prashanth: పల్లవి ప్రశాంత్‌కు 14 రోజుల రిమాండ్‌.. వారిద్దరిపై నమోదైన కేసు ఇదే

21 Dec, 2023 07:56 IST|Sakshi

బిగ్‌బాస్‌ సీజన్‌-7 విజేత పల్లవి ప్రశాంత్‌, అతని సోదరుడిని జూబ్లీహిల్స్‌ పోలీసులు బుధవారం రాత్రి అతని స్వగ్రామం గజ్వేల్‌లోని కొల్గూరులో అరెస్ట్‌ చేశారు. బిగ్‌ బాస్‌ ఫైనల్‌ రోజున అన్నపూర్ణ స్టూడియో వద్ద ప్రభుత్వ ఆస్తులపై జరిగిన దాడి ఘటనలో పోలీసులు ప్రశాంత్‌ను ఏ-1గా, అతని సోదరుడు మనోహర్‌ను ఏ-2గా పేర్కొంటూ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.  బిగ్‌ బాస్‌ ఫైనల్‌ ముగిసిన తర్వాత వీరిద్దరూ కూడా పరారీలో ఉన్నారు. పోలీసులు అరెస్ట్‌ వారెంట్‌ ఇష్యూ చేయడంతో లాయర్‌ ద్వారా వారిద్దరూ మళ్లీ ఇంటికి చేరుకున్నారు.  విషయం తెలుసుకున్న పోలీసులు వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు.

సీజన్‌- 6 కాంటెస్టెంట్‌ గీతూరాయల్‌ కారును కూడా ధ్వంసం చేశారు. ఆపై ఆమె కారులోకి చేతులు పెట్టి అసభ్యంగా ప్రవర్తించారు. దీంతో గీతూ రాయల్ పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా పెట్టారు. పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించినా వినకపోవడంతో పోలీసులు లాఠీ ఛార్జ్‌ చేశారు. దాంతో అల్లరిమూకలు రోడ్లపైకి పరుగులు తీస్తూ ఆరు ఆర్టీసీ బస్సుల అద్దాలను పగులగొట్టారు.  ఈ ఘటనపై ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ కేసు పెట్టడం జరిగింది. దీంతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

పల్లవి ప్రశాంత్‌పై కేసు.. కారణం
అన్నపూర్ణ స్టూడియో వద్ద గొడవ జరుగుతున్న సమయంలో బిగ్‌ బాస్‌ సీజన్‌-7 విజేత పల్లవి ప్రశాంత్‌ బయటకు వస్తున్న క్రమంలో పోలీసులు అడ్డగించి మరో గేటు నుంచి పంపారు. కానీ ఆ సమయానికే ప్రశాంత్‌ను ర్యాలీగా తీసుకెళ్లేందుకు అతని సోదరుడు మనోహర్‌ తన మిత్రుడు వినయ్‌ ద్వారా రెండు కార్లను అద్దెకు తెచ్చుకున్నారు. ఇది గమనించిన పోలీసులు ఇప్పటికే ఇక్కడ పరిస్థితి గొడవలతో నిండి ఉంది.. ఈ సమయంలో ర్యాలీ అంటే కష్టం.. బయటకు వెళ్లి ఎక్కడైన సభ పెట్టుకోండి అని చెప్పి.. ఆ కార్లను   పక్కనపెట్టి పోలీసులు వేరే వాహనంలో ప్రశాంత్‌ను పంపించారు.  

అవన్నీ లెక్క చేయకుండా ప్రశాంత్‌ తన అభిమానుల మధ్య ర్యాలీ కోసం అద్దె కార్లతో తిరిగి అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకున్నాడు. ఈ క్రమంలో పశ్చిమ మండలం డీసీపీ జోయల్‌ డేవిస్‌ మళ్లీ జోక్యం చేసుకుని ప్రశాంత్‌ను రావొద్దని చెప్పినా.. ప్రశాంత్‌ వినిపించుకోలేదని ఆయన తెలిపారు. ప్రశాంత్‌ను అడ్డగించి పంపించేశారు. దీంతో ఆయన ఫ్యాన్స్‌ ఫైర్‌ కావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అక్కడ కార్లపై దాడితో పాటు రెండు పోలీసుల వాహనాలు ధ్వంసం అయ్యాయి. అంతటితో ఆగని అల్లరి మూకలు ఆరు ఆర్టీసీ బస్సు అద్దాలను పగలకొట్టారు. 

ప్రశాత్‌కు 14 రోజుల రిమాండ్‌
ప్రభుత్వ ఆస్థుల ధ్వంసం కేసులో  జూబ్లీహిల్స్‌ ఎస్సై మెహర్‌ రాకేశ్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బిగ్‌ బాస్‌ విన్నర్‌ ప్రశాంత్‌, మనోహర్‌, వినయ్‌తో పాటు అద్దె కార్లను నడిపిన డ్రైవర్లు సాయికిరణ్‌, రాజుపై కూడా కేసు నమోదు చేశారు. ఈనెల 19న డ్రైవర్లు సాయికిరణ్‌, రాజుకు కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించిన విషయం తెలిసిందే. తాజాగా ప్రశాంత్‌, అతని సోదరుడిని పోలీసులు అరెస్టు చేశారు. తాజాగా ప్రశాంత్‌, అతని సోదరుడు మనోహర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేసి  జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‏కు తరలించారు.

ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం కేసులో దాదాపు ఆరు గంటల పాటు జూబ్లీహిల్స్ స్టేషన్‏లో వారిద్దరినీ విచారించి ఆపై రాత్రి సమయంలోనే జడ్జి ఇంట్లో పల్లవి ప్రశాంత్‌తో పాటు ఆయన సోదరుడిని పోలీసులు ప్రవేశపెట్టారు. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. పల్లవి ప్రశాంత్‌‏తో పాటు సోదరుడు మనోహర్‌కు కూడా 14 రోజుల రిమాండ్‌ విధించారు. దీంతో అర్ధరాత్రి వారిద్దరినీ చల్‌గూడ జైలుకు పోలీసులు తరలించారు. పోలీసులు ముందే హెచ్చరించినా సెలబ్రిటీ ముసుగులో ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ.. ప్రభుత్వ ఆస్థులకు నష్టం కలిగేలా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోమని పోలీసులు తెలిపారు. ఫైనల్‌గా వారిద్దరిపై ప్రభుత్వ,  ప్రైవేటు ఆస్తులు ధ్వంసం కేసును పోలీసులు నమోదుచేశారు.

>
మరిన్ని వార్తలు