Captain Miller Movie Review Telugu: ‘కెప్టెన్‌ మిల్లర్‌’ రివ్యూ

26 Jan, 2024 09:33 IST|Sakshi
Rating:  

టైటిల్‌: కెప్టెన్‌ మిల్లర్‌
నటీనటులు: ధనుష్‌, ప్రియాంక అరుల్‌ మోహన్‌, శివరాజ్‌కుమార్‌, సందీప్‌ కిషన్‌, నివేదిత తనీష్‌ తదితరులు
నిర్మాణ సంస్థ: సత్యజ్యోతి ఫిల్మ్స్
నిర్మాతలు: జి. శరవణన్, సాయి సిద్ధార్థ్
దర్శకత్వం: అరుణ్ మాథేశ్వరన్
సంగీతం: జీవి ప్రకాశ్‌ కుమార్‌
సినిమాటోగ్రఫీ: సిద్ధార్థ్‌ నూని
ఎడిటర్‌: నాగూరన్‌
విడుదల తేది: జనవరి 26, 2024(తెలుగులో)

కథేంటంటే..
ఈ సినిమా కథంతా స్వాతంత్రానికి పూర్వం అంటే 1930లో సాగుతుంది. తమిళనాడులోని ఓ చిన్న గ్రామానికి చెందిన అగ్ని అలియాస్‌ అగ్నీశ్వర(ధనుష్‌) సొంత ఊరిలోనే కుల వివక్షకు గురవుతాడు.త‌క్కువ కులానికి చెందిన వార‌నే సాకుతో ఆ ఊరి వాళ్లని గుడిలోకి రానివ్వడు అక్కడి రాజు(జయప్రకాష్‌). ఆ కోపంతో అగ్ని బ్రిటీష్‌ సైన్యంలో చేరతాడు. అక్కడ ట్రైనింగ్‌ పూర్తయ్యాక అతనికి మిల్లర్‌ అనే పేరుపెట్టి విధుల్లోకి పంపుతారు. ఫస్ట్‌ డ్యూటీలోనే తన పై అధికారిని చంపేస్తాడు. అనంతరం తోటి సైనికుడు రఫీక్‌(సందీప్‌ కిషన్‌) సహాయంతో అక్కడ నుంచి పారిపోయి దొంగగా మారుతాడు.

రాజన్న(ఎలగో కుమారవేల్‌) ముఠాతో కలిసి దొంగతనాలు చేస్తూ..వచ్చిన డబ్బులో కొంచెం స్వాతంత్రం కోసం పోరాటం చేస్తున్న సంఘాలకు పంపుతుంటారు. ఓ సారి తన ఊరిలోని గుడిలో  రహస్యంగా దాచిపెట్టిన విలువైన ఓ పెట్టెను బ్రిటీష్‌ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. వారి నుంచి ఆ పెట్టెను మిల్లర్‌ దొంగిలిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగింది? ఆ పెట్టెను మిల్లర్‌ ఎందుకు దొంగిలించాల్సి వచ్చింది? అందులో ఏం ఉంది? తన ఊరి ప్రజలపై దండయాత్రకు వచ్చిన బ్రిటీష్‌ సైన్యాన్ని కెప్టెన్‌ మిల్లర్‌ ఎలా తిప్పికొట్టాడు? ఈ కథలో భానుమతి(ప్రియాంక అరుల్‌ మోహన్‌), శివన్న(శివరాజ్‌కుమార్‌)ల పాత్ర ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

ఎలా ఉందంటే.. 
అంటరానితనం, కులవివక్షతో , నిమ్నవర్గాల అణచివేత నేపథ్యంలో తమిళ్‌తో పాటు తెలుగులోనూ చాలా సినిమాలు వచ్చాయి. కెప్టెన్‌ మిల్లర్‌ కథ కూడా అలాంటిదే. బ్రిటీష్‌ కాలంలో కుల వివక్ష ఎలా ఉండేది? తక్కువ కులం వారిని బ్రిటీష్‌ వారితో పాటు సంస్థాన రాజులు ఎలా చిన్న చూపు చూసేవారు? తమ అవసరాలకు ఎలా వాడుకునేవారు? అనేది ఈ చిత్రంలో చూపించాడు దర్శకుడు అరుణ్‌ మాథేశ్వరన్‌.  అణగారిన వర్గానికి చెందిన ఓ యువకుడి జర్నీని ఐదు చాప్టర్లుగా విడగొట్టి చెబుతూ..అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలియజేసే ప్రయత్నం చేశాడు.

దర్శకుడు ఎంచుకున్న పాయింట్‌ బాగున్నప్పటికీ.. తెరపై చూపించడంలో పూర్తిగా సఫలం కాలేదు. బీభత్సమైన వయొలెన్స్‌ కారణంగా కథలోని మెయిన్‌ పాయింట్‌కి ఆడియన్స్‌ కనెక్ట్‌ కాలేకపోయారు. హీరో  ఎవరి కోసం పోరాడుతున్నాడో, ఎందుకు మారిపోయాడో అనేది క్లారిటీగా చూపించలేకపోయారు. సన్నివేశాల పరంగా చూస్తే సినిమా బాగుంది. కానీ ఓవరాల్‌గా చూస్తే మాత్రం గత సినిమాలన్నీ గుర్తొస్తాయి.  ఈ కథలో సినిమాటిక్‌ లిబర్టీని కూడా ఎక్కువే తీసుకున్నాడు దర్శకుడు. కథ 1930లో సాగినప్పటికీ.. అత్యాధునిక ఆయుధాలు వాడడం, స్టైలిష్ బైక్స్‌, గాగూల్స్ వాడ‌టం వాస్తవికతతో దూరంగా అనిపిస్తాయి. 

'ఘోర హరుడు' కథతో సినిమా ప్రారంభం అవుతుంది.  ఆ తర్వాత  హీరో ఎంట్రీ.. అతని నేపథ్య సన్నివేశలను చూపించారు. హీరో బ్రిటీష్‌ సైన్యంలోకి చేరడానికి గల కారణం బలంగా ఉంటుంది. అయితే సైన్యం నుంచి బయటకు వచ్చిన తర్వాత కథ సాగదీసినట్లుగా అనిపిస్తుంది. సినిమాలోని ప్రధాన పాత్రలన్నీ ఫస్టాఫ్‌లోనే పరిచయం చేశారు. దీంతో ఆయా పాత్రల తీరు ఎలా ఉండబోతుందనేది ఆడియన్స్‌కి ముందే తెలిసిపోతుంది.  అలాగే ఇన్ని పాత్రలను పరిచయం చేయడంతో కథ సాగదీతగా అనిపిస్తుంది.  ఇంటర్వెల్‌కి ముందు వచ్చే యాక్షన్‌ సీన్‌ మాత్రం అదిరిపోతుంది.  ఇంటర్వెల్‌ ట్విస్ట్‌ కూడా బాగుంటుంది. ఇక సెకండాఫ్‌లో వయోలెన్స్‌ మరింత ఎక్కువతుంది. బ్రిటీష్‌ సైన్యంతో పాటు స్థానిక రాజు చేసే కుట్రలు అంతగా ఆకట్టుకోలేవు. అయితే సైన్యంతో హీరో గ్యాంగ్‌ చేసే పోరాట ఘట్టాలు మాత్రం అదిరిపోతాయి.  క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ కూడా ఆకట్టుకుంటుంది.

సినిమాలోని సంభాషణలు కూడా ఆలోచింపచేస్తాయి.  ‘మనం వాళ్ల(బీటీష్‌) దగ్గర బానిసలమే.. వీళ్ల(స్థాయిక రాజు) దగ్గర బానిసలమే.. వీళ్ల కంటే తెల్లోళ్లే నయం. ఇక్కడ ఉంటే మనల్ని చెప్పులు కూడా వేసుకోనివ్వరు. అదే బ్రిటిష్ సైన్యంలో చేరితే బూట్లు ఇస్తారు. ఇక్కడ మనల్ని గుళ్లోకి రానివ్వరు. అక్కడ వాళ్లు పక్కన కూర్చోపెట్టుకుని మంచి భోజనం పెడతారు. దేన్ని స్వాతంత్రం అన్నాలి?’ లాంటి డైలాగ్స్‌ అప్పట్లో అంటరానితనం ఏ స్థాయిలో ఉండేదో తెలియజేస్తాయి. 

ఎవరెలా చేశారంటే.. 
ఈ సినిమాలో మొత్తం ధనుష్‌ వన్‌మ్యాన్‌ షో. అగ్నిగా, కెప్టెన్‌ మిల్లర్‌గా  ధనుష్‌ అదరగొట్టేశాడు. అయితే ఇలాంటి పాత్రలు ధనుష్‌కి కొత్తేమి కాదు. గతంలో కూడా ఈ తరహా పాత్రల్లో నటించాడు. ఇక శివన్నగా శివరాజ్‌కుమార్‌ తన పాత్ర పరిధిమేర అద్భుతంగా నటించాడు. భానుమతిగా ప్రియాంక అరుల్‌ మోహన్‌ ఆకట్టుకుంది. టాలీవుడ్‌ యంగ్‌ హీరో సందీప్‌ కిషన్‌ పాత్ర నిడివి తక్కువే అయినా.. గుర్తిండిపోతుంది. నివేదితా సతీష్‌  డిఫరెంట్‌ పాత్రలో నటించింది. రాజుగా జయప్రకాశ్‌, రాజన్నగా ఎలగో కుమారవేల్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. 

టెక్నికల్‌ పరంగా ఈ సినిమా అద్భుతంగా ఉంది. సినిమాటోగ్రఫీ బాగుంది. 1930ల నాటి పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించాడు సినిమాటోగ్రాఫర్ సిద్థార్థ్. జీవి ప్రకాశ్‌ బీజీఎం సినిమా స్థాయిని పెంచింది. యాక్షన్‌ సీన్స్‌ అదరిపోయాయి. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. 

Rating:  
(2.5/5)

whatsapp channel

మరిన్ని వార్తలు