Chiranjeevi: నన్ను ఎద్దేవా చేసినవారిని ప్రేమగా దగ్గరకు తీసుకుంటాను..

13 Oct, 2022 17:54 IST|Sakshi

అలయ్‌ బలయ్‌ కార్యక్రమంలో మెగాస్టార్‌ చిరంజీవిపై ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజేసిన విషయం తెలిసిందే! 'చిరు ఫొటో సెషన్‌ ఆపకపోతే కార్యక్రమం నుంచి వెళ్లిపోతా'నని గరికపాటి చిరును బెదిరించడం సరి కాదంటూ మెగా ఫ్యాన్స్‌ సోషల్‌ మీడియాలో విరుచుకుపడ్డారు. తాజాగా ఈ వివాదంపై చిరంజీవి స్పందించాడు. గరికపాటి పెద్దాయన అని, ఆయన చేసిన వ్యాఖ్యలపై చర్చించుకోవాల్సిన అవసరం లేదని చెప్పడంతో ఈ వివాదానికి ముగింపు పలికినట్లైంది.

గాడ్‌ ఫాదర్‌ సక్సెస్‌లో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చిరంజీవి మాట్లాడుతూ.. మొన్న వచ్చిన ఆచార్య ఫ్లాప్‌ అయింది. అందుకని నేను బాధతో కుంగిపోలేదు. బయ్యర్లను కాపాడాలని నేను, రామ్‌చరణ్‌ మా పారితోషికంలో ఎక్కువ మొత్తాన్ని నిర్మాతలకు తిరిగి ఇచ్చేశాం. గాడ్‌ఫాదర్‌ సినిమా విషయానికి వస్తే.. లూసిఫర్‌ సినిమాలో చిన్న చిన్న మార్పులు చేస్తే నాకు పర్ఫెక్ట్‌గా సెట్‌ అవుతుందని సుకుమార్‌.. చరణ్‌కు చెప్పాడట. ఐడియా ఇచ్చాడు కానీ తర్వాత అందుబాటులో ఉండలేదు.  ఒక రోజు చరణ్ బాబు దర్శకుడు మోహన్ రాజా పేరు చెప్పాడు. తని వరువన్‌ను అద్భుతంగా తీసిన ఆయన లూసిఫర్ రీమేక్‌కు న్యాయం చేస్తాడనే సంపూర్ణ నమ్మకం కలిగింది. నిజానికి రీమేక్‌ సినిమాలు చేయడం ఒక సవాల్‌. కానీ ప్రేక్షకుల ఆదరణ వల్ల ఘరానా మొగుడు, ఠాగూర్‌.. ఇప్పుడు గాడ్‌ ఫాదర్‌ గొప్ప విజయాలు అందుకున్నాయి.

సల్మాన్‌ ఖాన్‌.. గాడ్‌ ఫాదర్‌ చేసినట్లే నాకూ వేరే ఇండస్ట్రీ నుంచి పిలుపు వస్తే తప్పకుండా చేస్తాను. ఎలాంటి భాషా, ప్రాంతీయ బేధాలు లేకుండా 'ఇండియన్ సినిమా' అనే పేరు రావాలని నా కోరిక. ఇకపోతే నేను చాలా విషయాల్లో తగ్గితే తప్పేంటని అనుకుంటాను. ఇక్కడ తగ్గటం అంటే సంయమనం పాటించడం. నిజం నిలకడగా తెలుస్తుందనే మాటను నమ్మినవాడిని నేను. నన్ను ఎద్దేవా చేసినవారే మళ్లీ వారి తప్పు తెలుసుకుని నా దగ్గరకు వస్తే వారిని ప్రేమగా దగ్గరకు తీసుకోవడమే నాకు తెలిసిన ఫిలాసఫీ' అని చెప్పుకొచ్చాడు చిరంజీవి.

చదవండి: సినిమా ఛాన్స్‌ అని నడుము చూపించమన్నాడు: నటి
నయన్‌ సరోగసీపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం

మరిన్ని వార్తలు