Chiranjeevi-Surekha : చిరంజీవి, సురేఖల పెళ్లి ఎలా జరిగిందో తెలుసా..

20 Feb, 2022 16:04 IST|Sakshi

మెగాస్టార్‌ చిరంజీవి టాలీవుడ్‌లో అంచెలంచెలుగా ఎదిగి కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్నారు. స్వయంకృషితో ఒక్కో మెట్టూ ఎదుగుతూ తనకంటూ ప్రత్యేక పేజీని లిఖించుకున్నారు.1978లో పునాదిరాళ్లు సినిమాతో ఇండస్ట్రీలోకి వచ్చిన చిరంజీవి తనదైన నటన, డ్యాన్సు స్టెప్పులతో ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్నారు. కెరీర్‌లో ఎదుగుతున్న సమయంలో ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య కూతురు సురేఖతో 1980 ఫిబ్రవరి 20న చిరంజీవి వివాహం జరిగింది.

అయితే అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్న చిరుకి కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయడం ఏంటని అల్లు రామలింగయ్య వద్ద చాలా మంది అనుమానాలు వ్యక్తం చేశారట. అయినా ఇవేం పట్టించుకోని ఆయన చిరంజీవి కష్టపడే తత్వాన్ని గుర్తించి ఎప్పటికైనా అతడు స్టార్‌ హీరో అవుతాడని నమ్మకంతో చెప్పేవారట. ఆ దిశగా చిరును ఎంతగానో ప్రోత్సహించేవారట.

ఇక ఓ ఇంటర్వ్యూలో తన పెళ్లి నాటి సంగతులను గుర్తుచేసుకున్న చిరంజీవి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 'పెళ్లి సమయానికి తాతయ్య ప్రేమ లీలలు అనే సినిమా చేస్తున్నా.  అందులో నూతన్‌ ప్రసాద్‌కు నాకూ కొన్ని కీలక సీన్లు ఉన్నాయి. అప్పటికి ఆయన ఫుల్‌ బిజీ ఆర్టిస్టు కావడంతో ఆయన డేట్స్‌ కోసం పెళ్లి వాయిదా వేసుకోవాల్సి వస్తుందేమోనని అనుకున్నాం.

కానీ నిర్మాత షూటింగ్‌ని వాయిదా వేసి మా పెళ్లికి గ్యాప్‌ ఇచ్చారు. ఇక పెళ్లి పీటల మీద కూర్చొనేటప్పటికి నా చొక్కా చిరిగిపోయింది. అది చూసి సురేఖ వెళ్లి బట్టలు మార్చుకోవచ్చుగా అని అడిగింది. ఏం బట్టలు చిరిగితే తాళి కట్టలేనా అని చెప్పి అలాగే కట్టేశాను' అంటూ ఆనాటి ఙ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. 

మరిన్ని వార్తలు