Deepika Padukone: దీపికా ఆగయా

5 Jul, 2021 00:00 IST|Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకోనే ‘పఠాన్‌’ సెట్‌లో అడుగు పెట్టారు. షారుక్‌ఖాన్‌ హీరోగా జాన్‌ అబ్రహాం కీలకపాత్ర చేస్తున్న ఈ చిత్రానికి ‘వార్‌’ ఫేమ్‌ సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ తర్వాత ‘పఠాన్‌’ సినిమా షూటింగ్‌ ఇటీవల ముంబయ్‌లో ప్రారంభమైంది. తొలుత షారుక్, జాన్‌లపై సన్నివేశాలు చిత్రీకరించారు. తాజాగా హీరోయిన్‌ దీపికా పదుకోన్‌ పాల్గొన్నారు. దాదాపు 15 రోజుల పాటు ఈ షెడ్యూల్‌లో పాల్గొంటారు దీపిక. ప్రస్తుతం షారుక్, దీపికాలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ముంబయ్‌ షెడ్యూల్‌ పూర్తయిన తర్వాత విదేశాల్లో చిత్రీకరణకు సిద్ధార్థ్‌ ఆనంద్‌ ప్లాన్‌ చేశారని టాక్‌. 2022లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ‘పఠాన్‌’ చిత్రంతో పాటు ప్రభాస్‌ హీరోగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించనున్న ఓ సినిమా, ఇంగ్లీష్‌ ఫిల్మ్‌ ‘ది ఇంటర్న్‌’ హిందీ రీమేక్‌లో దీపిక హీరోయిన్‌గా నటించనున్నారు. కాగా ఆమె నటించిన ‘83’, ‘సర్కస్‌’ తో పాటు శకున్‌ బాత్రా దర్శకత్వంలోని ఓ సినిమా విడుదలకు సిద్ధమవుతున్నాయి.

మరిన్ని వార్తలు