వలస కార్మికులకు భద్రత ఏది?

4 Jul, 2021 23:07 IST|Sakshi

లాక్‌డౌన్‌ నేపథ్యంలో వలస కార్మికుల దుఃస్థితిపై సంవత్సరం పైగా విచారించిన సుప్రీంకోర్టు జూన్‌ 28న తన తీర్పును వెలువరించింది. జాతీయ ఆహార పథకం కింద దేశంలో ఎక్కడినుంచైనా రేషన్‌ పొందడానికి వలసకార్మికులకు అనుమతించాలని, దీనికోసం ‘ఒకే దేశం, ఒకే రేషన్‌’ కార్డు పథకాన్ని అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. కానీ 2021 మే 6 నాటికి ఈ పథకం కింద 50 వేలమంది మాత్రమే లబ్ధి పొందారని వార్తలు. పైగా వలస కార్మికులకు రేషన్‌ ఇవ్వడానికి చాలా చోట్ల తిరస్కరించారని కూడా తేలింది. ప్రభుత్వాలు ప్రకటిస్తున్న కార్మిక సంక్షేమ పథకాలన్నీ...అసంఘటిత కార్మికులకు మేలు చేయడంలో విఫలమవుతున్నాయి. దేశ సర్వోన్నత న్యాయస్థానం తన శక్తిని మొత్తంగా దీనిపై కేంద్రీకరిస్తే యావద్దేశం దానిగురించి ఘనంగా చెప్పుకుంటుంది. వలస కార్మికులకు ముష్టి అవసరం లేదు. వారు కోరుకుంటున్నదల్లా... సంఘటిత కార్మికుల్లాగే క్రమబద్ధమైన పని వాతావరణం, కాస్త ప్రాథమిక భద్రత మాత్రమే.

వలస కార్మికుల కేసుగా అందరికీ తెలిసిన వ్యాజ్యంపై సుప్రీంకోర్టు తన తీర్పును తాజాగా వెలువరించింది. గతేడాది లాక్‌డౌన్‌ కాలంలో భారీవలసల సందర్భంగా వలస కార్మికుల దుఃస్థితిని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ చేసింది. సెకండ్‌ వేవ్‌ సమయంలోనూ దీనిపై విచారణ కొనసాగింది. జూన్‌ 28న ఉన్నత న్యాయస్థానం 7 పాయింట్లతో 80 పేజీల తీర్పును ప్రకటించింది. వీటిలో అయిదు అంశాలు–వలస కార్మికుల ఆహార భద్రతకు హామీ ఇవ్వడానికి సంబంధించినవి. 

వలస కార్మికులకు ఆహార భద్రతను మరింత బలోపేతం చేయడం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింత ఉదారంగా వ్యవహరించి రేషన్‌ కార్డు లేని వారికి కూడా ఆహారం అందించాలని, సబ్సిడీ ధాన్యం కేటాయింపును పెంచాలని కోర్టు తీర్పు ఆదేశించింది. జాతీయ ఆహార పథకం కింద దేశంలో ఎక్కడినుంచైనా రేషన్‌ పొందడానికి వలసకార్మికులకు అనుమతించాలని, దీనికోసం ఒకే దేశం, ఒకే రేషన్‌ కార్డు పథకాన్ని అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. వీటిలో చివరి అంశానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఇది సుదీర్ఘకాలంగా చేస్తూవస్తున్న డిమాండే. న్యాయస్థానం తన తీర్పును ప్రభుత్వ యంత్రాంగం ఎలా అమలుచేస్తుందనే అంశంపై నిశితంగా పర్యవేక్షించాలని ఎవరైనా కోరుకుంటారు. కాగా వన్‌ నేషన్, వన్‌ రేషన్‌ కార్డు అనే పథకాన్ని అమలు చేయడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి న్యాయస్థానం హామీ తీసుకున్నట్లు కనిపిస్తోంది.

గత సంవత్సరం కోవిడ్‌–19 ఫస్ట్‌ వేవ్‌ తర్వాత ఈ పథకాన్ని ఆర్భాటంగా ప్రారంభించారు. 2020 జూన్‌ 6న తన ప్రసంగంలో ప్రధాని నరేంద్రమోదీ ఈ అంశాన్ని ప్రస్తావించారు. అయితే గత సంవత్సర కాలంలో ఈ పథకం కింద చాలా కొద్ది మాత్రమే లబ్ధి పొందారని ప్రభుత్వ డేటానే చూపిస్తోంది. 2021 మే 6 నాటికి ఈ పథకంలో భాగంగా 50 వేలమంది మాత్రమే లబ్ధి పొందారని ఇంటెగ్రేటెడ్‌ మేనేజ్మెంట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ డిస్ట్రిబ్యూషన్‌ సిస్టమ్‌ నివేదించింది. ఈ పథకం కింద వలస కార్మికులకు రేషన్‌ ఇవ్వడానికి దేశంలో పలుచోట్ల తిరస్కరించిన ఉదంతాలెన్నో ఉన్నాయని ఆ నివేదిక తెలిపింది. లబ్ధిదారులకు ఈ పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వాలు ఎలాంటి ప్రయత్నాలూ చేయలేదు.

వలస కార్మికుల నమోదు
వీటన్నింటిని పక్కనబెట్టి చూస్తే, వలస కార్మికులకు ఆహార భద్రతపై హామీ ఇవ్వాలని కోర్టు ఇచ్చిన తీర్పు స్వాగతించదగినది. పైగా దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయవలసిన అవసరం ఉంది. అప్పుడు వలస కార్మికులు కాస్త ఎక్కువగానే కడుపు నింపుకుని సాధారణ పనులను నిర్వహించవచ్చు. ఇక తీర్పులోని చివరి రెండు అంశాలను ప్రాథమికంగా విమర్శించాల్సి ఉంది. ఈ రెండూ వలస కార్మికుల నమోదుకు సంబంధించినవి. ఇదే చాలా ముఖ్యమైనది.ఎలాంటి లక్ష్య బృందానికైనా ఈ పథకం లబ్ధి్ద కలిగించాలని ఎవరైనా భావిస్తే, ముందుగా ఈ లక్ష్య బృందంలోని అందరినీ గుర్తించాల్సి ఉంది. వలస కార్మికులు ఎంతమంది ఉన్నారు, ఏయే ప్రాంతాల్లో ఉన్నారు అనే అంశంపై ప్రభుత్వానికి ఎలాంటి అవగాహన లేనందునే ఫస్ట్‌ వేవ్‌ కాలంలో వలస కార్మికులు భారీ స్థాయిలో వలస పోయారు. అందుకే వలస కార్మికుల నమోదు అంశంపై న్యాయస్థానం తీర్పు అధికంగా దృష్టి సారించింది. న్యాయస్థానం తన తీర్పును ఎలా ప్రకటించినప్పటికీ, ప్రభుత్వాలూ, పౌర సమాజ సంస్థలూ, సంబంధిత పిటిషన్‌తో పాక్షికంగా సంబంధంలో ఉండి కోర్టుకు సహకరించిన న్యాయవాదులూ మొత్తంగా క్షేత్ర వాస్తవికతను పూర్తిగా పట్టించుకోలేదనే చెప్పాలి. దీన్ని పరిగణనలోకి తీసుకున్న న్యాయస్థానం.. తన తొలి తీర్పులో అసంఘటిత కార్మికుల గణన ప్రక్రియను ప్రారంభించడంలో కేంద్ర కార్మిక శాఖ విఫలమైందని దుయ్యబట్టింది. పైగా అసంఘటిత కార్మికుల జాతీయ డేటాబేస్‌(ఎన్‌డీయూడబ్ల్యూ)ని ఏర్పాటు చేయడానికి తుది గడువును కూడా నిర్ణయించింది.  తర్వాత అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టం (ఐఎస్‌ఎమ్‌డబ్ల్యూ యాక్ట్‌)ని పూర్తి స్థాయిలో అమలు చేయాలని కోర్టు ఆదేశించింది. అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టాన్ని సంపూర్ణంగా అమలు చేసినట్లయితే, అసంఘటిత కార్మికుల జాతీయ డేటాబేస్‌ రూపంలో ప్రత్యేక నమోదు ప్రక్రియ అవసరమే ఉండదు.

అసంఘటిత కార్మికుల నమోదు ప్రక్రియకు సంబంధించిన గత చరిత్రను న్యాయస్థానం ఎత్తి చూపలేదు. ప్రస్తుత అధికారంలో ఉన్న కేంద్ర ప్రభుత్వం తన తొలి అయిదేళ్ల పాలనలో శ్రమయేవ జయతే పేరిట అసంఘటిత కార్మికులను భారీ స్థాయిలో నమోదు చేసే ప్రక్రియను ప్రారంభించింది. అసంఘటిత కార్మికులందరి సంఖ్యను గుర్తించి వారికి స్మార్ట్‌ కార్డులు జారీ చేయడమే దీని లక్ష్యం. అయితే ఈ పథకం వెనుకపట్టు పట్టడానికి ముందు కొంతమందికి కార్డులు జారీ చేశారు. కార్మికుల నమోదు నత్తనడకన సాగుతున్న నిర్మాణ కార్మికుల బోర్డుల నమోదు చరిత్రను కోర్టు పరిశీలించాల్సి ఉంది. అన్ని కార్మిక చట్టాలు ఆయా పనిస్థలాల్లో కార్మికుల పేర్లు నమోదు చేయాలని కోరుతున్నాయి. అయినప్పటికీ ఈ చట్టాల పరిధిలోనే పనికోసం ఒక చోటి నుంచి మరో చోటికి తరలి వెళ్లిపోయే వలస కార్మికులను నమోదు చేయడం జరగలేదు. 

సంక్షేమ పథకాల అమలు లోపం
1948 ఫ్యాక్టరీల చట్టం ద్వారా నిర్వహిస్తున్న పరిశ్రమలలో అనేకమంది వలస కార్మికులను గణనీయంగా నియమించుకున్నారు. ఈ శక్తిమంతమైన చట్టాన్ని పారిశ్రామిక భద్రత, ఆరోగ్య డైరెక్టరేట్‌ అమలు చేస్తోంది. కానీ వాస్తవానికి ఈ చట్టం కింద చాలా కొద్దిమంది కార్మికుల పేర్లను మాత్రమే నమోదు చేసింది. గుజరాత్‌లోని సూరత్‌ నగరం వేలాది మరమగ్గాలతో కూడిన అతిపెద్ద వస్త్రపరిశ్రమ కేంద్రాల్లో ఒకటి. ఇక్కడి పనిచేసేవారిలో మెజారిటీ ఒడిశా నుంచి వచ్చిన వలస కార్మికులే. కానీ ఈ నగరంలో ఉన్న పరిశ్రమ యూనిట్ల సంఖ్య ఎంత అని ఎవరైనా డైరెక్టరేట్‌ని అడిగితే సమాధానం శూన్యమే. నగరంలో ఎన్ని మరమగ్గాలు ఉన్నాయి అని తెలిపే కనీస డేటా కూడా దీనివద్ద లేదు. కోర్టు ఈ మొత్తం వ్యవహారంపై మరింత కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది.

కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రకటించిన అనేక సంక్షేమ పథకాలను కోర్టు తన తీర్పులో ప్రస్తావించింది. ఈ సంక్షేమ పథకాల ప్రయోజనాలను అందుకోవడానికి అనేకమంది కార్మికులు వేచి చూస్తున్నారని తీర్పులోని 70వ పేజీలో న్యాయస్థానం పేర్కొంది. కానీ, ఇవన్నీ కూడా గుర్తింపులేని అసంఘటిత కార్మికులకు మేలు చేయడంలో విఫలమవుతున్నాయి. అందుకే వివిధ రాష్ట్రాల్లో ఉనికిలో ఉన్న అసంఖ్యాక కార్మిక సంక్షేమ పథకాల సంఖ్యను కుదించి ఒక నమూనా స్కీమ్‌ను రూపొందించాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.వాస్తవానికి గుజరాత్‌ ప్రభుత్వం ప్రకటించినట్లుగా అసంఘటిత రంగ కార్మికులకు 20 పథకాలు అవసరం లేదు. వారికి ప్రాథమిక భద్రత, పీఎఫ్, ఇన్సూరెన్స్, గ్రాట్యుటీ వంటివి అవసరం. వీటిని పక్కనబెట్టి వివిధ బోర్డులలో కార్మికుల పేర్లను నమోదు చేసి వివిధ పథకాలను కేటాయించినా అవన్నీ ఆచరణలో విఫలమవుతాయి. దేశంలోని వలస కార్మికులకు ముష్టి అవసరం లేదు. వారు కోరుకుంటున్నదల్లా.. కార్మిక చట్టాలు అందించే క్రమబద్ధమైన పని వాతావరణం, ప్రాథమిక భద్రత మాత్రమే. సుప్రీంకోర్ట్‌  తన శక్తిని దీనిపై కేంద్రీకరిస్తే దేశం దేశమే దానిగురించి ఘనంగా చెప్పుకుంటుంది.
సుధీర్‌ కటియార్‌ 
‘సెంటర్‌ ఫర్‌ లేబర్‌ రీసెర్చ్‌ అండ్‌ యాక్షన్‌’ సభ్యులు.
(‘ది వైర్‌’ సౌజన్యంతో)

మరిన్ని వార్తలు