అందుకే అనుపమని బోల్డ్‌గా చూపించాం: 'టిల్లు స్క్వేర్' డైరెక్టర్‌

21 Mar, 2024 18:24 IST|Sakshi

'టిల్లు స్క్వేర్'లో లిల్లీ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుంది.ఆమెది ఛాలెంజింగ్‌ రోల్‌. ఆ పాత్ర కోసం ఎందరో పేర్లను పరిశీలించాం. కానీ అనుపమనే పర్ఫెక్ట్‌ ఛాయిస్‌ అనిపించింది. ఆమెను బోల్డ్‌గా చూపించాలనే ఉద్దేశంతో లిల్లీ పాత్రను రాసుకోలేదు. లిల్లీ పాత్ర తీరే అలా ఉంటుంది. ఆ పాత్రకి అనుపమ న్యాయం చేయగలదని నమ్మాం. ఆమె ఆ పాత్రకి నూటికి నూరు శాతం న్యాయం చేసింది’ అన్నారు దర్శకుడు మల్లిక్ రామ్. ఆయన దర్శకత్వం వహించిన తాజా చిత్రం ‘టిల్లు స్కేవర్‌’.  స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ హీరోగా నటించిన డీజే టిల్లు సినిమాకు సీక్వెల్‌ గా తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 29న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్‌ మల్లిక్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

సిద్ధుతో నాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. దాదాపు ఇద్దరం ఒకేసారి సినీ ప్రయాణం మొదలుపెట్టాం. నేను దర్శకత్వం వహించిన అద్భుతం మూవీ, డీజే టిల్లు ఇంచుమించు ఒకే సమయంలో వచ్చాయి. ఆ తర్వాత నేను, సిద్ధు కలిసి ఒక సినిమా చేయాలి అనుకున్నాం. అదే సమయంలో నాగవంశీ గారు 'టిల్లు స్క్వేర్' చేస్తే బాగుంటుందని చెప్పడం, డీజే టిల్లు దర్శకుడు విమల్ కృష్ణ ఇతర కమిట్ మెంట్స్ తో బిజీగా ఉండటంతో నేను ఈ ప్రాజెక్ట్ లోకి వచ్చాను. మొదట కాస్త సంకోచించాను కానీ కథ బాగా వచ్చేసరికి ఇక వెనకడుగు వేయలేదు.

సినిమాలో సిద్దు ప్రమేయం ఉటుందని..ప్రతి సీన్‌లోనూ తలదూర్చుతాడని బయట ఏవో కొన్ని వార్తలు వస్తుంటాయి కానీ వాటిలో వాస్తవం లేదు. సిద్ధు ఒక రచయితగా, నటుడిగా ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలో.. అంతవరకే ఇన్వాల్వ్ అవుతాడు. దర్శకుడికి ఇవ్వాల్సిన స్వేచ్ఛను దర్శకుడికి ఇస్తాడు. ఎలా చేస్తే బాగుంటుంది అనేది ఇద్దరం చర్చించుకొని చేశాం. కథా చర్చల సమయంలో ఒక రచయితగా వ్యవహరిస్తాడు. చిత్రీకరణ సమయంలో ఒక నటుడిగా ఏం చేయాలో అది చేస్తాడు. 

డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ కి వ్యత్యాసం ఉంటుంది. డీజే టిల్లు డెడ్ బాడీ నేపథ్యంలో సాగే బ్లాక్ కామెడీ. కానీ టిల్లు స్క్వేర్ అలా ఉండదు. ఒక కమర్షియల్ సినిమాలా ఉంటుంది. టిల్లు పాత్ర తీరు అలాగే ఉంటుంది. రాధిక పాత్ర ప్రస్తావన ఉంటుంది. మొదటి భాగాన్ని ముడిపెడుతూ కొన్ని సన్నివేశాలు ఉంటాయి. డీజే టిల్లుని గుర్తు చేస్తూనే టిల్లు స్క్వేర్ మీకొక కొత్త అనుభూతిని ఇస్తుంది.

ఇంటర్వెల్ తర్వాత ద్వితీయార్థం ప్రారంభ సన్నివేశాలు చాలా సినిమాల్లో తేలిపోతుంటాయి. ఫస్టాఫ్ బాగుంటుంది, క్లైమాక్ బాగుంటుంది. కానీ ఆ 15-20 నిమిషాలు ఆశించిన స్థాయిలో ఉండదు. టిల్లు స్క్వేర్ విషయంలో అలా జరగకూడదన్న ఉద్దేశంతో.. ఆ కొన్ని సన్నివేశాలు మరింత మెరుగ్గా రాసుకొని రీ షూట్ చేయడం జరిగింది.

ముందు ఈ సినిమాకు పాటలు రామ్ మిరియాల, శ్రీచరణ్ పాకాల, నేపథ్య సంగీతం తమన్ అనుకున్నాం. రామ్ మిరియాల రెండు పాటలు ఇచ్చారు. శ్రీచరణ్ పాకాల ఒక పాట ఇచ్చారు. ఆ పాట బాగా వచ్చింది. కానీ అక్కడ సిట్యుయేషన్ మారడంతో మరో సంగీత దర్శకుడు అచ్చుత్‌తో పాట చేయించడం జరిగింది. తమన్ గారు ఇతర సినిమాలతో బిజీగా ఉండి అందుబాటులో లేకపోవడంతో..భీమ్స్ గారిని తీసుకున్నాం.

ఈ చిత్రంలో ఎలాంటి సందేశం ఉండదు. కొందరి స్వభావం ఎలా ఉంటుందో చూపించాము కానీ ఇలా ఉండకండి మారండి అనే సందేశాలు మాత్రం ఇవ్వలేదు.

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers