డాక్యుమెంటరీ ఫిల్మ్‌: ఇది నా ఇల్లు

29 May, 2022 01:08 IST|Sakshi
లద్దాఖ్‌లోని ఓ ఇంట్లో..

ఎవరినైనా కలిసినప్పుడు మంచీ చెడు మధ్యలో తప్పక వచ్చే ప్రశ్న ‘మీ ఇల్లెక్కడ?!’
‘ఇదే ప్రశ్నను లద్దాఖ్‌లోని ఓ పెద్ద మనిషిని అడిగినప్పుడు అక్కడి చుట్టూ కొండలు, విశాల మైదానాలు చూపిస్తూ... ఈ ప్రకృతి ఒడే నా ఇల్లు అని పరిచయం చేస్తే... ఆ ప్రపంచంలో 45 రోజులు ఉండి తీసిన డాక్యుమెంటరీ ఫిల్మ్‌ ‘ఇది నా ఇల్లు’ అని వివరించారు దీపాకిరణ్‌.

ప్రపంచ వ్యాప్తంగా 75 వేల మందికి పైగా స్టోరీ టెల్లర్స్‌ను చేరుకున్న దీపాకిరణ్‌ హైదరాబాద్‌ వాసి. స్టోరీ ఆర్ట్‌ ఫౌండేషన్‌ ఫౌండర్, ప్రొఫెషనల్‌ స్టోరీ టెల్లర్, ఆర్ట్‌–బేస్డ్‌ ఎడ్యుకేషనలిస్ట్‌. ఈ స్టోరీ టెల్లర్‌ ఇటీవల ‘దిస్‌ ఈజ్‌ మై హోమ్‌’ అనే డాక్యుమెంటరీ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ యేడాది ముంబై ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌(ఎమ్‌ఐఎఫ్‌ఎఫ్‌) లో ప్రదర్శనకు వచ్చిన 800 ఎంట్రీలలో ‘దిస్‌ ఈజ్‌ మై హోమ్‌’ టాప్‌ టెన్‌ జాబితాలో నిలిచింది. ఈ సందర్భంగా ఆమెతో మాట్లాడినప్పుడు డాక్యుమెంటరీ ఫిల్మ్‌ రూపకల్పన గురించి ఇలా పంచుకున్నారు.

‘‘సముద్రం నుండి 3,700 మీటర్ల ఎత్తులో లద్దాఖ్‌ పర్వతాలలోని మారుమూల గ్రామంలో ఒక యువ గ్రాఫిక్‌ డిజైనర్‌ జీవితాన్ని డాక్యుమెంటరీని రూపొందించాను. లెహ్‌–లదాఖ్‌లోని రెసిడెన్షియల్‌ కోర్సులో భాగంగా, వర్క్‌ నేర్చుకుంటూ తీసిన మొదటి డాక్యుమెంటరీ ఫిల్మ్‌ ఇది.

కథ కలిపిన పరిచయాలు
కిందటేడాది ఆగస్టులో రెండు వర్క్‌షాప్స్‌ కోసం చేసిన ప్లాన్‌లో భాగంగా లదాఖ్‌కు వెళ్లాను. లైఫ్‌లో ఒక ఛేంజ్‌ కోసం చేసిన ప్రయాణం కూడా. నాతో పాటు వర్క్‌షాప్‌ కోసం వచ్చిన స్నేహితులున్నారు. లద్దాఖ్‌లో ఒక మారుమూల ప్రాంతం అది. విసిరేసినట్టుగా ఉన్నాయి అక్కడి ఇల్లు. ఒక చిన్న కాఫీ షాప్‌లో కూర్చుని, ఫ్రెండ్స్‌తో సరదాగా ఓ కథ చెబుతున్నాను. మమ్మల్నే గమనిస్తున్న ఓ యువకుడు మేము చెబుతున్న కథ వింటూ తనని తాను పరిచయం చేసుకున్నాడు.

మేమూ అతని గురించి తెలుసుకున్నాం. గ్రాఫిక్‌ డిజైనర్‌ అయిన తన పేరు వరుణ్‌. పట్టణాన్ని వదిలి లద్దాఖ్‌లో కుండలు తయారు చేసే పనిని నేర్చుకుంటున్నాడని తెలిసి చాలా ఆసక్తిగా అనిపించింది. వరుణ్‌  ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ నుంచి ఎన్నో కుటుంబాలను కలిశాం. అలాగే, వరుణ్‌తో పాటు, వారి జీవన శైలిని ఒక కథగా తీసుకోవాలనిపించింది. అక్కడ నుంచి ప్రతీది ఒక ఆసక్తిగా మారిపోయింది. ఒక థీమ్‌ ప్లాన్‌ చేసి, వరుణ్‌తో మాట్లాడి డాక్యుమెంటరీ తీయడం ఆరంభించాను.

దిస్‌ ఈజ్‌ మై హోమ్‌
వరుణ్‌ స్థానికులను కలిసి, ఒక్కో వ్యక్తిని కొన్ని ప్రశ్నలు అడగుతుండగా వారు ఇచ్చిన సమాధానాలను తీసుకున్నాను. ఒక వృద్ధుడిని కలిసి మాట్లాడినప్పుడు అతను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ ఇల్లు చాలా చిన్నది. కానీ, వారి ముఖాల్లో కనిపించిన సంతోషాన్ని చూసి ‘పట్ణణాల్లో పెద్ద పెద్ద ఇళ్లలో ఉన్నా, ఈ సంతోషం ఎక్కడా కనిపించదు ఎందుకు?’ అని అడిగినప్పుడు... ‘గదులు ఉండటం ఇల్లు కాదు.

అలా చూడండి, చుట్టూ కొండలు, చూసినంత మేర పచ్చదనం. ఇంత పెద్ద ఇల్లు ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది’ అన్నాడు. అతని మాటలు నాకు బాగా నచ్చాయి. ఒక కామిక్‌ స్ట్రిప్‌ కూడా నేను అంతకుముందే చూసి ఉన్నాను. అన్నీ కలిపి  డాక్యుమెంటరీ ఫిల్మ్‌కి ‘దిస్‌ ఈజ్‌ మై హోమ్‌’  టైటిల్‌ సరైనదనుకున్నాను. ఈ మూవీ చూసిన కొందరు డైరెక్టర్లు ‘మేమూ ఆ గ్రామంలో ఉన్నట్టు, అక్కడ వాళ్లను కలుసుకున్నట్టుగా ఉంది’ అని చెప్పారు. చాలా ఆనందంగా అనిపించింది.

చాలా శక్తిమంతులు
మంచుకొండల్లో అతి చల్లటి వాతావరణం లద్దాఖ్‌. అలాంటి చోట మాతోపాటు టౌన్‌కి బయల్దేరాలనుకున్న ఒక బామ్మ తెల్లవారు ఝామున నాలుగ్గంటలకే లేచి, చల్లటి నీళ్లతో తలస్నానం చేసి, రెడీ అయిపోయారు. నాకు ఆమె శక్తిని చూసి చాలా అద్భుతం అనిపించింది. మిగతావారూ అలాగే ఉన్నారు.

కొత్తగా జీవించాలి..
నా రైటింగ్‌ బ్యాక్‌ గ్రౌండ్, స్టోరీ టెల్లింగ్‌.. నా డాక్యుమెంటరీ వర్క్‌కి బాగా పనికొచ్చాయి. ఎడిటింగ్‌ వర్క్, వాయిస్‌ ఓవర్‌ పూర్తయ్యాక ముందు వరుణ్‌కి పంపించాను. వాళ్ల కుటుంబం మొత్తం ఆ డాక్యుమెంటరీ చూసి, చాలా సంతోషించారు. ఆ తర్వాత ఫిల్మ్‌ కాంపిటిషన్‌కు పంపించాను. టాప్‌టెన్‌లో నిలిచింది. అంతటితో నా పని పూర్తవ్వలేదు. మరిన్ని కొత్త పనులవైపు చూశాను. ఇటీవలే ఒక సర్టిఫికెట్‌ లైఫ్‌ కోచ్‌గా జాయిన్‌ అయ్యాను.

కరోనా సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి మానసిక శక్తిని అందించింది లద్దాఖ్‌లో తీసిన డాక్యుమెంటరీ ఫిల్మ్‌. అక్కడి స్థానికులతో సంభాషణ, ప్రయాణం ఏదీ అంత సులువు కాలేదు. ప్రతిది ఛాలెంజింగ్‌. అదే నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. అక్కడి మనుషులు, ప్రకృతి, నేర్చుకున్న కొత్త వర్క్‌ నుంచి.. మళ్లీ జీవించడం నేర్చుకున్నాను’’ అని వివరించారు ఈ స్టోరీ టెల్లర్‌ అండ్‌ డైరెక్టర్‌.

దీపాకిరణ్‌

– నిర్మలారెడ్డి

మరిన్ని వార్తలు