అనుచిత వ్యాఖ్యలు : హీరోయిన్ గుడ్‌బై

12 Oct, 2020 20:06 IST|Sakshi

అసోసియేషన్ ఆఫ్  మలయాళ మూవీ ఆర్టిస్ట్స్  (అమ్మా)కి  మలయాళ నటి పార్వతి రాజీనామా

నటి భావనపై అమ్మా  ప్రధాన కార్యదర్శి ఎడావెలా బాబు  అనుచిత వ్యాఖ్యలు

బాబు రాజీనామా  చేయాలని పార్వతి డిమాండ్

ప్రముఖ మలయాళ నటి పార్వతి కీలక నిర్ణయం తీసుకున్నారు. అసోసియేషన్ ఆఫ్ మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మా)కు సోమవారం రాజీనామా చేశారు. అమ్మా ప్రధాన కార్యదర్శి ఎడావెలా బాబు నటి భావనపై చేసిన అభ్యంతర వ్యాఖ్యలకు నిరసనగా తాను సంస్థనుంచి వైదొలగుతున్నట్టు తెలిపారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు. అంతేకాదు ఎడవెలా బాబు తక్షణమే రాజీనామా చేయాలని కూడా ఆమె డిమాండ్ చేశారు. మనస్సాక్షి  గల ఇతర  సభ్యులు కూడా ఇదే డిమాండ్ చేస్తారని ఆశిస్తున్నానన్నారు.

2018లో తన స్నేహితులు అమ్మాకి రాజీనామా చేసినప్పుడు, కనీసం కొంతమందైనా పనిచేయడం కొనసాగించాలని, సంస్కరణ జరగాలని తాను భావించానన్నారు. ఆ వైపుగా కృషి చేస్తూనే ఉన్నానని పార్వతి చెప్పారు. కానీ అమ్మా సెక్రటరీ తాజా వ్యాఖ్యలతో ఆ ఆశ తుడిచి పెట్టుకుపోయిందని పార్వతి వ్యాఖ్యానించారు. భావనపై బాబు అసహ్యకరమైన వ్యాఖ్యలు తనను తీవ్ర నిరాశకు గురి చేశాయన్నారు. అందుకే  సంఘానికి రాజీనామా చేస్తున్నట్టు  ఫేస్ బుక్ ద్వారా వెల్లడించారు.  

కాగా సంక్షోభంలో ఉన్నమలయాళం సినిమా పరిశ్రమను ఆదుకునేందుకు ఓవర్ టాప్(ఓటీటీ)ప్లాట్‌ఫాం‌ను ప్రారంభించాలని అమ్మా భావిస్తోంది. అలాగే భవన నిర్మాణానికి అవసరమైన నిధులను  సేకరించేందుకు ప్రముఖ నటులతో మూవీ తీయాలని ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించిన ప్రణాళికలపై ఇచ్చిన ఇంటర్య్వూలో బాబు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ మూవీలో భావన నటిస్తున్నారా అని ప్రశ్నించినపుడు భావన అమ్మలో లేదు. చచ్చిపోయిన వాళ్లను మళ్లీ తిరిగి తీసుకురాలేమంటూ సమాధానం ఇవ్వడం వివాదం రేపుతోంది. 2018లో 20 పేరుతో నిర్మించిన చిత్రంలో భావన ప్రముఖ పాత్ర పోషించారు. నటి భావన కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న సూపర్‌స్టార్ దిలీప్ కుమార్ ఈ సినిమాలో నటిస్తున్నారా లేదా అనే అంశంలో పలు ఊహాగానాలున్నాయి.  

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా