ప్రముఖ ఎడిటర్‌ జీజీ కృష్ణారావు కన్నుమూత

22 Feb, 2023 00:52 IST|Sakshi

ప్రముఖ ఎడిటర్‌ జీజీ కృష్ణారావు (87) మంగళవారం ఉదయం బెంగళూరులో తుదిశ్వాస విడిచారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని గుడివాడకు చెందిన జీజీ కృష్ణారావు చెన్నై నుంచి సినీ ప్రయాణాన్నిప్రారంభించారు. ఎడిటర్‌గానే కాదు.. అసోసియేట్‌ డైరెక్టర్,ప్రొడక్షన్‌ డిజైనర్‌గానూ పని చేశారాయన. బాపు, ఆదుర్తి సుబ్బారావు, కె. విశ్వనాథ్, దాసరి నారాయణరావు, జంధ్యాల వంటి ఎందరో ప్రముఖ దర్శకుల చిత్రాలకు ఎడిటర్‌గా చేశారాయన.

‘శంకరాభరణం, వేటగాడు, బొబ్బిలి పులి, సర్దార్‌ పాపారాయుడు, సాగర సంగమం, స్వాతిముత్యం, శుభలేఖ’ వంటి దాదాపు 300 సినిమాలకు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు కృష్ణారావు. డైరెక్టర్‌ కె. విశ్వనాథ్‌తో కృష్ణారావుకు మంచి అనుబంధం ఉండేది. అందుకే ఆయన తెరకెక్కించిన దాదాపు అన్ని సినిమాలకు కృష్ణారావు పని చేశారు. విశ్వనాథ్‌ దర్శకత్వం వహించిన ‘సప్తపది’కి కృష్ణారావు తొలిసారి నంది అవార్డు అందుకున్నారు.

ఈ సినిమా నుంచే ఎడిటింగ్‌ విభాగంలో నంది అవార్డు ఇవ్వడంప్రారంభమైంది. అనంతరం ‘సాగర సంగమం, శుభ సంకల్పం’ చిత్రాలకు కూడా నంది అవార్డులు సొంతం చేసుకున్నారాయన. కృష్ణారావుకి ఇద్దరు కొడుకులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. బెంగళూరులోని తన కుమార్తె వద్ద ఉంటున్న ఆయన అక్కడే తుదిశ్వాస విడిచారు. జీజీ కృష్ణారావు మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ‘‘ఎడిటింగ్‌ శాఖకు గౌరవాన్ని తెచ్చిన వారిలో కృష్ణారావుగారు ఒకరు.

ఆయన మరణంతో తెలుగు ఫిలిం ఎడిటర్స్‌ ఒక పెద్ద దిక్కును కోల్పోయారు’’ అని తెలుగు ఫిలిం ఎడిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు కోటగిరి వెంకటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మార్తాండ్‌ కె. వెంకటేష్‌ ఓ ప్రకటన విడుదల చేశారు.

మరిన్ని వార్తలు