Ghantasala: మధుర కంఠశాల

11 Feb, 2024 01:09 IST|Sakshi

ఘంటసాల 50వ వర్ధంతి ప్రత్యేకం

జయ జననీ పరమ పావని జయ జయ భారత జననీ... దేశం తాలూకు ప్రేమ స్పష్టంగా వినిపించిన గాత్రం. ‘మన దేశం’లోని ఈ పాట ఎవర్‌గ్రీన్‌.కలవర మాయె మదిలో.. నా మదిలో... కన్నులలోన గారడి ఆయే... ‘పాతాళ భైరవి’లో అదే గాత్రం ప్రేమ కురిపించింది.శేషశైలవాస.. శ్రీవెంకటేశా... ‘వెంకటేశ్వర మహత్మ్యం’లో ఆ గాత్రంలోని భక్తిభావం అద్భుతం.

ఎట్టాగొ ఉన్నాది ఓ లమ్మీ... ప్రేయసితో గారాలు పోయింది ఆ గాత్రం..జగమే మాయ బతుకే మాయ.. వేదాలలో సారమింతేనయా.. ‘దేవదాసు’లో మత్తు నింపిన గాత్రం అది..లేచింది నిద్ర లేచింది మహిళాలోకం... ‘గుండమ్మ కథ’లో సమాజాన్ని మేల్కొల్పిన గాత్రం అది.దైవ భక్తి, దేశ భక్తి, ప్రేమ, విరహం, ఉత్సాహం... ఇలా అన్నింటినీ మధురంగా పలికించిన కంఠం అది. అందుకే ఘంటసాల దూరం అయినా ఆ స్వరం దూరం కాలేదు.. తెలుగు ప్రజల మనసుల్లో అలా నిలిచిపోయింది. ఆ ‘మధుర కంఠశాల’ ఘంటసాల 50వ వర్ధంతి నేడు. ఈ సందర్భంగా ఘంటసాల మాస్టారు జీవితంలోని కొన్ని విశేషాలు ఈ విధంగా...

ఘంటసాల వెంకటేశ్వర రావ్‌ ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని చౌటుపల్లిలో 1922 డిసెంబరు 4న సామాన్య కుటుంబంలో జన్మించారు. తండ్రి పేరు సూరయ్య, తల్లి పేరు రత్తమ్మ. ఘంటసాలకు సంగీతమంటే ప్రాణం. స్వతహాగా మంచి గాయకుడైన ఆయన శ్రీ నారాయణతీర్థుల తరంగాలను వినసొంపుగా పాడేవారు. మృదంగ వాయిద్యంలో కూడా ఘంటసాలకి మంచి ప్రవేశం ఉంది. ఆయన పాటలు పాడటంతో పాటు నృత్యం కూడా చేసేవారు.

శ్రీ నారాయణ తీర్థుల తరంగాలను పాడటంలో తండ్రికి సహాయంగా ఉండేవారు ఘంటసాల. అలా పాటలు పాడుతూ, నృత్యాన్ని అభినయించే ఘంటసాలను అందరూ ‘బాల భరతుడు’ అని పిలిచేవారు. ఒకానొక సందర్భంలో ఘంటసాల సంగీత కచేరీ చేస్తున్నప్పుడు కొందరు ఆయన సంగీత పరిజ్ఞానాన్ని హేళన చేశారు. ఆ హేళనను ఆయన ఒక సవాల్‌గా స్వీకరించి, సంగీతంలో మంచిప్రావీణ్యాన్ని సంపాదించటానికి విజయనగరం వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అయితే అందుకు ఆయన కుటుంబ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో తన బంగారు ఉంగరం విక్రయించి, సంగీతం నేర్చుకోవడానికి విజయనగరం చేరుకున్నారు.

అక్కడ ఓ కళాశాలలో ప్రవేశం పొంది, విద్వాన్‌ పట్టాతో కళాశాల నుంచి బయట ప్రపంచంలోకి అడుగుపెట్టారు. తన 14వ ఏట వయొలిన్  విద్వాంసుడు ద్వారం వెంకటస్వామి నాయుడు ప్రోత్సాహంతో పట్రాయని సీతారామశాస్త్రి వద్ద శాస్త్రీయ సంగీతం అధ్యయనం చేశారు. హఠాత్తుగా తన తండ్రి సూరయ్య మృతి చెందడంతో మేనమామ శ్రీ ర్యాలి పిచ్చిరామయ్య వద్దకు చేరుకున్నారు ఘంటసాల. ఆ తర్వాత 1944 మార్చి 4న ఆయన కుమార్తె సావిత్రిని పెళ్లాడారు. సమీప బంధువైన సినీరంగ ప్రముఖుడు సముద్రాల రాఘవాచారి ఆశీస్సులతో 1944లో మద్రాసు చేరుకుని, గాయకుడిగా అవకాశాల కోసం ఏడాది పాటు ఎదురు చూశారు ఘంటసాల.

1945లో తొలిసారి ‘స్వర్గసీమ’ సినిమాలోని ‘గాజులపిల్ల..’ అనే పాట ద్వారా ఆయన గొంతు తెలుగు వారికి పరిచయమైంది. ఈ పాటకు ఆయన అందుకున్న పారితోషికం రూ. 116.  ఆ తర్వాత ఎన్నో గీతాలు పాడారు. అలాగే  తెలుగులో దాదాపు ఎనభై చిత్రాలకు, తమిళం, కన్నడంలో కొన్ని చిత్రాలకు సంగీతదర్శకత్వం వహించారు. ఇక ఘంటసాలకు దేశభక్తి కూడా ఎక్కువే. 1942లో క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుపాలయ్యారు. ఘంటసాల చివరిగా పాడిన పాట ‘యశోదకృష్ణ’ సినిమాలోని ‘చక్కనివాడే భలే టక్కరివాడే..’. ఆ తర్వాత ఆయన తన జీవితమంతా పరితపించిన భగవద్గీత ప్రయివేటు రికార్డును పూర్తి చేసి, మరణించారు. జీవిత చరమాంకంలో చేసిన భగవద్గీత ఆయనకు శాశ్వత కీర్తిని సంపాదించి పెట్టింది.

1972లో హైదరాబాద్‌ రవీంద్రభారతిలో కచేరీ చేస్తుండగా ఆయనకు గుండెలో నొప్పిగా అనిపించడంతో ఆస్పత్రికి వెళ్లారు. దాదాపు నెల రోజులు ఆస్పత్రిలో ఉన్నారు. ఆ తర్వాత కొన్నాళ్లు బాగానే ఉన్నారు. అయితే ఆ తర్వాత అనారోగ్యంపాలు కావడంతో ఒక విలేకరి సూచించిన నాటు మందు వాడారు. అది వికటించడంతో ఆరోగ్యం ఇంకా క్షీణించింది. చివరికి 1974 ఫిబ్రవరి 11న ఘంటసాల తుది శ్వాస విడిచారు. ‘శ్రీనివాసా... బాధ లేకుండా పోతే ఫర్వాలేదు’ అని చనిపోయే నాడు ఉదయం ఆస్పత్రిలో అన్నారట. ఘంటసాల పలికిన చివరి మాట ఇదేనట. తెలుగు చిత్రసీమ ఉన్నంతవరకూ నిలిచిపోయేలా పాటల రూపంలో మధురాన్ని పంచిన ఘంటసాల 52 ఏళ్ల వయసుకే దూరమయ్యారు. ఘంటసాలకు నలుగురు కుమారులు, నలుగురు కుమార్తెలు సంతానం. 


ఓ నిర్మాత మన సినిమాలోని పాటలన్నీ హిట్‌ కావాలని సంగీత దర్శకుడు ఇళయారాజాకి చెప్పారట. అయితే ఇది ఒక్క ఘంటసాలగారికే సాధ్యం అన్నారట ఇళయరాజా. ఈయనే కాదు.. అప్పట్లో ఏ సంగీతదర్శకుడికైనా తొలిప్రాధాన్యం ఘంటసాలకే.  పాటలు మాత్రమే కాదు..  పద్యాలు పాడటంలోనూ ఘంటసాల సూపర్‌. కొంతమంది సంగీత దర్శకులు వారి సినిమాల్లోని పద్యాలను ఘంటసాలతోనే పాడించుకున్నారు. స్వతహాగా ఘంటసాలకు కూడా పద్యాలు పాడటం అంటే చాలా ఇష్టం.

‘తెనాలి రామకృష్ణ’ సినిమాలో చాలా పద్యాలు ఉంటాయి. తొలుత ఈ పద్యాలను పాడినందుకు ఘంటసాల పారితోషికం తీసుకోలేదట. ‘పద్యాలే కదా ఫర్వాలేదులే’ అన్నారట. కానీ ఈ చిత్రనిర్మాత బీఎస్‌ రంగా పద్యానికి వంద రూపాయల చొప్పున లెక్కగట్టి ఘంటసాలకి ఇచ్చారట. అలాగే ‘రహస్యం’ (1967)  సినిమాకు ఎంతో ఇష్టపడి సంగీతం ఇచ్చారట ఘంటసాల. కానీ ఆ సినిమా ఫ్లాప్‌ కావడంతో ఘంటసాల చాలా నిరాశ చెందారట. అలాగే తిరుమలేశునిపై ఎక్కవ పాటలు స్వరపరిచి, గానం చేసిన గాయకుల్లో ఘంటసాల పేరు ముందు వరుసలో ఉంటుంది.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega