ఒకప్పుడు మామూలు కుర్రోడు.. ఇప్పుడు ‘టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ'

23 Nov, 2020 10:50 IST|Sakshi
హీరో ఆనంద్‌ దేవరకొండకు సీన్‌ వివరిస్తున్న దర్శకుడు వినోద్‌ అనంతోజు

గుంటూరు కుర్రోడి దర్శకత్వ ప్రతిభ  

‘మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌’తో సూపర్‌ హిట్‌ 

సాక్షి, తెనాలి: ఒకప్పుడు అందరిలానే మామూలు కుర్రోడు. రెండేళ్ల తర్వాత సీన్‌ కట్‌ చేస్తే.. ఇప్పుడు ‘టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ’.. కేవలం ఒక్క రోజులోనే.. అదికూడా ఓటీటీలో విడుదలైన సినిమాతో!. తొలిసారిగా మెగా ఫోన్‌ పట్టుకుని సూపర్‌ హిట్‌ కొట్టాడు. అతనే గుంటూరుకు చెందిన యువ దర్శకుడు వినోద్‌ అనంతోజు. తొలి సినిమాతోనే దర్శకుడవ్వాలనే కలను నెరవేర్చుకోవడమే కాదు.. సక్సెస్‌తో తనను తాను నిరూపించుకున్నాడు. ఇటీవల ఓటీటీలో విడుదలైన ‘మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌’ చిత్రంతో తెలుగు ప్రేక్షక్షుల ఆకట్టుకున్నాడు.  

సాఫ్ట్‌వేర్‌ నుంచి డైరెక్షన్‌లోకి.. 
వినోద్‌ అనంతోజు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాన్ని వదిలేసి, సినీదర్శకుడు కావాలన్న కలను కష్టపడి నిజం చేసుకున్నాడు. తనలాంటి మధ్యతరగతి జీవితాలను వినోదాత్మకంగా తెరకెక్కించి, వీక్షకులను మెప్పించాడు. సుప్రసిద్ధ దర్శకుల అభినందనలూ అందుకున్నాడు.  

గుంటూరు–కొలకలూరులోనే చిత్రీకరణ 
హీరో విజయ్‌ దేవరకొండ సోదరుడు ఆనంద్‌ దేవరకొండ, కన్నడ నటి వర్ష బొల్లమ్మ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన ఈ సినిమాకు గుంటూరు కుర్రోడు దర్శకుడవటమే కాదు.. దాదాపు సినిమా మొత్తం గుంటూరు, తెనాలి సమీపంలో కొలకలూరులోనే చిత్రీకరించటం, ఎక్కువశాతం క్యారెక్టర్లకు రంగస్థల నటీనటులనే తీసుకోవటం విశేషం. ఆయా పాత్రల్లో సురభి జమునారాయలు, సురభి ప్రభావతి, గోపరాజు రమణ వంటి కళాకారులు నటించారు. 

ఆరు నెలల్లో పూర్తి.. 
గతేడాది జూన్‌లో చిత్రీకరణ ప్రారంభించగా దాదాపు ఆరు నెలల్లో పూర్తి చేశారు. ‘పోస్ట్‌ప్రొడక్షన్‌ పనులతో సినిమా సిద్ధమయ్యేసరికి లాక్‌డౌన్‌తో థియేటర్లు మూతపడ్డాయి. ఇప్పటికీ తెరుచుకోలేదు. కనీసం ఓటీటీలోనైనా రిలీజ్‌ చేద్దామని అమెజాన్‌ను సంప్రదించాం. వారికి నచ్చి తీసుకోవటంతో ఇప్పుడు వీక్షకుల ముందుకొచ్చింది’ అని వినోద్‌ చెప్పారు. ‘సినిమాకు పేరొస్తుందని అనుకున్నాగానీ మరీ ఇంతలా వస్తుందని అనుకోలేదు’అని, దర్శకుడు క్రిష్‌ ఫోన్‌ చేసి అభినందించారంటూ ఆనందంతో అనుభవాన్ని సాక్షితో పంచుకున్నారు. 

కళాశాలలో.. 
సినిమాపై ఇష్టంతో వినోద్‌ కాలేజీ రోజుల్లోనే షార్ట్‌ ఫిలిమ్స్‌ తీశాడు. దాదాపు ఎనిమిది లఘుచిత్రాలు తీయగా  ‘శూన్యం’ అనే చిత్రానికి మంచి పేరొచ్చింది. ఒక సినిమా తీయాలనుకునేవాడు ఎలాంటి కథను ఎంచుకుంటాడు? అనే ఆలోచనతో చుట్టూ ఉన్న సమాజం నుంచి ఎలాంటి కథ తయారుచేసుకున్నాడు? అనేది ఇతివృత్తం. తన లఘుచిత్రంలోని హీరోలానే తాను కూడా మధ్యతరగతి జీవితాన్ని ‘మిడిల్‌ క్లాస్‌ మెలొడీస్‌’గా దృశ్యీకరించి పండించాడు. తొలి సినిమాతోనే లక్ష్యాన్ని సాధించి హీరో అనిపించుకున్నాడు. తదుపరి ప్రాజెక్టు కోసం రెండు మూడు కథలపై వర్క్‌ చేస్తున్నట్టు చెప్పారు.  

రెండేళ్ల నిరీక్షణ.. 
వినోద్‌ అనంతోజు మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. తండ్రి విశాలాంధ్ర బుక్‌హౌస్‌ మేనేజరు. తల్లి గృహిణి, సోదరి ఉంది. 2011లో బీటెక్‌ పూర్తి చేశాక ఐటీ కంపెనీలో ఉద్యోగం రావడంతో హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. ఏడేళ్లు పనిచేశాక ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాడు. సినిమా దర్శకుడు కావాలనేది సంకల్పంగా  తన చుట్టూ ఉండే సమాజంలో నుంచి సినిమాకు సరిపడే కథను సిద్ధం చేసుకుని, అవకాశాల కోసం ప్రయత్నించాడు. రెండేళ్లకు భవ్య క్రియేషన్స్‌ సంస్థ నుంచి గ్రీన్‌సిగ్నల్‌ రావటంతో షూటింగ్‌ పట్టాలకెక్కింది.     

మరిన్ని వార్తలు