ఎవరైనా అడిగినే నేను హీరో కాదని చెబుతా: వైష్ణవ్‌ తేజ్‌

21 Nov, 2023 16:56 IST|Sakshi

కథ నచ్చితే చాలు..ఫలితం గురించి ఆలోచించకుండా సినిమాను ఒప్పుకుంటాను. నిజాయితీగా కష్టపడి పనిచేస్తాను. హీరో అని అనిపించుకోవడం కంటే..నటుడు అని పిలిపించుకోవడమే ఇష్టం. ఎవరైన నన్ను అడిగినా కూడా నేను హీరోని కాదు నటుడిని అని చెబుతాను’ అని అన్నారు యంగ్‌ హీరో పంజా వైష్ణవ్‌ తేజ్‌. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం 'ఆదికేశవ'. శ్రీలీల హీరోయిన్‌. తార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ ఫోర్‌ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య  నిర్మిస్తున్న ఈ చిత్రంతో శ్రీకాంత్‌ ఎన్‌ రెడ్డి దర్శకుడిగా తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. . జోజు జార్జ్, అపర్ణా దాస్ ఇతర కీలక పాత్రలు పోషించారు. నవంబర్‌ 24న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో వైష్ణవ్‌ తేజ్‌ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు.. 

రంగ రంగ వైభవంగా చిత్రీకరణ చివరి దశలో ఉన్నప్పుడు నిర్మాత నాగవంశీ గారు ఈ కథ వినమని చెప్పారు. కథ వినగానే నాకు ఎంతగానో నచ్చింది. ఆ తర్వాత కథ ఇంకా ఎన్నో మెరుగులు దిద్దుకుని అద్భుతంగా వచ్చింది.

► ఇది పూర్తిస్థాయి మాస్ సినిమా అయినప్పటికీ కథలో కొత్తదనం ఉంటుంది. కథ విన్నప్పుడే ఇలాంటి పాయింట్ ఎవరూ టచ్ చేయలేదు అనిపించింది. ఇందులో కామెడీ, సాంగ్స్, విజువల్స్, ఫైట్స్ అన్నీ బాగుంటాయి. ప్రేక్షకులు సినిమా చూసి థియేటర్ల నుంచి ఆనందంగా బయటకు వస్తారు.

► నాకు, శ్రీలీల మధ్య వచ్చే సన్నివేశాలు క్యూట్ గా ఉంటాయి. సంభాషణలు సహజంగా సరదాగా ఉంటాయి. షూటింగ్ టైంలో ఆ సన్నివేశాలు చిత్రీకరించేటప్పుడు ఎంతో ఎంజాయ్ చేస్తూ చేశాం. పాత్రలోని అమాయకత్వం, తింగరితనంతో దర్శకుడు శ్రీకాంత్ హాస్యం రాబట్టారు. మీరు స్క్రీన్ మీద చూసేటప్పుడు చాలా ముద్దుగా అనిపిస్తాయి సన్నివేశాలు.

► శ్రీలీలతో డ్యాన్స్ అనగానే కాస్త భయపడ్డాను. నేనసలు డ్యాన్సర్ ని కాదు(నవ్వుతూ). కానీ నేను మాస్టర్ కి ఒకటే చెప్పాను. మీరు ఓకే అనేవరకు నేను ఎంతైనా కష్టపడి చేస్తాను అన్నాను. 100 శాతం కష్టపడి పని చేయడానికి నేనెప్పుడూ సిద్ధంగా ఉంటాను. మొదటి రెండు టేకులకే ఎలా చేయాలి, ఎంత ఎనర్జీ పెట్టాలో అర్థమైపోయింది. మాస్టర్, శ్రీలీల మద్దతుతో పూర్తి న్యాయం చేయగలిగాను.

► రాధిక నటిస్తున్నారని తెలియగానే..అంత సీనియర్ ఆర్టిస్ట్ సెట్స్ లో ఎలా ఉంటారో అనుకున్నాను. కానీ ఆమె అందరితో బాగా కలిసిపోయి సరదాగా మాట్లాడతారు. ఎంతో ఎనర్జిటిక్ గా ఉంటారు. అంతటి సీనియర్ ఆర్టిస్ట్ కలిసి పని చేయడం సంతోషంగా అనిపించింది.

► కథలో కొత్తదనం ఉంటే చాలు సినిమాను ఒప్పేసుకుంటాను. అలాగే నా పాత్రలో కొంచెం కమర్షియాలిటీ ఉండేలా చూసుకుంటాను.

మరిన్ని వార్తలు