Vishal: నా దృష్టిలో థియేట‌ర్లే దేవాల‌యాలు

17 Jan, 2022 12:46 IST|Sakshi

తనకు సంబంధించినంత వరకు థియేటర్లే దేవాలయాలని నటుడు, నిర్మాత విశాల్‌ అన్నారు. ఈయన కథానాయకుడిగా నటించి తన విశాల్‌ ఫిలిమ్స్‌పై నిర్మించిన చిత్రం వీరమే వాగై చుడుమ్‌. నటి డింపుల్‌ కథానాయికగా కోలీవుడ్‌లో పరిచయం అవుతున్న చిత్రం ఇది. అదేవిధంగా తు.ప.శరవణన్‌ దర్శకుడిగా పరిచయమవుతన్నారు.

యువన్‌ శంకర్‌ రాజా సంగీతాన్ని, ప్రవీణ్‌ రాజ్‌ ఛాయాగ్రహణం అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని తమిళం, తెలుగు, మలయాళం, కన్నడం, హిందీ భాషల్లో ఈ నెల 26వ తేదీన విడుదలకు ముస్తాబవుతోంది. తెలుగులో సామాన్యుడు అనే టైటిల్‌ను నిర్ణయించారు. కాగా చిత్రం కథ కంటే కథనం చాలా నచ్చిందని విశాల్‌ అన్నారు. దర్శకుడు శరవణన్‌కు మంచి భవిష్యత్తు ఉందని అన్నారు.

కొత్త దర్శకులు చెప్పిన కథ నచ్చితే దానికి యువన్‌ శంకర్‌ రాజానే సంగీతం అందిస్తారని చెబుతానన్నారు. హీరోలను దృష్టిలో పెట్టుకుని తీసిన చిత్రాలు కొన్ని మాత్రమే సక్సెస్‌ అవుతాయని, అయితే మహిళా పాత్రలకు ప్రాధాన్యత ఇచ్చిన కుటుంబకథా చిత్రాలన్నీ విజయవంతమవుతాయన్నారు. ఈ రెండవ కోవకు చెందిన చిత్రమే వాగై చుడుమ్‌ అని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు