అవకాశం వస్తే పదేళ్ల భవిష్యత్‌లోకి వెళ్తాను

17 Sep, 2022 00:56 IST|Sakshi

– అమల అక్కినేని

‘‘ఒకే ఒక జీవితం’ చూసి, నాగార్జునగారు ‘మా అమ్మ అన్నపూర్ణమ్మగారు గుర్తుకు వచ్చారు.. చాలా గర్వంగా ఉంది’’ అని చెప్పడం గొప్ప అనుభూతినిచ్చింది’’ అని అమల అక్కినేని అన్నారు. శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’. శ్రీ కార్తీక్‌ దర్శకత్వం వహించారు. ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 9న విడుదలైంది.

ఈ చిత్రంలో హీరో శర్వానంద్‌ తల్లి పాత్ర చేసిన అమల మాట్లాడుతూ– ‘‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ తర్వాత మలయాళంలో రెండు, హిందీలో మూడు సినిమాలు, ఒక వెబ్‌ సిరీస్‌ చేశాను. కానీ తెలుగులో ‘లైఫ్‌ ఈజ్‌ బ్యూటిఫుల్‌’ తర్వాత నేను చేసిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’.  ఐదేళ్లుగా ‘అన్నపూర్ణ ఫిల్మ్‌ అండ్‌ మీడియా’ని నేనే చూసుకుంటున్నాను. వందల మంది విద్యార్థుల భవిష్యత్‌ బాధ్యత నాపై ఉండటంతో నటిగా  బిజీగా ఉంటే కష్టం. అందుకే నా మనసుకు హత్తుకునే కథ, ఆ పాత్రకి నేను కరెక్ట్‌ అనిపిస్తే చేస్తాను. అలాంటి కథే ‘ఒకే ఒక జీవితం’.

నిజాయితీతో తీసిన సినిమా ప్రేక్షకులకు ఎప్పుడూ నచ్చుతుందని ఈ మూవీ మరోసారి రుజువు చేసింది. అయితే ‘ఒకే ఒక జీవితం’ లాంటి పాత్రలు చేయడం సవాల్‌తో కూడుకున్నది. ఈ సినిమా చూసిన మా అమ్మగారు నన్ను హత్తుకుని ‘చాలా గర్వంగా ఉంది’ అనడం మర్చిపోలేను. నాగార్జునతో పాటు, మా కుటుంబ సభ్యులు, స్నేహితులు ఈ చిత్రానికి డీప్‌గా కనెక్ట్‌ అయ్యారు. నన్ను చూడకుండా కేవలం కథ, పాత్రలతో ప్రయాణం చేశారు. నాకు గొప్ప తృప్తిని, హాయిని ఇచ్చిన సినిమా ఇది. ఈ చిత్రంలోలా టైమ్‌  మిషన్‌లో వెళ్లే అవకాశం వస్తే పదేళ్ల భవిష్యత్‌లోకి వెళ్తాను (నవ్వుతూ). నాగార్జునగారు, నేను ఇంట్లో ఎప్పుడూ కలిసే ఉంటాం.. మళ్లీ స్క్రీన్‌పై వద్దు (నవ్వుతూ)’’ అన్నారు.  

‘బ్లూ క్రాస్‌ ఆఫ్‌ హైదరాబాద్‌’కి ప్రపంచ స్థాయి గుర్తింపు రావడం ఆనందంగా ఉంది. మంచి వైద్యులు, మేనేజ్‌మెంట్, వాలంటీర్లు ఉన్నారు. నేను ఉన్నా లేకపోయినా అద్భుతమైన సేవలు అందిస్తుంది. ప్రతి శనివారం నేను కూడా స్వచ్ఛందంగా వెళ్లి పని చేస్తున్నాను.  

మరిన్ని వార్తలు