Abhigya Anand Predictions For 2023: అక్టోబరు 14 నుంచి మరిన్ని విపత్తులు?

10 Oct, 2023 10:53 IST|Sakshi

జ్యోతిష్యం... ఇది నమ్మకాలకు సంబంధించిన శాస్త్రం. దీనిని నమ్మేవారు జాతకాల ప్రకారమే జీవితాలు ముందుకు సాగుతుంటాయని చెబుతుంటారు. దీనిని నమ్మనివారు జాతకాలనేవి మూఢ నమ్మకాలని చెబుతుంటారు. అయితే ఒక్కోసారి జ్యోతిష్కులు కాలగణనను అనుసరించి తెలిపే భవిష్యవాణి నిజమవుతుంటుంది. ఒక్కోసారి నిజాలు కాకుండా మిగిలిపోతాయి. దీంతో ఒక్కోసారి జ్యోతిష్కులు గొప్పవారని, మరోమారు వారు తప్పుదారి పట్టిస్తుంటారని పలువురు చెబుతుంటారు. ఏదిఏమైనా కర్నాటకలోని మైసూరువాసి అభిజ్ఞానంద చెప్పే భవిష్యవాణిపై కొందరు ఆసక్తి కనబరుస్తుంటారు. 

చిన్నవయసులోనే అపరిమితమైన విషయపరిజ్ఞానాన్ని సంపాదించి, అందరి మెప్పుపొందిన అభిజ్ఞానంద మరోమారు భవిష్యవాణి వినిపించారు. అభిజ్ఞానంద చెప్పిన కొంత భవిష్యవాణి నిజం కాగా, మరికొంత ఫెయిలయ్యింది. అయితే ఆ కుర్రాడి నాలెడ్జ్‌, పరిణతి అందరినీ ఆకట్టుకుంటోంది. 2006లో జన్మించిన అభిజ్ఞానంద బాల్యం నుంచే తన మేథోతనాన్ని ప్రదర్శించసాగాడు. కరోనా విపత్తు గురించి ముందే చెప్పి, అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా ఎంతో పేరు సంపాదించుకున్నాడు. మరోవైపు 8 ఏళ్ల వయసుకే భగవద్గీతను కంఠతా పట్టేసి, వాటికి వివరణలు ఇస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. 

పిన్నవయసులోనే ఆయుర్వేదిక్‌ మైక్రోబయాలజీలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్‌  చేసిన అభిజ్ఞానంద తాజాగా మరో భవిష్యవాణిని వినిపించాడు. ముంబై దాడులు జరిగిన సమయంలో ఎటువంటి గ్రహగతులు ఉన్నాయో ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితులే ఉన్నాయని, ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం పెచ్చుమీరే పరిస్థితులున్నాయని అభిజ్ఞానంద జోస్యం చెప్పాడు. దీనికితోడు పలు విపత్తులు ప్రపంచాన్ని చుట్టిముడతాయని, దీంతో వరుస విషాదాలు వెంటాడుతాయని పేర్కొన్నాడు. 

ముఖ్యంగా  ఈ ఏడాది అక్టోబరు 14 తరువాత ప్రపంచ రాజకీయాల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటాయని, కొన్ని ప్రాంతాల్లో అనుకోని సంఘటనలు జరుగుతాయని అభిజ్ఞానంద తెలిపాడు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్‌ భూకంపం, ఇజ్రాయిల్‌పై దాడుల నేపధ్యంలో అభిజ్ఞానంద వీడియోలు తెగ వైరల్‌ అవుతున్నాయి. ఏ గ్రహగతుల కారణంగా ఇటువంటి విపత్కర పరిస్థితులు సంభవిస్తాయో ఆ వీడియోలో తెలియజేశాడు. తన వీడియోలో ఒక మ్యాప్‌ పొందుపరిచి.. ఏఏ ప్రాంతాల్లో కల్లోలం ఏర్పడుతుందో చూపించాడు. ఇజ్రాయెల్‌, పాలస్తీనాల యుద్ధ ప్రభావం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలపై కూడా ‍ప్రభావం చూపనుందని పేర్కొన్నాడు. ఈ గ్రహతుల ప్రభావం భారతదేశంపైన కూడా ఉన్నదని అభిజ్ఞానంద తెలిపాడు. 
ఇది కూడా చదవండి: కిమ్‌ సోదరి యో జోంగ్‌ ఎందుకంత డేంజర్‌?
 

మరిన్ని వార్తలు