Intinti Gruhalakshmi: ఫంక్షన్‌లో నందుకు విడాకులిచ్చిన లాస్య!

1 Jul, 2021 13:21 IST|Sakshi

ఇంటింటి గృహలక్ష్మి 360వ ఎపిసోడ్‌ ప్రత్యేకం

Intinti Gruhalakshmi July 1వ ఎపిసోడ్‌: అనసూయ దంపతుల పెళ్లిరోజు వేడుక ఘనంగా, సంతోషంగా సాగింది. ఈ సందర్భంగా దంపతుల మధ్య అన్యోన్యతను, సఖ్యతను వివరిస్తూ నందు తండ్రి పెద్ద లెక్చరే ఇచ్చాడు. పెళ్లి గొప్పతనాన్ని వివరించాడు. కానీ ప్రస్తుత కాలంలో ఎంతమంది పెళ్లిని గౌరవిస్తున్నారని తులసి తల్లి సరస్వతి తన అభిప్రాయాన్ని వెల్లడించింది. ఇదే అదును అనుకున్న లాస్య తోక తొక్కిన తాచులా దిగ్గున లేచింది.

ఆవిడ కావాలని నందును పని గట్టుకుని తిడుతోందని పేర్కొంది. అల్లుడిని అవమిస్తున్నావంటూ సరస్వతిని నోటికొచ్చినట్లు తిట్టింది. పక్కవాళ్లు సంతోషంగా ఉంటే చూడలేవా? మొగుడు పోయినదానివి నీకేం తెలుస్తుంది ఇలాంటి వేడుకల విలువ? అని ఈసడించుకుంది. దీంతో సహనం కోల్పోయిన తులసి ఆమె చెంప చెళ్లుమనిపించింది. ఇంకొక్క మాట మాట్లాడితే నిలువునా పాతేస్తానని వార్నింగ్‌ ఇచ్చింది.

"నన్నంటే పడ్డాను, మంచితనంతో ఆడుకుంటే వదిలేశాను, నాది అనుకున్న ప్రతీదాన్ని లాక్కున్నా భరించాను, కానీ నా తల్లి జోలికొస్తే ఊరుకునేదే లేదు" అని హెచ్చరించింది. దీంతో లాస్య.. నా మీద చేయి చేసుకుంటే చూస్తూ ఊరుకున్నావేంటని నందును రెచ్చగొట్టింది. ఆమె ఒత్తిడి మీద తులసి ముందుకు వచ్చిన నందు.. లాస్య చేసిన తప్పేంటని ప్రశ్నించాడు. నందు లాస్యకు సపోర్ట్‌ చేయడాన్ని చూసి తులసి షాక్‌ తింది.

అప్పనంగా వస్తున్న ఆడపిల్ల కనిపిస్తుంది కానీ అప్పగింతల సమయంలో ఆడపిల్లల కన్నీళ్లు మాత్రం కనిపించవని నిందించింది. ఆడపిల్లల తల్లిదండ్రుల గొప్పతనం గురించి పెద్ద క్లాస్‌ పీకింది. "మీ అత్తను ఇన్ని మాటలు అన్నదాన్ని చెప్పు తీసుకుని కొట్టాలి, కానీ మీరు తన తప్పేంటని అడుగుతున్నారు? అవును, నిజమే.. తప్పు చేసింది నేను. నా భర్త ఏదో ఒకరోజు మారతాడని ఎదురు చూడటమే నేను చేసిన తప్పు. విడాకుల మీద సంతకం చేశాక కూడా మీరు నా సొంతం అవుతారని ఆశపడటం నేను చేసిన తప్పు. ఇప్పుడు చెప్తున్నా వినండి.. ఈ క్షణమే మీకు నా మనస్సాక్షిగా విడాకులిస్తున్నా. ఈ క్షణం నుంచి మీరెవరో, నేనెవరో?" అని తులసి తేల్చి చెప్పేసింది.

ఈ హఠాత్పరిణామంతో లాస్య లోలోపలే తెగ సంతోషించింది. అయితే రేపటి ఎపిసోడ్‌లో భారీ ట్విస్ట్‌ చోటు చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. నిన్ను అవమానించే ఈ కుటుంబం నీకొద్దంటూ లాస్య నందును శాశ్వతంగా తన ఫ్యామిలీకి దూరం చేయాలని చూసింది. వాళ్లతో తెగదింపులు చేసుకుందామని నందును అక్కడి నుంచి లాక్కుపోవాలని చూసింది. కానీ నందు మాత్రం శిలావిగ్రహంలా అక్కడే నిలబడిపోయాడు. మరి చివరికి నందు తన కుటుంబంతో ఉండటానికి సిద్ధపడతాడా? లేదా లాస్యతో వెళ్లిపోతాడా? అన్నది ఉత్కంఠగా మారింది.

చదవండి: ఇక్కడ ఫెయిలైతే తర్వాత ఏంటి? ప్లాన్‌ బి కూడా లేదు!

రాధే శ్యామ్‌ క్లైమాక్స్‌ సీన్‌ లీక్‌, కన్నీరు పెట్టించే ప్రేరణ మృతి!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు