Kangana Ranaut: 'నా సినిమాలపై డబ్బులిచ్చి మరీ నెగిటివ్‌ ప్రచారం'

8 Jan, 2024 13:53 IST|Sakshi

బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ఇండస్ట్రీలో పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది తేజస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన కంగనా.. ప్రస్తుతం ఎమర్జన్సీ చిత్రంలో నటిస్తోంది. అయితే ఎప్పుడు వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తాజాగా ఆమె చేసిన ట్వీట్ నెట్టింట వైరల్‌గా మారింది. సినిమాల్లో మహిళల పరిస్థితిని చూస్తుంటే తన గుండె తరుక్కుపోతోందంటూ ట్వీట్‌లో రాసుకొచ్చింది. 

కంగనా తన ట్వీట్‌లో రాస్తూ..' ప్రస్తుతం సినిమాల ట్రెండ్ చూస్తుంటే భయంకరంగా మారింది. మహిళల పరువును, వారి బట్టలను హింసాత్మకంగా, అవమానకరంగా తీసి కేవలం గోడమీద పువ్వు లాగా మార్చేస్తున్నారు. ఇవన్నీ చూస్తుంటే నేను సినిమాల్లోకి వచ్చినప్పటీ రోజులు గుర్తుకొస్తున్నాయి. అసభ్యకరమైన ఐటెమ్ నంబర్లు, మూగ పాత్రలు ప్రబలంగా ఉన్నాయి. చాలా ఏళ్లుగా వేతన సమానత్వం కోసం పోరాడుతున్నా. అందుకే గ్యాంగ్‌స్టర్, వో లమ్హే, ఫ్యాషన్, క్వీన్, తను వెడ్స్ మను, మణికర్ణిక, తలైవి, తేజస్ వంటి లేడీ ఓరియంటెడ్ చిత్రాలను నిర్మించాను కూడా. అందుకే యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌, ధర్మ వంటి పెద్ద ప్రొడక్షన్స్‌కు వ్యతిరేకంగా వెళ్లా.' అని తెలిపింది.

అంతే కాకుండా..  అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, రణబీర్ కపూర్ వంటి పెద్ద హీరోలకు కూడా నో చెప్పా. కానీ నాకు వారితో వ్యక్తిగతంగా వైరం లేదు. కేవలం మహిళా సాధికారత కోసమే నా పోరాటం. నేటి సినిమాల్లోని మహిళల స్థితిగతులు చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. దీనికి సినీ పరిశ్రమ మాత్రమే కారణమా? సినిమాల్లో స్త్రీల ఈ విపరీతమైన ధోరణికి ప్రేక్షకులకు భాగస్వామ్యం లేదా?' అంటూ పోస్ట్ చేసింది. అంతే కాకుండా తన సినిమాలపై చేస్తున్న నెగెటివ్ ప్రచారంపై కూడా స్పందించింది. 

కంగనా తన ట్వీట్‌లో ప్రస్తావిస్తూ..' నా సినిమాలకు  డబ్బులిచ్చి మరీ నెగిటివ్‌ ప్రచారం చేయడం ఎక్కువైంది. అయినా నేను ఇప్పటికీ అలాంటి వారిపై పోరాడుతున్నా. కానీ ప్రేక్షకులు కూడా మహిళలను కేవలం లైంగిక వస్తువులుగా భావించి, బూట్లు నాకమని అడిగే చిత్రాలనే ప్రోత్సహిస్తున్నారు. ఇది స్త్రీల కోసం తన జీవితాన్ని అంకితం చేస్తున్న వారిని తీవ్రంగా నిరుత్సాహపరుస్తుంది. రాబోయే కాలంలో మహిళా సాధికారత చిత్రాలే కెరీర్‌గా ఎంచుకున్న నా జీవితంలో మరింత విలువైన సమయం ఇవ్వాలని కోరుకుంటున్నా.' అని రాసుకొచ్చింది. 


 

>
మరిన్ని వార్తలు