Palasa 1978 Movie: 'పలాస'కు అరుదైన గౌరవం.. ఆ ఫెస్టివల్‌కు ఎంపిక

5 Apr, 2022 19:33 IST|Sakshi

Karuna Kumar Palasa 1978 Movie Selected For PK Rose Film Festival: 1978 ప్రాంతంలో శ్రీకాకుళం జిల్లాలోని పలాసలో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘పలాస 1978’. రక్షిత్‌, నక్షత్ర జంటగా తెరకెక్కిన ఈ చిత్రంతో కరుణ కుమార్‌ అనే నూతన దర్శకుడు టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. ధ్యాన్‌ అట్లూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో రఘు కుంచె కీలక పాత్ర పోషిస్తూ సంగీతమందించాడు. మార్చి 6, 2020న విడుదలైన ఈ సినిమా మంచి ప్రేక్షాదరణ పొందింది. తాజాగా ఈ సినిమా మరో అరుదైన గౌరవం దక్కించుకుంది. ఈనెల 9,10,11 తేదిలలో చెన్నైలో నిర్వహించే పికె. రోజ్‌ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితం కాబోయే సినిమాల్లో 'పలాస 1978' కూడా ఎంపికైంది. 

ఈ సందర్భంగా దర్శకుడు కరుణ కుమార్‌ సంతోషం వ్యక్తం చేశారు. 'ఎస్సీ, ఎస్టీల జీవనాన్ని, వారి జీవిత గాథలను కథా చిత్రాలుగా మలిచే డైరెక్టర్‌ పా రంజిత్‌. ఆయన 2018లో వానమ్‌ ఆర్ట్‌ ఫెస్టివల్‌ను ప్రారంభించారు. కరోనా తర్వాత మళ్లీ ఈ వేడుక జరగనుంది. ఏప్రిల్‌ నెలను 'దళిత్‌ మంత్‌'గా సెలబ్రేట్‌ చేసుకుంటున్నారు. ఏప్రిల్‌ 14న అంబేడ్కర్‌ పుట్టినరోజు పురస్కరించుకొని చేస్తున్న ఈ ఫెస్టివల్‌లో సాహిత్యం, సినిమా రెండు కూడా ప్రధాన భూమికలు పోషిస్తున్నాయి. ఎస్సీ, ఎస్టీ పాలిటిక్స్‌ను ఇతివృత్తంగా తెరకెక్కించిన సినిమాలను ఈ వేడుకలో ప్రదర్శిస్తారు. దేశం గర్వించే ద‌ర్శకుల సినిమాల ప‌క్క‌న 'ప‌లాస 1978' చిత్రానికి చోటు ద‌క్క‌డం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఫెస్టివ‌ల్‌లో భాగమైనందుకు నాకు గ‌ర్వంగా కూడా ఉంది. ఇలాంటి సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారని 'ప‌లాస‌'తో నాకు అనుభవంలోకి వ‌చ్చింది. దానితో పాటు ఇటువంటి వేదికలపై 'ప‌లాస 1978 ' సినిమా ప్ర‌ద‌ర్శించ‌డం ద‌ర్శ‌కుడుగా మ‌రిచిపోలేని అనుభ‌వం కాబోతుంది.' అని కరుణ కుమార్‌ తెలిపారు. 

చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో రిలీజయ్యే సినిమాలు..

మరిన్ని వార్తలు