త్రిషతో వివాదం.. మన్సూర్‌ అలీఖాన్‌పై రెడ్‌ కార్డ్‌.. రియాక్ట్‌ అయిన నితిన్‌

21 Nov, 2023 08:46 IST|Sakshi

కోలీవుడ్‌లో నటి త్రిష, నటుడు మన్సూర్‌ అలీ ఖాన్‌ వ్యవహారం రోజురోజుకు ముదురుతోంది. త్రిష గురించి నటుడు మన్సూర్‌ అలీఖాన్‌ ఒక భేటీలో అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై నటి త్రిష తీవ్రంగా స్పందించారు. ఆమెకు నటి కుష్బూ, మాళవిక నాయర్‌, లియో చిత్ర దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌, దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం నిర్వాహకులు మద్దతుగా నిలిచారు. త్రిషకు మన్సూర్‌ అలీ ఖాన్‌ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు.

అయితే ఈ వ్యవహారంపై స్పందించిన మన్సూర్‌ అలీ ఖాన్‌ తాను సరదాగా అన్నానని, దాన్ని వివాదాస్పదం చేయవద్దని కోరారు. తనపై రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అయితే త్రిషకు క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దక్షిణ భారత నటీనటుల సంఘం కోరితే తాను వివరణ ఇవ్వడానికి సిద్ధం ఉన్నానని అన్నారు. దీంతో ఆయనపై మూకుమ్మడి ఒత్తిడి వస్తోంది.

(ఇదీ చదవండి: విజయకాంత్‌ ఆరోగ్యంపై వివరణ ఇచ్చిన తమిళనాడు మంత్రి)

మన్సూర్‌ అలీఖాన్‌పై దక్షిణ భారత సినీ నటీనటుల సంఘం ఆయనపై రెడ్‌ కార్డ్‌ వేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. కాగా ఈ వ్యవహారం జాతీయ మహిళా కమిషన్‌ వరకు వెళ్లింది. త్రిష గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన ఆయనపై 509 బీ సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీకి కమిషన్‌ ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారం ఎంత వరకు వెళుతుందో చూడాలి.

అహంకారపూరిత వ్యాఖ్యలకు చోటులేదు: నితిన్‌
'త్రిషపై మన్సూర్ అలీ ఖాన్ చేసిన నీచమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇలాంటి అహంకారపూరిత వ్యాఖ్యలకు ఇండస్ట్రీలో చోటులేదు. ఇలా మహిళలపై నీచమైన వ్యాఖ్యలు చేసే వారిపై పోరాడలని, మహిళలకు మద్దతుగా నిలబడాలని సినీ ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను' అని నితిన్ తన ట్విటర్ వేదికగా ట్వీట్ చేశాడు. గతంలో 'అల్లరి బుల్లోడు' చిత్రంలో త్రిష, నితిన్‌ కలిసి నటించిన విషయం తెలిసిందే. త్రిషకు కోలీవుడ్‌లో మాత్రమే కాదు టాలీవుడ్‌లో కూడా సపోర్ట్‌ దొరుకుతుంది.

మరిన్ని వార్తలు