Lata Mangeshkar: వాళ్లు అలా అనేసరికి లతా మంగేష్కర్‌ ఒక్కరోజే బడికెళ్లింది

7 Feb, 2022 02:13 IST|Sakshi

ముంబై: పదినెలల చెల్లిని బడిలోకి తీసుకురావద్దన్నారన్న కోపంతో బడి ముఖమే చూడకూడదని పంతం పట్టింది ఒక చిన్నారి. అలా బడి మానేసిన చిన్నారి భారతరత్నగా ఎదగడంలో స్వయం కృషి ఎంతో ఉంది. లతా మంగేష్కర్‌ చిన్నతనంలో చెల్లెలు ఆశాను తీసుకొని స్కూలుకు వెళ్లింది. అయితే పసిపిల్లను బడిలోకి తేవద్దంటూ టీచర్‌ అభ్యంతరం పెట్టడంతో కోపంతో వెనక్కు వెళ్లిన లత మళ్లీ బడి ముఖం చూడలేదు. చిన్నప్పుడు మరాఠీ అక్షరాలు చదవడం, రాయడం ఇంట్లోనే పనిమనిషి సాయంతో నేర్చుకున్నట్లు లతా మంగేష్కర్‌.. ఇన్‌ హర్‌ ఓన్‌ వాయిస్‌ పుస్తకంలో చెప్పారు.

మరీ పసితనంలో నర్సరీ క్లాసులకు వెళ్లానని, బోర్డు మీద రాసిన శ్రీ గణేశ్‌ జీ అనే అక్షరాలను అచ్చుగుద్దినట్లు దింపినందుకు అప్పుడు తనకు పదికి పది వచ్చాయని చెప్పారు. తన బంధువు వసంతి మ్యూజిక్‌ క్లాసులకు వెళ్లేదని, ఆమెతో పాటు వెళ్లిన తనను పాట ఆకర్షించిందని ఆమె చెప్పారు. తనకు నాలుగేళ్ల వయసున్నప్పుడు తన ఆసక్తిని గమనించి అందరు టీచర్ల ముందు మ్యూజిక్‌టీచర్‌ పాడమన్నారని, అప్పుడు హిందోళంలో పాట పాడానని చెప్పారు. ఆ తర్వాత తనను బడికి రమ్మన్నారని, అక్కడకు ఆశాను తీసుకొని వెళ్లిన తనను టీచర్‌ అడ్డుకోవడంతో వెనక్కు వచ్చానని వివరించారు. కాలక్రమంలో బంధువులు, ప్రైవేట్‌ టీచర్ల సాయంతో హిందీ నేర్చుకున్నానన్నారు. తర్వాత కాలంలో ఉర్దూ, బెంగాలీ, కొంత మేర పంజాబీ నేర్చుకున్నానని, సంస్కృతం అర్థమవుతుందని, తమిళ్‌ అవగాహన చేసుకునే యత్నం చేశానని లత చెప్పారు.
 

మరిన్ని వార్తలు