'లాల్‌ సలామ్‌' పాటలో ఆ దివంగత సింగర్స్​ గాత్రం.. ఎలా సాధ్యం?

30 Jan, 2024 11:38 IST|Sakshi

రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ ఫిబ్రవరి 9న విడుదలవుతోంది. ఈ చిత్రంలో ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన 'తిమిరి ఎలుదా' అనే పాటను ఏఐ టెక్నాలజీతో రూపొందించారు. ఈ పాటలో దివంగత గాయకులు షాహుల్ హమీద్, బాంబ భక్య స్వరాలను ఉపయోగించడంతో ఆ పాటపై అందరిలో ఆసక్తి నెలకొంది. సంగీత ప్రపంచంలో ఇదొక అద్భుతం అని నెటిజన్ల నుంచి కామెంట్లు వస్తున్నాయి. ఇదెలా సాధ్యం అంటూ కొందరు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీంతో తాజాగా ఏఆర్ రెహమాన్ వివరణ ఇచ్చారు.

లాల్ సలామ్ ఆడియోను కొద్దిరోజుల క్రితం చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఈ చిత్రంలోని పాటలకు మంచి టాక్‌ వచ్చింది. కానీ ఇందులోని తిమిరి ఎలుదా అనే పాట కోసం గతంలో మరణించిన వారి వాయిస్‌ ఉపయోగించడంతో ఆయనపై కొంతమేరకు విమర్శలు వచ్చాయి. 'గతంలో మరణించిన ఆ ఇద్దరి సింగర్స్‌ వాయిస్ అల్గారిథమ్‌లను ఉపయోగించేందుకు వారి కుటుంబ సభ్యుల నుంచి అనుమతి​ తీసుకున్నాము. అందుకు గాను ఆ కుటుంబాలకు తగినంత పారితోషకాన్ని కూడా అందించడం జరిగింది. మంచి కోసం టెక్నాలజీని ఉపయోగించడంలో ఎలాంటి తప్పులేదు.' అని రెహమాన్​ తన ఎక్స్‌ పేజీలో పోస్ట్‌ చేశారు. 

మరణించిన సింగర్స్ వాయిస్‌తో పాటలు రూపొందించడం ప్రపంచంలో ఇదే తొలిసారి అని చెబుతున్నారు. 1990లలో తన మ్యాజికల్ వాయిస్‌తో అభిమానులను ఉర్రూతలూగించిన షాహుల్ హమీద్. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌లో పలు సాంగ్స్‌ పాడటం జరిగింది. 1997లో ఆయన తుది శ్వాస విడిచారు. బాంబ భక్య కూడా రెహమాన్‌ మ్యూజిక్‌లో పాటలు పాడారు. ముఖ్యంగా రోబో, బిగిల్‌,పొన్నియిన్‌ సెల్వన్‌ వంటి చిత్రాల్లో ఆయన గాత్రం పాపులర్‌ అయింది. 2022లో ఆయన కూడా మరణించిన విషయం తెలిసిందే. అమ అభిమాన సింగర్స్‌ గాత్రాన్ని ఏఐ టెక్నాలజీతో మళ్లీ మరోసారి వినేలా చేసిన రెహమాన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నారు.

ఇక లాల్‌ సలామ్‌ సినిమా విషయానికి వస్తే.. రజనీకాంత్, లెజెండరీ క్రికెటర్‌ కపిల్‌దేవ్, జీవితా రాజశేఖర్‌ కీలక పాత్రల్లో విష్ణు విశాల్, విక్రాంత్‌ హీరోలుగా ఇందులో నటించారు. ఐశ్వర్యా రజనీకాంత్‌ దర్శకత్వంలో సుభాస్కరన్‌ ఈ సినిమాను నిర్మించారు.  ఫిబ్రవరి 9న ఈ సినిమా విడుదల కానుంది.

whatsapp channel

మరిన్ని వార్తలు