ఒంటిపై ఖాకీ.. చేతిలో తుపాకీ, విజృంభింస్తున్న హీరోయిన్లు

20 Jan, 2023 09:07 IST|Sakshi

తుపాకీ పట్టారు.. విలన్లపై గురి పెట్టారు...రెచ్చిపోయి ఫైట్స్‌ చేస్తున్నారు... బాక్సాఫీస్‌ కలెక్షన్లపై గురి పెట్టారు... ప్రస్తుతం కొందరు కథానాయికలు సిన్సియర్‌ పోలీసాఫీసర్లుగా, లేడీ జేమ్స్‌ బాండ్‌ తరహా పాత్రల్లో నటిస్తున్నారు. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం.

సీనియర్‌ నటి టబు మరో రెండు నెలల్లో ఇన్స్‌పెక్టర్‌ డయానా జోసెఫ్‌గా కనిపించనున్నారు. అజయ్‌ దేవగన్‌ హీరోగా  నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న హిందీ చిత్రం ‘భోలా’లోనే ఆమె పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌ డయానా జోసెఫ్‌ పాత్ర చేస్తున్నారు. మూడు రోజుల క్రితం ఈ చిత్రంలో టబు లుక్‌ విడుదలైంది. మార్చి 30న ఈ చిత్రం విడుదల కానుంది.

ఇక గత ఏడాది సెప్టెంబర్‌లో ‘పొన్నియిన్‌ సెల్వన్‌’ చిత్రంలో యువరాణి పాత్రలో కనిపించిన త్రిష త్వరలో విడుదల కానున్న వెబ్‌ సిరీస్‌ ‘బృందా’లో తుపాకీ తూటాలను అలవోకగా వదిలే పోలీస్‌గా కనిపించనున్నారు. త్రిష నటించిన తొలి వెబ్‌ సిరీస్‌ ఇది. సూర్య వంగల దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్‌ సీజన్‌ వన్‌ షూటింగ్‌ ఇటీవలే పూర్తయింది. త్వరలో స్ట్రీమింగ్‌ కానుంది. ఓ పవర్‌ఫుల్‌ పోలీస్‌ ఆఫీసర్‌ చుట్టూ తిరిగే కథతో ఈ సిరీస్‌ రూపొందింది.

ఇక కాజల్‌ అగర్వాల్‌ కూడా సిన్సియర్‌ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. ‘ఘోస్టీ’ అనే చిత్రంలోనే ఈ పాత్ర చేశారామె. తన తండ్రి అడుగుజాడలను అనుసరించి, పోలీస్‌గా మారుతుంది ఆర్తి (కాజల్‌). ఇరవయ్యేళ్ల క్రితం తన తండ్రి కస్టడీ నుంచి తప్పించుకున్న ఖైదీని పట్టుకోవాలన్నదే ఆర్తి ఆకాంక్ష. ఈ క్రమంలో ఆమెకు విచిత్రమైన ఘటనలు ఎదురవుతుంటాయి. కాజల్‌ నటించిన తొలి హారర్‌ సినిమా ఇది. కల్యాణ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.

మరోవైపు అధికారిక ప్రకటన రాలేదు కానీ ఓ హిందీ షోలో తమన్నా పోలీస్‌గా చేస్తున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో ఈ షో సాగుతుందని సమాచారం. ఇంకోవైపు దాదాపు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలు చేస్తున్న నయనతార తన తొలి హిందీ చిత్రం ‘జవాన్‌’లో పోలీసాఫీసర్‌ పాత్ర చేస్తున్నారు. షారుక్‌ ఖాన్‌ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న తొలి హిందీ చిత్రం ఇది. ఈ చిత్రంలో అన్యాయంగా జైలుపాలైన మహిళలను విడిపించి, వారిని సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడే ఒక టీమ్‌గా మార్చే కామన్‌ మేన్‌ పాత్రను షారుక్‌ ఖాన్‌ చేస్తున్నారని సమాచారం. ఈ కేసును ఛేదించే పోలీసాఫీసర్‌ పాత్రలో నయనతార కనిపిస్తారని టాక్‌. ఈ ఏడాది జూన్‌ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు.

ఇక అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలంటే దర్శకులకు గుర్తొచ్చే కథానాయికల్లో కీర్తీ సురేష్‌ ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం కీర్తి చేస్తున్న చిత్రాల్లో ‘రివాల్వర్‌ రీటా’ ఒకటి. రెండు చేతులతో రెండు తుపాకీలు పట్టుకుని అలవోకగా షూట్‌ చేసే రీటా పాత్రలో కనిపించనున్నారు కీర్తి. కె. చంద్రు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో లేడీ జేమ్స్‌ బాండ్‌ తరహా పాత్ర చేస్తున్నారామె.

మరోవైపు హిందీ చిత్రం ‘కమాండో’ సీక్వెల్స్‌లో పోలీస్‌ ఇన్స్‌పెక్టర్‌ భావనా రెడ్డిగా కనిపించిన అదా శర్మ ప్రస్తుతం ఓ హిందీ చిత్రంలో పోలీస్‌ ఆఫీసర్‌గా చేస్తున్నారు. విశాల్‌ పాండ్య దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మరోసారి పోలీస్‌గా నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది అంటున్నారు అదా. ఇక ‘సీతారామం’ చిత్రంతో పాపులర్‌ అయిన మృణాల్‌ ఠాకూర్‌ నటించిన హిందీ చిత్రం ‘గూమ్రా’. ‘సీతారామం’లో సున్నిత మనసు ఉన్న సీత పాత్రలో అందర్నీ ఆకట్టుకున్న మృణాల్‌ ‘గూమ్రా’లో శక్తిమంతమైన పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ పాత్ర చేయడానికి శిక్షణ తీసుకున్నారు మృణాల్‌. తమిళ చిత్రం ‘తడమ్‌’కి రీమేక్‌గా వర్థన్‌ కట్కర్‌ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ తారలే కాదు.. మరికొందరు కథానాయికలు కూడా పోలీసాఫీసర్‌ పాత్రలో విజృంభించనున్నారు.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు