ఆ హీరో తుపాకీ కాల్చడం నేర్పించాడు : మంజు వారియర్‌

8 Jan, 2023 08:13 IST|Sakshi

తమిళసినిమా: అజిత్‌ కథానాయకుడిగా నటించిన తుణివు చిత్రం సంక్రాంతి సందర్భంగా ఈ నెల 11వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. హెచ్‌ వినోద్‌ దసరా, జీ సినిమాతో కలిసి బోనీకపూర్‌ నిర్మించిన ఈ చిత్రానికి అనిరుద్‌ సంగీతాన్ని అందించారు. ఇందులో అజిత్‌ సరసన మలయాళీ స్టార్‌ నటి మంజు వారియర్‌ తొలిసారిగా నటించారు. అదేవిధంగా ఈమె తమిళంలో నటించిన రెండవ చిత్రం ఇది.

ఇంతకు ముందు ధనుష్‌తో కలిసి అసురన్‌ చిత్రంలో నటించారు. ఈ సందర్భంగా తుణివు చిత్రంలో నటించిన అనుభవాన్ని మంజు వారియర్‌ ఒక భేటీలో పేర్కొంటూ ఈ చిత్రం కొత్త అనుభవమని పేర్కొన్నారు. ఇంతకుముందు అసురన్‌ చిత్రంలో చేసిన ప్రాత్రకు.. తుణివు చిత్రంలోని క్యారెక్టర్‌కు పోలికే ఉండదన్నారు. ఇందులో యాక్షన్‌ హీరోయిన్‌గా నటించినట్లు చెప్పారు. కణ్మణి అనే యువతిగా ఒక చేతితో తుపాకీ కాల్చడం కష్టతరం కావడంతో హీరో అజిత్‌ నేర్పించారన్నారు.

తాను ఇంతకుముందు అనేక చిత్రాల్లో నటించాను కానీ, యాక్షన్‌ పాత్రలో నటించడం ఇదే తొలిసారి అని చెప్పారు. అసురన్‌ చిత్రం తరువాత మంచి అవకాశాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో తుణివు చిత్రంలో నటించే అవకాశం వచ్చిందన్నారు. కథ నచ్చడంతోనే ఇందులో నటించడానికి అంగీకరించినట్లు చెప్పారు. అసురన్‌ చిత్రంలోని పచ్చయమ్మాళ్‌ పాత్రను ప్రేక్షకులు ఎలా ఆదరించారో ఈ చిత్రంలోని కణ్మణి పాత్రను కూడా అలాగే ప్రోత్సహిస్తారని భావిస్తున్నట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు