Money Heist: స్పానిష్‌ టీవీ సిరీస్‌కు ఫుల్‌ క్రేజ్‌ ఎందుకంటే..

5 Aug, 2021 14:32 IST|Sakshi

ఎంటర్‌టైన్‌మెంట్‌కి ఎల్లలు లేవు. అందుకే లోకల్‌ కంటెంట్‌తో పాటు గ్లోబల్‌ కంటెంట్‌కు ఆదరణ ఉంటోంది. ఇక ఓటీటీ వాడకం పెరిగాక.. దేశాలు దాటేసి మరీ సినిమాలు, సిరీస్‌లను డిజిటల్‌ తెరలపై చూసేస్తున్నారు మనవాళ్లు. ఆ లిస్ట్‌లో ఒకటే ‘మనీ హెయిస్ట్‌’.  ఎక్కడో స్పెయిన్‌లో  తెరకెక్కిన ఈ టీవీ సిరీస్‌కి.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఫ్యాన్స్‌.. అందులో తెలుగువాళ్లూ ఉన్నారంటే అతిశయోక్తి కాదు.  అంతేకాదు ప్రపంచంలో ఇప్పటిదాకా ఎక్కువమంది(ఇండియన్స్‌తో సహా) చూసిన నాన్‌–ఇంగ్లీష్‌ సిరీస్‌ కూడా ఇదే(ఇదొక రికార్డు). మనీ హెయిస్ట్‌కి ఇంతలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడటానికి ప్రధాన కారణాలు.. ఈ సిరీస్‌ మూలకథ, ప్రధాన పాత్రలతో వ్యూయర్స్‌ పెంచుకున్న కనెక్టివిటీ. అందుకే ఐదో పార్ట్ రూపంలో అలరించేందుకు సిద్ధమైంది ఈ దొంగల ముఠా డ్రామా. 

సాక్షి, వెబ్‌డెస్క్‌: క్రైమ్‌ థ్రిల్లర్స్‌ని ఇష్టపడేవాళ్లకు ‘మనీ హెయిస్ట్‌’ ఒక ఫుల్‌ మీల్స్‌. ఒరిజినల్‌గా ఇది స్పానిష్ లాంగ్వేజ్‌లో తెరకెక్కింది. నాన్‌–స్పానిష్‌ ఆడియెన్స్‌ కోసం ఇంగ్లీష్‌ సబ్‌ టైటిల్స్‌తో సిరీస్‌ను అందిస్తున్నారు. మొదటి సీజన్‌ 2017 మే 2న స్పానిష్‌ టీవీ ఛానెల్‌ ‘అంటెనా 3’ లో టెలికాస్ట్ అయ్యింది. స్పానిష్‌లో మనీ హెయిస్ట్‌ ఒక టెలినోవెలా.. అంటే టెలిసీరియల్‌ లాంటిదన్నమాట. మనీ హెయిస్ట్‌ టెలికాస్ట్‌ తర్వాత.. అప్పటిదాకా ఉన్న స్పానిష్ టీవీ వ్యూయర్‌షిప్‌ రికార్డులన్నీ చెరిగిపోయాయి. ఆ పాపులారిటీని గుర్తించి నెట్‌ఫ్లిక్స్‌ మనీ హెయిస్ట్‌ రైట్స్‌ని కొనుగోలు చేసింది. అలా నెట్‌ఫ్లిక్స్‌ నుంచి ప్రపంచం మొత్తం ఈ ట్విస్టీ థ్రిల్లర్‌కు అడిక్ట్‌ అయ్యింది. మరో రికార్డ్‌ ఏంటంటే.. నెట్‌ఫ్లిక్స్‌లో ఎక్కువ వ్యూయర్‌షిప్‌ ఉన్న టీవీ సిరీస్‌ కూడా ఇదే!. 

మనీ హెయిస్ట్‌ ఇప్పటిదాకా రెండు సీజన్స్‌.. నాలుగు పార్ట్‌లు.. 31 ఎపిసోడ్స్‌గా టెలికాస్ట్ అయ్యింది. ఇప్పుడు రెండో సీజన్‌లో ఐదో పార్ట్‌గా పది ఎపిసోడ్స్‌తో రాబోతోంది. సెప్టెంబర్‌ 3న ఐదు వాల్యూమ్స్‌(ఎపిసోడ్స్‌గా) రిలీజ్‌ కానుంది. ఆ పై డిసెంబర్‌లో మిగిలిన ఐదు రిలీజ్‌ అవుతాయి. దీంతో  ఎప్పుడెప్పుడు చూసేద్దామా అనే ఎగ్జయిట్‌మెంట్‌ ఫ్యాన్స్‌లో మొదలైంది. 


ఎందుకంత అడిక్షన్‌?
మనీ హెయిస్ట్‌ ఒరిజినల్‌(స్పానిష్‌) టైటిల్‌ ‘లా కాసా డె పాపెల్‌’.  బ్యాంకుల దోపిడీ(హెయిస్ట్‌) నేపథ్యంలో సాగే కథ ఈ సిరీస్‌ది.  దోపిడీకి ప్రయత్నించే గ్యాంగ్‌.. ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని చూసే పోలీసులు.. వెరసి ఇంట్రెస్టింగ్‌ సీక్వెన్స్‌తో కథ ముందుకెళ్తుంది. అలాగని స్టోరీ నార్మల్‌గా ఉండదు. సీన్‌కి సీన్‌కి ఆడియెన్స్‌లో హీట్‌ పెంచుతుంది. ట్విస్టుల కారణంగా ‘ప్రతీ సీన్‌ ఒక క్లైమాక్స్‌లా’ అనిపిస్తుంది. కథలో తర్వాతి సీన్‌ ఏం జరుగుతుందనేది వ్యూయర్స్‌ అస్సలు అంచనా వేయలేరు. ఆ ఎగ్జయిట్‌మెంటే చూసేవాళ్లను సీటు అంచున కూర్చోబెడుతుంది. కథలో ఒక్కోసారి ఫ్లాష్‌బ్యాక్‌ సీన్స్‌ వస్తుంటాయి. వాటి ఆధారంగానే కథ సరికొత్త మలుపు తిరుగుతుంది. ఆడియెన్స్‌ని ప్రధానంగా ఆకట్టుకునే అంశం కూడా ఇదే. ఇక స్క్రీన్‌ప్లే సైతం గ్రిప్పింగ్‌గా ఉంటుంది. ప్రతీ క్యారెక్టర్‌ చెప్పే  డైలాగులు ఫిలసాఫికల్‌ డెప్త్‌తో ఉంటాయి. అందుకే  ఒక్కసారి ఇన్‌వాల్వ్‌ అయ్యారంటే వదలకుండా చూస్తుంటారు. ఈ సిరీస్‌కి సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ వచ్చినా సరే ట్విట్టర్‌లో ఒకటి, రెండు రోజులు ట్రెండింగ్‌లో ఉంటుందంటే అర్థం చేసుకోవచ్చు మనీ హెయిస్ట్‌ క్రేజ్‌ ఏపాటిదో.   

క్యారెక్టర్స్‌ కనెక్టివిటీ 
కాస్టింగ్‌ ఎక్కువగా ఉన్నప్పుడు.. ప్రతీ క్యారెక్టర్‌కి కరెక్ట్ సీన్లు పడటం కొంచెం కష్టంతో కూడుకున్న పని. కానీ, మనీ హెయిస్ట్‌లో ప్రతీ క్యారెక్టర్‌కి సమాన ప్రాధాన్యం ఉంటుంది. క్యారెక్టర్లను ఒక్కొక్కటిగా పరిశీలిస్తే..  ఈ కథ నారేటర్‌, దోపిడీ ముఠాలో ఫస్ట్‌ మెంబర్‌ ‘టోక్యో’. ఇక మెయిన్‌ క్యారెక్టర్‌ ‘ఎల్‌’ ఫ్రొఫెసర్‌. దోపిడీ వెనుక మాస్టర్‌ మైండ్‌ ఇతనే. నిజానికి అతని యాక్చువల్ ప్లాన్‌ వేరే ఉంటుంది. ప్రొఫెసర్‌తో పాటు నైరోబీ, బెర్లిన్‌(ప్రొఫెసర్‌ బ్రదర్‌) అనే మరో రెండు క్యారెక్టర్లు టోటల్‌గా ఈ సిరీస్‌కే కిరాక్‌ పుట్టించే క్యారెక్టర్లు. అందుకే వాటికి సెపరేట్‌ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అసలు కథ విషయానికొస్తే.. ఆరంభంలో ఒక బ్యాంక్‌ దొంగతనం చేయబోయి ఆ ప్రయత్నంలో ఫెయిల్ అవుతుంది ఒలివెయిరా(టోక్యో).  ఆమెను పోలీసుల బారి నుంచి రక్షిస్తాడు ప్రొఫెసర్‌.  ఆమెతో పాటు మరో ఏడుగురిని ఒకచోట చేర్చి భారీ దోపిడీలకు ప్లాన్‌ గీస్తాడు. ఆ ముఠాలో ప్రొఫెసర్‌ బ్రదర్ అండ్రెస్‌ డె ఫోనోల్లోసా(బెర్లిన్‌) కూడా ఉంటాడు.ఆ గ్యాంగ్‌లో ఒకరి వివరాలు ఒకరికి తెలియవు. కానీ, ఎక్కడో దూరంగా ఉండి ప్రొఫెసర్‌ ఇచ్చే సూచనల మేరకు పని చేస్తుంటారు.  పోలీసుల నుంచి రక్షించుకునే క్రమంలో జరిగే పోరాట సన్నివేశాలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. ఈ క్రమంలో వాడే మోడరన్‌ టెక్నాలజీ, వెపన్స్‌ ప్రత్యేకంగా ఉంటాయి. మధ్యమధ్యలో క్యారెక్టర్ల రిలేషన్స్‌,  ఎమోషన్స్‌, లవ్‌ ట్రాక్స్‌..  ఇలా కథ సాగుతూ పోతుంటుంది. కథలో ప్రతీ క్యారెక్టర్‌ను వ్యూయర్స్‌ ఓన్‌ చేసుకున్నారు కాబట్టే.. అంతలా సూపర్‌ హిట్‌ అయ్యింది ఈ సిరీస్‌.

సాల్వడోర్‌కు గౌరవసూచికంగా..
మనీ హెయిస్ట్‌ కథలో మరో ప్రధాన ఆకర్షణ.. క్యారెక్టర్ల పేర్లు. ముఠాలోని సభ్యులకు ఒరిజినల్ పేర్లు వేరే ఉంటాయి. వాళ్ల ఐడెంటిటీ మార్చేసే క్రమంలో వివిధ దేశాల రాజధానుల పేర్లు పెడతాడు ప్రొఫెసర్‌. టోక్యో, మాస్కో, బెర్లిన్‌, నైరోబీ, స్టాక్‌హోమ్‌, హెల్సెంకీ... ఇలాగన్నమాట. ఒకరకంగా ఈ పేర్లే మనీ హెయిస్ట్‌ను ఆడియెన్స్‌కి దగ్గర చేశాయి.. హయ్యెస్ట్‌ వ్యూయర్‌షిప్‌తో బ్రహ్మరథం పట్టేలా చేశాయి. కథలో ఆకట్టుకునే విషయం దోపిడీ ముఠా ధరించే మాస్క్‌లు. ఈ మాస్క్‌లకూ ఒక ప్రత్యేకత ఉంది. స్పానిష్‌ ప్రముఖ పెయింటర్‌ సాల్వడోర్‌ డాలి. ఆయన గౌరవార్థం.. ఆయన ముఖకవళికలతో ఉన్న మాస్క్‌ను ఈ సిరీస్‌కు మెయిన్‌ ఎట్రాక్షన్‌ చేశాడు  ‘లా కాసా డె పాపెల్‌’ క్రియేటర్‌ అలెక్స్‌ పీనా. ఈ టీవీ షో తర్వాతే అలెక్స్‌ పీనా పేరు ప్రపంచం మొత్తం మారుమోగింది. ఆయనకి బడా ఛాన్స్‌లు తెచ్చిపెట్టింది. 

ఊపేసిన బెల్లా చావ్‌
మనీ హెయిస్ట్‌ థీమ్‌ మ్యూజిక్‌ కంటే.. ఈ సిరీస్‌ మొత్తంలో చాలాసార్లు ప్లే అయ్యే పాట బెల్లా సియావో(బెల్లా చావ్‌)కి ఒక ప్రత్యేకత ఉంది. బెల్లా సియావో ఒక ఇటాలియన్‌ జానపద గేయం. ఇంగ్లీష్‌లో దానర్థం ‘గుడ్‌బై బ్యూటిఫుల్’ అని. పాత రోజుల్లో ఇటలీలో మాండినా(సీజనల్ వ్యవసాయ మహిళా కూలీలు) తమ కష్టాల్ని గుర్తించాలని భూస్వాములకు గుర్తు చేస్తూ ఈ పాటను  పాడేవాళ్లు. 19వ శతాబ్దం మొదట్లో నార్త్ ఇటలీలో వ్యవసాయ కూలీలు దారుణమైన పరిస్థితుల్ని ఎదుర్కొనేవాళ్లు. ఆ టైంలో ఈ పాట ఉద్యమ గేయంగా ఒక ఊపు ఊపింది. 1943–45 టైంలో యాంటీ–ఫాసిస్టులు ఈ పాటను ఎక్కువగా పాడేవాళ్లు.  ఆ తర్వాత ఈ పాట వరల్డ్‌ కల్చర్‌లో ఒక భాగమైంది. చాలా దేశాల్లో రీమేక్‌ అయ్యింది. 1969 నుంచి మెయిన్‌ స్ట్రీమ్‌ సినిమాల్లో కూడా బెల్లా సియావో ఒక భాగమైంది. కానీ, మోస్ట్ పాపులర్‌ సాంగ్‌గా గుర్తింపు పొందింది మాత్రం మనీ హెయిస్ట్ సిరీస్‌తో.  మెయిన్‌ క్యారెక్టర్స్‌ ఎల్ ప్రొఫెసర్‌, బెర్లిన్‌(అన్నదమ్ములు) కలిసి పాడిన ఈ పాట తర్వాత సీజన్‌ల మొత్తం నడుస్తూనే  ఉంటుంది. 2018 సమ్మర్‌లో ‘బెల్లా సియావో’ యూరప్‌లో ఒక చార్ట్‌బస్టర్‌సాంగ్‌గా గుర్తింపు పొందింది. తెలుగులో మహేష్‌ బాబు ‘బిజినెస్‌ మేన్‌’లో.. ‘పిల్లా.. చావే...’ సాంగ్‌ దీని నుంచే స్ఫూర్తి పొందిందన్నది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
 

మరిన్ని వార్తలు