వెల్‌కమ్‌ దాసరి హర్షిత.. జపాన్‌ నుంచి నేడు స్వదేశానికి..

12 Nov, 2023 10:26 IST|Sakshi
స్వదేశానికి వస్తున్న విద్యార్ధులు, టోక్యోలో మాట్లాడుతున్న హర్షిత

సాక్షి, కరీంనగర్: తొమ్మిదో జాతీయ ఇన్‌స్పైర్‌ అవార్డుల పోటీల్లో సత్తాచాటి జిల్లా పేరు ఇనుమండింపజేసిన దాసరి హర్షిత అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొని ఆదివారం స్వదేశానికి చేరుకోనుంది. రామగిరి మండలం చందనాపూర్‌ జెడ్పీ హైస్కూల్‌లో పదో తరగతి చదువుతున్న హర్షిత ఈనెల 4 నుంచి 11వ తేదీ వరకు జపాన్‌ రాజధాని టోక్యో వేదికగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన సకూర కార్యక్రమంలో పాల్గొంది.

గతేడాది సెప్టెంబర్‌ 14 నుంచి 16వ తేదీ వరకు ఢిల్లీ వేదికగా నిర్వహించిన 9వ జాతీయ ఇన్‌స్పైర్‌ అవార్డుల ప్రదర్శన పోటీల్లో జిల్లా నుంచి నలుగురు విద్యార్థులు హాజరవగా.. హర్సిత ప్రతిభ చూపించింది. కేంద్ర శాస్త్ర,సాంకేతిక శాఖమంత్రి జితేంద్రసింగ్‌ నుంచి అవార్డును అందుకున్నట్లు డీఈవో మాధవి తెలిపారు. అలాగే ఈఏడాది ఏప్రిల్‌ 10 నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రపతి భవన్‌లో నిర్వహించిన ఫైన్‌ కార్యక్రమంలో పాల్గొని నేరుగా రాష్ట్రపతికి తను రూపొందించిన బహుళ ప్రయోజనకర హెల్మెట్‌ గురించి వివరించి మన్ననలు పొందింది.

జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఢిల్లీ ప్రగతిమైదాన్‌లో మే 10, 11, 12వ తేదీల్లో నిర్వహించిన ప్రత్యేక ప్రదర్శనలోనూ ప్రతిభ చాటింది. మనరాష్ట్రం నుంచి 9వ జాతీయ ప్రదర్శన పోటీల్లో విజేతలైన 8 మంది విద్యార్థులతో కలిసి అంతర్జాతీయ కార్యక్రమానికి ఎంపికై ంది. దేశం నలుమూలల నుంచి ఏడు, ఎనిమిది, తొమ్మిదో జాతీయ ఇన్‌స్పైర్‌ అవార్డు– మనక్‌ పోటీల్లో విజేతలైన 59 మంది విద్యార్థులు, అధికారులు ఇందులో పాల్గొన్నారు. మనరాష్ట్రం నుంచి ఆరుగురు విద్యార్థులు ఇందులో ఉన్నారు. ఆదేశంలోని మన రాయబార కార్యాలయంతోపాటు పలు విద్యా, వైజ్ఞానిక, సాంస్కృతిక వారసత్వం కలిగిన 15కు పైగా ప్రదేశాలను తిలకించి రావడం హర్షిత ప్రత్యేకత.

పాఠశాల స్థాయి నుంచే..
పాఠశాలస్థాయి ప్రదర్శన నుంచే చైనా, సైప్రస్‌, ఉజ్బెకిస్తాన్‌, తజబిస్తాన్‌ లాంటి దేశాల విద్యార్థులు పాల్గొన్న అంతర్జాతీయస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో పాల్గొనడానికి అరుదైన అవకాశం మనదేశంలోని గ్రామీణి ప్రాంతానికి చెందిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని హర్షితకు రావడం విశేషం. ఆమెను ప్రో త్సాహించిన గైడ్‌ టీచర్‌ సంపత్‌కుమార్‌ను డీఈవో మాధవి, జిల్లా సైన్స్‌ అధికారి రవినందన్‌రావు, హెచ్‌ఎం లక్ష్మి, ఉపాధ్యాయులు అభినందించారు.

మరిన్ని వార్తలు