Kalyani Malik : 'సునీతతో కలిసి పాడాను.. ఆమెకు అవార్డు వచ్చింది, నాకు రాలేదు'

9 Mar, 2023 09:17 IST|Sakshi

‘‘ఓ సినిమా సంగీతం విషయంలో అధిక భాగం దర్శకుల పాత్ర ఉంటుంది. దర్శకుడి అభిరుచిని బట్టే సినిమా, సంగీతం ఉంటాయి. నా సంగీతం బాగుందంటే అందులో ఎక్కువ క్రెడిట్‌ నా దర్శకులకే ఇస్తాను’’ అన్నారు సంగీత దర్శకుడు కళ్యాణీ మాలిక్‌. నాగశౌర్య, మాళవికా నాయర్‌ జంటగా శ్రీనివాస్‌ అవసరాల దర్శకత్వం వహించిన చిత్రం ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’. టీజీ విశ్వప్రసాద్, పద్మజ దాసరి నిర్మించిన ఈ సినిమా ఈ నెల 17న రిలీజవుతోంది.

ఈ సందర్భంగా చిత్ర సంగీత దర్శకుడు కళ్యాణీ మాలిక్‌ మాట్లాడుతూ– ‘‘2003లో నా తొలి సినిమా ‘ఐతే’ రిలీజైంది. ఈ 20 ఏళ్లలో ‘ఫలానా అబ్బాయి..’ నా 19వ సినిమా. సంవత్సరానికో సినిమా చేస్తున్నాను. ఈ ప్రయాణంలో నా సంగీతానికి ఎన్నో ప్రశంసలు దక్కాయి. ఆ విషయంలో సంతృప్తిగా ఉన్నాను. నా కెరీర్‌లో ‘ఫలానా అబ్బాయి..’ లోని ‘కనుల చాటు మేఘమా..’ ఉత్తమ పాట అని చెప్పగలను.

ఈ పాటకు జాతీయ అవార్డు వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశాను. కానీ జాతీయ అవార్డులు ఎవరికి ఇస్తారో, అవి ఎలా వస్తాయో ఈ మధ్య ఓ ఫ్రెండ్‌ చెప్పాడు. దాంతో అవార్డులపై నమ్మకం పోయింది. నాకిప్పటివరకూ ఒక్క అవార్డు కూడా రాలేదు. ‘ఊహలు గుసగుసలాడే’లోని ‘ఏం సందేహం లేదు..’ పాటని నేను, సునీత పాడాం. సునీతకు అవార్డు వచ్చింది కానీ నాకు రాలేదు. అప్పటి నుంచి అవార్డుల గురించి పట్టించుకోవడం మానేశా.

నా సినిమా, నా పాట నచ్చి ఎవరైనా నిర్మాత నాకు మరో చాన్స్‌ ఇస్తే అదే పెద్ద అవార్డుగా భావిస్తాను. మా అన్నయ్య (కీరవాణి) స్వరపరిచిన ‘నాటు నాటు..’ ఆస్కార్‌ బరిలో నిలవడం గర్వంగా ఉంది. ఇక నేను సంగీతం అందించిన ‘ఇంటింటి రామాయణం’, ‘విద్య వాసుల అహం’ చిత్రాలు రిలీజ్‌కి రెడీగా ఉన్నా యి. రెండు వెబ్‌ సిరీస్‌లు చేస్తున్నా’’ అన్నారు.
 

మరిన్ని వార్తలు