వేతనజీవులు.. ఆంధ్రాలో అధికం | Sakshi
Sakshi News home page

వేతనజీవులు.. ఆంధ్రాలో అధికం

Published Thu, Mar 9 2023 9:22 AM

Details Of Wage Earners In AP As Per Labor Force Survey - Sakshi

సాక్షి, అమరావతి: దేశసగటు కన్నా రాష్ట్రంలోనే వేతన పురుషులు, మహిళల శాతం ఎక్కువగా ఉంది. ఈ విష­యం కేంద్ర కార్యక్రమాల అమలు, గణాంకాల­శాఖ నిర్వహించిన 2021–22 లేబర్‌ ఫోర్స్‌ సర్వేలో వెల్లడైంది. వేతన మహిళలు దేశంలో సగటున 16.5 శాతం ఉండగా, రాష్ట్రంలో 17.2 శాతం ఉన్నారు. వే­త­న పురుషులు దేశంలో సగటున 23.6 శాతం ఉండగా, రాష్ట్రంలో 27.6 శాతం ఉన్నారు.

రాష్ట్రం­లో పట్టణాల్లో పురుషు­లతో సమా­నంగా మహిళలు కూడా వేత­నాలపై జీవిస్తున్నారు. పట్టణా­ల్లో 48.8శాతం వేతన పురుషు­లుండగా, 47.8శాతం వేతన మహిళలున్నారు. గ్రామీ­ణ ప్రాంతాల్లో రాష్ట్రంలో 15.7 శాతం వేతన పురుషులు ఉండగా, 9.7శాతం వేతన మహిళలున్నారు. కోవిడ్‌ ప్ర­భా­వం నేపథ్యంలో లేబర్‌ ఫోర్స్‌ సర్వేలో జా­ప్యం జరిగిందని నివేది­కలో పేర్కొ­న్నారు. దేశంలో అన్ని రాష్ట్రాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వేతన పురుషులు, మహి­ళలు, స్వయం ఉపాధిపై ఆధారప­డిన­వారు, సాధారణ కూలీల శాతంపై సర్వే నిర్వహించారు. రాష్ట్రంలో 44 శాతం పురుషులు, 42.4 శాతం మహిళలు స్వయం ఉపా­ధిపై ఆధారపడి జీవిస్తున్నా­రు. రాష్ట్రం­లో సాధారణ కూలీలు­గా 40.4 శాతం మహి­ళ­లు, 28.4 శాతం పురుషులు ఉపాధి పొందుతున్నారు. 

ఢిల్లీ, చండీగఢ్, కేరళల్లో వేతన మహిళలు అత్యధికం 
ఢిల్లీ, చండీగఢ్, కేరళల్లో వేతన పురుషుల కన్నా వేతన మహిళలు ఎక్కువగా ఉన్నారు. ఢిల్లీలో వేతన మహిళలు 83 శాతం కాగా వేతన పురుషులు 63.3 శాతమే. చండీగఢ్‌లో వేతన మహిళలు 67.7 శాతం కాగా వేతన పురుషులు 61.5 శాతం, కేరళలో వేతన మహిళలు 37.3 శాతం, వేతన పురుషులు 27.5 శాతం ఉన్నారు. బిహార్‌లో అత్యల్పంగా వేతన పురుషులు 9.9 శాతం ఉండగా వేతన మహిళలు 10.7 శాతం ఉన్నారు. వేతన మహిళల్లో జార్ఖండ్‌లో అత్యల్పంగా 6.3 శాతం, ఆ తరువాత మధ్యప్రదేశ్‌లో 7.7 శాతం, రాజస్థాన్‌లో 7.6 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 6.7 శాతం ఉన్నారు.  

Advertisement
Advertisement