Naga Chaitanya Thank You: చాలా మారాను.. ఫిజికల్‌గా, మెంటల్‌గా..

20 Jul, 2022 07:12 IST|Sakshi

Naga Chaitanya Comments On Thank You Movie: ‘‘ప్రేక్షకుల ఆలోచనల్లో మార్పు వచ్చింది. సినిమాలో కొత్త విషయం ఉంటేనే థియేటర్స్‌కు వస్తున్నారు. ట్రైలర్‌ చూసి ఆ మూవీ చూడాలా? వద్దా అని నిర్ణయించుకుంటున్నారు. ఇప్పుడు చిత్రాల ఎంపికలో నా మైండ్‌ సెట్‌ కూడా మారింది. సినిమాలో హీరో, డైరెక్టర్‌ అనే విషయాలు పక్కన పెడితే కథే కింగ్‌ అని నమ్ముతాను’’ అని అక్కినేని నాగచైతన్య అన్నారు. విక్రమ్‌ కె. కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘థ్యాంక్యూ’. నాగచైతన్య హీరోగా, రాశీఖన్నా, మాళవికా నాయర్, అవికా గోర్‌ హీరోయిన్లుగా నటించారు. అనిత సమర్పణలో ఆదిత్య మ్యూజిక్‌ కాంబినేషన్‌లో ‘దిల్‌’ రాజు, శిరీష్‌ నిర్మించిన ‘థ్యాంక్యూ’ ఈ నెల 22న విడుదలవుతోంది. ఈ సందర్భంగా నాగచైతన్య చెప్పిన విశేషాలు.  

‘దిల్‌’ రాజుగారితో 12 ఏళ్ల తర్వాత (2019లో ‘జోష్‌’ వచ్చింది) ‘థ్యాంక్యూ’ సినిమా చేశాను. ఈ గ్యాప్‌లో ఆయన కాంపౌండ్‌  నుంచి చాలా కథలు విన్నాను. అయితే ఎగ్జయిటెడ్‌గా అనిపించలేదు. కానీ ‘థ్యాంక్యూ’ గురించి రాజు, విక్రమ్, బీవీఎస్‌ రవి చెప్పినప్పుడు ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. ఈ సినిమా తప్పక చేయాలనిపించి, చేశా. ఇలాంటి స్క్రిప్ట్స్‌ దొరకడం చాలా కష్టం.  ‘థ్యాంక్యూ’ సినిమా నాకు ఫిజికల్‌గా, మెంటల్‌గా ఛాలెంజింగ్‌గా అనిపించింది. ఇందులో మూడు షేడ్స్‌లో ఉన్నట్టు కనిపిస్తాను. కానీ ఇందులో చాలా షేడ్స్‌ ఉంటాయి. 16 ఏళ్ల నుంచి 36 ఏళ్ల వరకు రకరకాల దశలలో  కనిపిస్తాను. ఇప్పుడంటే నన్ను టీనేజర్‌ పాత్రలో ప్రేక్షకులు చూస్తున్నారు. ఇంకో మూడు, నాలుగేళ్ల తర్వాత నేను ఇలాంటి సినిమాలు చేస్తానంటే ఎవరూ పెద్దగా ఇంట్రస్ట్‌ చూపించరు. అందుకే ఈ ప్రాజెక్ట్‌ టేకప్‌ చేశాను (నవ్వుతూ). 

విక్రమ్‌ కుమార్‌ సున్నితమైన విషయాలను బాగా డీల్‌ చేస్తారు. ఒక వ్యక్తి తన జీవితంలో కలిసే వ్యక్తుల వల్ల ఎలా ప్రభావం చెందాడు? అనేది ‘థ్యాంక్యూ’లో మెయిన్‌ పాయింట్‌. ఈ సినిమాతో వ్యక్తిగా నేను చాలా మారాను. అంతకు ముందు మనసులో ఉన్న విషయాలను సగమే బయటకు చెప్పేవాణ్ణి.. ఇప్పుడు ఫ్రెండ్స్, ఫ్యామిలీకి మరింత క్లోజ్‌ అయ్యాను. మనసు విప్పి మాట్లాడుతున్నాను.  ఈ సినిమాలో 16 ఏళ్ల కుర్రాడిలా కనపడటానికి ప్రొడక్షన్‌ వాళ్లు సపోర్ట్‌ చేసి, మూడు నెలలు సమయం ఇచ్చారు. ఆ టైమ్‌లో వర్కవుట్స్‌తో పాటు బాడీ లాంగ్వేజ్‌ పరంగా వర్క్‌షాప్స్‌ కూడా చేశాను. ప్రతి స్క్రిప్ట్‌లోనూ అది దొరకదు. ఈ సినిమాలో దొరికింది. ఇప్పుడంటే నా శరీరం కూడా సపోర్ట్‌ చేస్తోంది. భవిష్యత్‌లో కుదురుతుందో? లేదో చూడాలి (నవ్వుతూ).  

అఖిల్‌ ‘ఏజెంట్‌’ ట్రైలర్‌ బాగుంది. తన లుక్‌ మార్చుకోవటం కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు. ‘ఏజెంట్‌’తో తనకు మాస్, కమర్షియల్‌గా పెద్ద సక్సెస్‌ వస్తుందనుకుంటున్నాను.  నా తర్వాతి సినిమా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో ఉంటుంది. ఇందులో నాది పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర. తరుణ్‌ భాస్కర్‌తో ఓ చిత్రం డిస్కషన్‌లో ఉంది. పరుశురామ్‌తోనూ ఓ పాయింట్‌ అనుకున్నాం. కోవిడ్‌ సమయంలోనే హిందీలో ‘లాల్‌సింగ్‌ చద్దా’ అవకాశం వచ్చింది. ఈ సినిమా కోసం 25కిలోలు బరువు తగ్గాను. నాన్న (నాగార్జున), చిరంజీవి, రాజమౌళి, సుకుమార్, ఆమిర్‌ ఖాన్‌ గార్లతో ‘లాల్‌సింగ్‌ చద్దా’ ప్రీమియర్‌ చూడటం మరచిపోలేని అనుభూతి. అందరికీ సినిమా బాగా నచ్చింది. చిరంజీవిగారు మా సినిమాని సమర్పించడం ఆనందంగా ఉంది. ఈ సినిమాతో హిందీ ప్రేక్షకులు నన్ను యాక్సెప్ట్‌ చేయాలి. అప్పుడే బాలీవుడ్‌ సినిమాల గురించి ఆలోచిస్తాను.  
 

మరిన్ని వార్తలు