రెండు తలల పిల్లిని ఎప్పుడైనా చూశారా?

20 Jul, 2022 07:12 IST|Sakshi

బ్యాంకాక్‌: ఇదేమిటో తెలుసా? పిల్లి కూన. అయితే అల్లాటప్పా కూన కాదు. ఏకంగా రెండు తలలతో పుట్టిన కూన! ఇలా పుట్టినవి సాధారణంగా కొన్ని గంటల కంటే బతకవు. కానీ ఆదివారం థాయ్‌లాండ్‌లో పుట్టిన ఈ కూన మాత్రం భేషుగ్గా బతికేసింది. పైగా రెండు మూతులతోనూ పాలు తాగేస్తోందంటూ యజమాని మురిసిపోతున్నాడు. దీనికి టుంగ్‌ గ్రెన్‌ (వెండి బ్యాగు), టుంగ్‌ టోంగ్‌ (బంగారు బ్యాగు) అని ఏకంగా రెండు పేర్లు కూడా పెట్టుకున్నాడు. ఒక్కో తలకు ఒక్కో పేరన్నమాట! దీని తల్లి ముందుగా ఒక మామూలు కూనను కనింది. తర్వాత రెండో కాన్పు కష్టంగా మారడంతో హుటాహుటిన స్థానిక పశువుల ఆస్పత్రికి తీసుకెళ్లారట. వాళ్లు సిజేరియన్‌ చేసి ఈ అరుదైన రెండు తలల కూనను విజయవంతంగా బయటికి తీశారు. దాంతో యజమాని ఆనందంలో మునిగిపోయాడు. ‘‘చనిపోతుందేమోనని ముందుగా భయపడ్డా. అలాంటిదేమీ జరక్కపోవడంతో నా ఆనందం రెట్టింపైంది’’ అని చెప్పుకొచ్చాడు. రెండు తలల పిల్లుల్ని రెండు తలల రోమన్‌ దేవత జానస్‌ పేరిట జానస్‌ క్యాట్స్‌ అని పిలుస్తారు. 

ఫ్రాంక్‌ అండ్‌ లూయీదే గిన్నిస్‌ రికార్డు  
ఏకంగా 15 ఏళ్లు బతికిన రెండు తలల పిల్లి ఇది! దీని పేరు ఫ్రాంక్‌ అండ్‌ లూయీ. 1999లో అమెరికాలోని మసాచుసెట్స్‌లో పుట్టింది. అత్యధిక కాలం బతికిన జానస్‌ క్యాట్‌గా 2012లోనే ఇది గిన్నిస్‌ బుక్కులోకి ఎక్కింది. అన్నట్టూ, ఇది మూడు కళ్లతో పుట్టడం విశేషం.

ఇదీ చదవండి: ఆ పిల్లి... కోలుకుంటోంది!

మరిన్ని వార్తలు