అన్నపూరణి ఆగింది 

12 Jan, 2024 00:53 IST|Sakshi

బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అన్నపూరణికి దేశంలోనే నంబర్‌ వన్‌ చెఫ్‌ కావాలన్నది ఆశయం. తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి మాంసాహార వంటలు చేసేందుకు సిద్ధం అవుతుంది. అది మాత్రమే కాదు.. ముస్లిమ్‌ యువకుడితో ప్రేమలో పడుతుంది. నయనతార టైటిల్‌ రోల్‌లో నటించిన ‘అన్నపూరణి’ చిత్రం ప్రధానాంశం ఇది. ‘ది గాడెస్‌ ఆఫ్‌ ఫుడ్‌’ అనేది ఉపశీర్షిక. నీలేష్‌ కృష్ణ దర్శకత్వంలో జతిన్‌ సేథీ, ఆర్‌. రవీంద్రన్‌ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్‌ 1న థియేటర్లలో విడుదలై, అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయితే ఓటీటీ ప్రేక్షకులను కొంత ఆకట్టుకోగలిగింది.

ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతోంది. కానీ ఓ బ్రాహ్మణ యువతి మాంసాహారం వండటం, ముస్లిమ్‌ యువకుడితో ప్రేమలో పడటం అనే కథాంశం వివాదమైంది. పైగా రాముడు కూడా మాంసాహారం తిన్నాడన్నట్లు, వాల్మీకి అయోధ్య కాండలో ఉందన్నట్లు ఓ డైలాగ్‌ కూడా ఉంది. ఓ దేవత (అన్నపూర్ణ) మీద టైటిల్‌ పెట్టి ఇలాంటి సినిమా తీయడం తగదనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.

దాంతో ఈ చిత్రాన్ని బ్యాన్‌ చేయాలని కొందరు బ్రాహ్మణ సంఘం నాయకులు డిమాండ్‌ మొదలుపెట్టారు. అలాగే మహారాష్ట్రకు చెందిన శివసేన మాజీ నేత రమేశ్‌ సోలంకి ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ నెట్‌ఫ్లిక్స్‌ పై తగిన చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నయనతారపై కూడా కేసు నమోదైంది. వివాదం పెద్దదవుతుండటంతో ఈ సినిమా స్ట్రీమింగ్‌ను నిలిపివేస్తున్నట్లు నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. ఆ విధంగా ఓటీటీలో ‘అన్నపూరణి’ ఆట ఆగింది.

>
మరిన్ని వార్తలు