'ఒకే ఒక జీవితం' చూసి ఎమోషనల్ అయిన నాగార్జున, అఖిల్‌!

7 Sep, 2022 16:21 IST|Sakshi

శ్రీ కార్తీక్ దర్శకుడిగా పరిచయం అవుతూ, శర్వానంద్, రీతూ వర్మ జంటగా నటించిన చిత్రం ‘ఒకే ఒక జీవితం’ (తమిళంలో ‘కణం’). అక్కినేని అమల, ‘వెన్నెల’ కిశోర్, ప్రియదర్శి కీలక పాత్రలు పోషించారు. ఎస్‌ఆర్‌ ప్రకాశ్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్‌ కానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి హైదరాబాద్‌లోని ఏఎంబీ సినిమాస్‌లో సెలబ్రిటీ ప్రీమియర్‌ షో వేసింది చిత్రబృందం. ఈ షోకి  అక్కినేని నాగార్జున, అఖిల్, దర్శకులు దేవ కట్టా, హను రాఘవపూడి, చందూ మొండేటి, మేర్లపాక గాంధీ, వశిష్ఠ్, వెంకీ కుడుముల, వెంకీ అట్లూరి తదితరులు  హాజరయ్యారు.

సినిమా చూసి నాగార్జున, అఖిల్‌ ఎమోషనల్‌కు గురయ్యారు. ముఖ్యంగా తల్లికొడుకుల మధ్య వచ్చే కొన్ని ఎమోషనల్‌ సీన్స్‌ నాగ్‌ని కంటతడి పెట్టించాయట. ఇంత గొప్ప కథను తెరకెక్కించిన దర్శకుడి కార్తీక్‌ని, అద్భుతంగా నటించిన శర్వానంద్‌ని అక్కినేని హీరోలు అభినందించారు.

ఓకే ఒక జీవితం అద్భుతమైన సినిమా అని, ఇప్పటి వరకు వచ్చిన టైమ్‌ ట్రావెల్‌ చిత్రాలకు పూర్తి భిన్నంగా ఈ చిత్రం ఉందని దర్శకులు హనురాఘవ పూడి, చందూ మొండేటి అన్నారు. గతంలోకి వెళ్లి మనల్ని మనం సరిచేసుకునే అవకాశం వస్తే ఎలా ఉంటుందన్న పాయింట్‌ని కార్తీక్‌ తెరపై చక్కగా చూపించారని ప్రశంసించారు. ఈ చిత్రానికి జేక్స్ బిజాయ్ సంగీతం అందించగా... సిరివెన్నెల సీతారామశాస్త్రి, కృష్ణకాంత్, కృష్ణచైతన్య సాహిత్యం అందించారు. తెలుగులో తరుణ్ భాస్కర్ డైలాగులు రాశారు.

(చదవండి: ఈ వారం ఓటీటీ, థియేటర్లో సందడి చేసే చిత్రాలివే)

మరిన్ని వార్తలు