Pinki Kumari Sonkar: ఆస్కార్ గెలిచిందని స్థలమిచ్చారు..ఇప్పుడేమో ఇంటిని కూల్చేస్తున్నారు!

1 Oct, 2023 14:49 IST|Sakshi

2009లో ఆస్కార్ అవార్డ్ పొందిన డాక్యుమెంటరీ చిత్రం స్మైల్ పింకీ. ఈ చిత్రంలో ఓ మారుమూల ప్రాంతానికి చెందిన పింకీ జీవితం ఆధారంగా మెగాన్ మైలాన్ తెరకెక్కించారు. ఈ చిత్రంలో నటించిన ఆరేళ్ల పాప పేరు పింకీ సోంకర్.  ఆమె తన తండ్రితో కలిసి ఆస్కార్‌ అవార్డ్‌ను అందుకుంది. ఈ డాక్యుమెంటరీతో దేశ వ్యాప్తంగా పింకీ పేరు మారుమోగిపోయింది. 

అయితే పింకీ కుటుంబం చాలా పేదరికంలో ఉంది. పింకీ తండ్రి రాజేంద్ర సోంకర్ కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తుంటారు. వీరి కుటుంబం ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ మారుమూల పల్లెలో నివసిస్తోంది. అయితే గతంలో ఆస్కార్ అవార్డ్ వచ్చినందుకు పింకీ కుటుంబానికి అధికారులు కొంత భూమిని ఇచ్చారు. ప్రస్తుతం అదే స్థలంలో ఇంటిని నిర్మించుకొని జీవనం సాగిస్తోంది పింకీ ఫ్యామీలీ. అయితే తాజాగా ఈ కుటుంబానికి ఉత్తరప్రదేశ్ అధికారులు ఇచ్చిన నోటీసులు చర్చనీయాంశంగా మారాయి. 

యూపీ ప్రభుత్వం అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ అధికారులు అక్రమ నిర్మాణాలను గుర్తించి నోటీసులు జారీ చేస్తున్నారు. తాజాగా పింకీ ఫ్యామిలీకి కూడా ఇంటిని కూల్చివేస్తున్నట్లు అధికారులు నోటీసులిచ్చారు.  మీర్జాపూర్ జిల్లా ధాబీ గ్రామంలో చాలామందికి అటవీ శాఖ అధికారులు నోటీసులు జారీ చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పింకీ తండ్రి  రాజేంద్ర సోంకర్ మాట్లాడుతూ.. తాము ప్రభుత్వం ఇచ్చిన స్థలంలోనే ఇంటిని నిర్మించామని చెబుతున్నారు.  ఆస్కార్ విజేత ఇంటిని కూల్చివేస్తామనడం యూపీతో పాటు దేశంలోనూ హాట్‌టాపిక్‌గా మారింది. 

2008లో స్మైల్ పింకీ డాక్యుమెంటరీలో నటించినప్పుడు ఆ పాప వయస్సు కేవలం ఆరు సంవత్సరాలు. ప్రస్తుతం 20 సంవత్సరాలు కాగా..  ఇప్పటికీ అదే గ్రామంలో నివసిస్తున్నారు. ఇప్పుడు 12వ తరగతి చదువుతోంది. మా కుటుంబ అవసరాలు తీర్చేందుకు నాన్న పండ్లు, కూరగాయలు అమ్ముతూ జీవనం సాగిస్తున్నారని గతంలో పింకీ వెల్లడించింది. 
 

మరిన్ని వార్తలు