Paruchuri Gopala Krishna: వీరసింహారెడ్డి.. ఆ సినిమానే గుర్తొచ్చింది, ఇందులో అవి చూడబుద్ధి కాలేదు

4 Mar, 2023 15:43 IST|Sakshi

నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ వీరసింహారెడ్డి. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా మాస్‌ ఆడియన్స్‌ను తెగ మెప్పించింది. ఓటీటీలోనూ అదరగొడుతున్న ఈ చిత్రంపై తాజాగా సినీరచయిత పరుచూరి గోపాలకృష్ణ రివ్యూ ఇచ్చాడు. 'వీరసింహారెడ్డి చూశాను. ఈ సినిమా చూస్తుంటే నాకు నందమూరి తారకరామారావుగారి చండశాసనులు మూవీ గుర్తొచ్చింది. ఎందుకంటే రెండు సినిమాల కథాబీజం ఒకటే. అన్నాచెల్లెళ్ల మధ్య వైరం, అన్నయ్య నాశనమైపోవాలని శపించడం వంటివి రెండింటిలోనూ ఉంటాయి. వీరసింహారెడ్డిలో తాను కోరుకున్నవాడిని చంపించేశాడన్న కోపంతో అన్నయ్య శత్రువులింట్లో ఒకరితో తాళి కట్టించుకుని వాళ్ల సాయంతో సొంత అన్నమీద పగ తీర్చుకోవాలనుకుంటుంది చెల్లెలు వరలక్ష్మి. బాలయ్య బాడీ లాంగ్వేజ్‌కు ఇది బాగా సరిపోయింది. ఫస్టాఫ్‌ చూసినంతసేపు ఇది బోయపాటి శ్రీను సినిమా చూస్తున్నట్లే అనిపించింది. ఫస్టాఫ్‌ బంగారంలా ఉంది. కానీ సెకండాఫ్‌ బంగారం, వెండికి మధ్యలో ఉన్నట్లు అనిపించింది.

ఒక భయంకరమైన పులి గాండ్రింపులు విన్నాక అది సడన్‌గా కామ్‌ అయిపోయి చెల్లెలిని చూసి తోకాడిస్తే చూడబుద్ధి కాదు. అయినా అన్నాచెల్లెల అనుబంధమే ఈ సినిమాను కాపాడింది, రూ.130 కోట్లు వసూలు చేయగలిగింది. కానీ ఇదే సినిమాను ఇంకా ముందుకు తీసుకెళ్లొచ్చు. ఎలాగంటే.. పెద్ద బాలయ్య పాత్ర చనిపోయాక ఫ్లాష్‌బ్యాక్‌ చూపించారు. ఎప్పుడైతే ఆయన పాత్ర చనిపోయాడని ప్రేక్షకులకు తెలిసిపోయిందో అప్పుడే ఒక నిరాశ వచ్చేస్తుంది. సెకండాఫ్‌లో అన్నాచెల్లెళ్ల అనుబంధానికి అంత నిడివి అక్కర్లేదు. నవీన్‌ చంద్ర ఆత్మహత్య చేసుకున్నట్లు చూపించారు, కానీ అది నిజం కాదని నేను పసిగట్టాను. హీరో మూలంగా అతడు చనిపోయినట్లు ఉంటే మాత్రం సినిమా ఆడేదే కాదు.

ఈ సినిమాలో ఉన్న ప్రాథమిక లోపం.. వీరసింహారెడ్డి పాత్రను ముగించి తర్వాత ఫ్లాష్‌బ్యాక్‌ చూపించడం. కొన ఊపిరితో ఉన్నప్పుడు చిన్న బాలయ్యకు ఫ్లాష్‌బ్యాక్‌ చెప్పి అతడు విలన్‌ను చంపేసి అత్త, తండ్రికి సమాధులు కట్టినట్లు చూపించి ఉంటే బాగుండేది. చిన్న బాలయ్య ఇష్టపడ్డ హీరోయిన్‌ తండ్రి కూడా విలన్లలో ఒకడని చూపించాడు, కానీ ఆ పాత్ర ఏమైందో చూపించలేదు. హీరోహీరోయిన్లకు పెళ్లైందా? లేదా? బెంగళూరు నుంచి వచ్చిన వాళ్లు ఏమయ్యారు? ఇలా కొన్నింటిని చూపించకుండానే సినిమా ముగించేశారు. దీంతో సడన్‌గా సినిమా ముగిసినట్లైంది. ఇలాంటి చిన్నచిన్న తప్పులన్నింటినీ జయించి సినిమా అన్ని కోట్లు రాబట్టడానికి బాలయ్య ఒక్కరే కారణం అని చెప్పుకొచ్చాడు పరుచూరి గోపాలకృష్ణ.

మరిన్ని వార్తలు