Pawan Kalyan: నటుడా? నాయకుడా?

24 Mar, 2024 09:47 IST|Sakshi

పవన్‌ కళ్యాణ్‌.. పరిచయం అవసరం లేని పేరు. 20 ఏళ్లుగా సినీ రంగంలో ఉన్నాడు. ఆ పడవలో ఓ కాలు పెట్టి.. మరో కాలును రాజకీయాల్లోకి దించాడు. పోనీ ఇక్కడ ఇప్పటివరకు పొడిచింది ఏదైనా ఉందా.? అంటే ఒక్క ఎన్నికలోనూ గెలవలేకపోయాడు. సినిమాల్లో తప్ప అసెంబ్లీ గేటు వరకైనా వెళ్లలేకపోయాడు పవన్‌. ఆయనకున్న ఇమేజీ అలాంటిది.

వై జంక్షన్‌లో దారెటు?
ఇప్పుడు పవన్‌ కళ్యాణ్‌ ముందు రెండు పరీక్షలున్నాయి. ఆయనిప్పుడు వై జంక్షన్‌లో వెయిట్‌ చేస్తున్నారు. మొదటి పరీక్ష పాలిటిక్స్‌. చివరి ప్రయత్నంగా రాజకీయాల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాడు. గెలుస్తాడో లేదో నమ్మకం లేదు కాబట్టి.. అసెంబ్లీకి పోటీ చేయాలా.. లేక పార్లమెంటుకు పోటీ చేస్తే బీజేపీ ఇమేజ్‌ కాపాడుతుందా? అన్న సందిగ్ధత.

వెండి తెరపై టఫ్‌ టైం
ఇక పవన్‌ ముందున్న రెండో పరీక్ష సినిమాలు. ఇప్పుడు పవన్‌ వయస్సు 52 ఏళ్లు. ఇన్నాళ్లు యూత్‌ పాత్రలో నటించినా.. పాటలకు స్టెప్పులు వేసినా.. అభిమానులు అతి కష్టమ్మీద చూసుకొచ్చారు. ఇప్పుడు వయస్సు మీద పడుతోంది. ఎంత మేకప్‌ వేసినా.. ముఖంలో వయస్సు తాలుకు ముడతలు కనిపిస్తున్నాయి. పవన్‌ కళ్యాణ్‌ వయస్సుకు తగ్గ పాత్రలు దొరికితేనే.. సినిమాలు నడుస్తాయి.

(చదవండి: రీల్‌ వర్సెస్‌ రియల్‌లో... పవన్‌ గందరగోళం!)

ఏతా వాతా చెప్పేదేంటంటే.. పవన్‌ మార్కెట్‌ ఇప్పుడు అనుకున్నంత లేదు. అంతెందుకు పవన్‌ అనగానే.. ఊగిపోయే అభిమానులు కూడా ఇప్పుడు ఆచితూచి థియేటర్ల వైపు వస్తున్నారు. ఉదాహరణకు రీఎంట్రీ తర్వాత వచ్చిన  వకీల్‌ సాబ్‌, భీమ్లా నాయక్‌, బ్రో.. అంతెందుకు ఇంకొంచెం ముందుకు వెళ్తే.. అజ్ఞాత వాసి, కాటమరాయుడు, సర్దార్‌ గబ్బర్‌ సింగ్‌.. ఏ సినిమాను చూసినా బాక్సాఫీసు కంటే ముందే గ్లాసు పగిలిపోయింది. అంటే ఇప్పుడు పవన్‌ లేని మార్కెట్‌ను సృష్టించుకునేందుకు ఆరాటపడుతున్నాడు.

రాజకీయాల్లో నటిస్తే ఒప్పుకుంటారా?
ఎలక్షన్స్‌ కోసమే ఉస్తాద్ భగత్ సింగ్ నుంచి ఏవో రెండు డైలాగ్స్‌తో ఒక వీడియోను విడుదల చేశాడు పవన్‌. పైకేమో సినిమా అంటూ అందులో పొలిటికల్‌ డైలాగ్స్‌ను చదివాడు పవన్‌. తానే గొప్పని చెప్పుకునేందుకు తనను తాను కీర్తించుకున్నాడు. ఆ వీడియోలో గాజు పగిలేకొద్దీ పదునెక్కుతుంది అంటూ.. చెప్పిన పవన్‌ ఒక లాజిక్‌ మిస్‌ అయ్యాడు. గాజు పగిలే కొద్ది పనికిరాకుండా పోతుందనే విషయాన్ని కూడా లక్ష పుస్తకాలు చదివిన పవన్‌ తెలుసుకోలేకపోయాడు. స‌ముద్రం వంగ‌దు, ప‌ర్వతం ప‌డుకోదు, 24 అంటే గాయత్రి మంత్రం వంటి త్రివిక్రమ్‌ డైలాగ్స్‌ వినిపించాడు. కానీ రియాల్టీలో చంద్రబాబు దగ్గర వంగిపోతున్నాడు. చేతులు కట్టుకుని సాగిలబడుతున్నాడన్నది రియల్‌  పాలిటిక్స్‌లో వినిపించే విమర్శలు. అందుకే సీఎం సీఎం అని పిలిపించుకున్న పవన్‌.. తనను తాను బాగా తగ్గించుకుని 21 సీట్లకు పరిమితం చేసుకున్నాడు. చంద్రబాబు చెప్పిన చోట పోటీ చేసేందుకు రెడీ అయిపోయాడు.

(చదవండి: బాబు ఇచ్చిందే జనసేనకు ప్రాప్తం)

విశ్వసనీయత కనిపించడం లేదు?
రాజకీయ నాయకుడికి కావాల్సిన ప్రాథమిక లక్షణం విశ్వసనీయత. ఆ సూత్రాన్ని పవన్‌ ప్యాకేజీతో మార్చేశాడు. అందుకే జ‌న‌సేన ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశం నుంచి ఎవరు, ఎక్కడి నుంచి బరిలో దిగుతారన్న డైరెక్షన్‌ చంద్ర‌బాబు ఇస్తారంటారు జనసైనికులు. అందుకే చాలా ఏళ్లుగా జనసేనను నమ్ముకుని, ఆస్తులు అమ్ముకొని డబ్బులను పార్టీ కోసం ఖర్చు పెట్టిన కొందరి నేతలకు టికెట్‌లు దక్కలేదు. ఒక నటుడు.. సినిమా అట్టర్ ఫ్లాప్ అయినా.. కొన్ని నెలలపాటు అదొక అద్భుతం, సూపర్ హిట్ అని ప్రచారం చేసుకుంటూ ఉంటారు. అలాంటి వాతావరణం అలవాటైన సినిమా హీరో పవన్ కల్యాణ్‌కు.. వాస్తవాలు అర్థమయ్యే అవకాశం ఎప్పటికీ ఉండదు. ప్రస్తుతం ఆయన ఎక్కడ నుంచి పోటీ చేస్తారో ఇంకా క్లారిటీ వచ్చినట్లు లేదు. పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయడ‌మా, లేదా కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేయ‌డ‌మా అనేది అమిత్ షా డిసైడ్ చేస్తార‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ స్వ‌యంగా చెప్పారు. మరీ క్లారిటీ ఇప్పటికైనా వచ్చిందో లేదో తెలియాల్సి ఉంది.

కిం కర్తవ్యం?
2024 ఓ రకంగా పవన్‌ను అటో ఇటో తేల్చేసే ఏడాది. ఎన్నికల్లో పవన్‌ ఓడితే రాజకీయంగా ఆయన దుకాణం బంద్‌. ఇప్పటికే జనసేన పార్టీని చంద్రబాబుకు లీజ్‌కు ఇచ్చేసినట్టే. కనీసం పాతిక స్థానాల్లో కూడా పోటీ చేయలేని పార్టీని ఇంకా ముందు ముందు ఏ రకంగా నడుపుతాడు? అసెంబ్లీకి పోటీ చేయాలా? పార్లమెంటుకు పోటీ చేయాలా అన్న సందేహాలే ఇంకా వెంటాడితే నాయకుడు ఎలా అవుతాడు?

ఇక మిగిలింది సినీ రంగం. కొత్త నటులెందరో దూసుకువస్తున్నారు. ఇంతకు ముందులా కాకుండా..ఓటీటీ ఎంటర్‌ అయింది. కంటెంట్‌ బాగుంటే కటౌట్‌ అవసరం లేదని తేల్చేస్తోంది. ఇప్పుడు పవన్‌ను నమ్మి భారీ బడ్జెట్‌తో సినిమాలంటే చేతులు పూర్తిగా కాల్చుకోవడమన్నది అందరికి అవగాహనలోకి వచ్చింది. పైగా 52 ఏళ్లలో హీరోయిన్‌లతో స్టెప్పులేయడం కూడా ఎబ్బెట్టుగా ఉంటుంది. నిజజీవితంలో మూడు పెళ్లిళ్లు చేసుకున్నంత మాత్రాన.. తనను తాను ఇంకా యంగ్‌ అనుకోవడం కూడా అంత బాగుండదు.పెరిగిన వయస్సుకు తగ్గట్టుగా హుందాగా ఉండి ఉంటే.. సినిమాల నుంచి రాజకీయాల వైపు ఓ ట్రాన్సిషన్‌ వచ్చి ఉండేది. కానీ.. కేవలం సినీ ఇమేజీతో గట్టెక్కుతానంటే ఓటర్లెలా నమ్ముతారు?

Election 2024

మరిన్ని వార్తలు