Singer KK Death: సింగర్‌ కేకే మృతిపై అనుమానాలు.. ముఖంపై గాయాలు!

1 Jun, 2022 10:47 IST|Sakshi

ప్రముఖ బాలీవుడ్‌ సింగర్‌ కృష్ణకుమార్​ కున్నాత్‌ అలియాస్‌ కేకే(53) మృతిపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. కేకే హఠాన్మరణంపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆయన పాల్గొన్న స్టేజ్‌ షో దగ్గరి సీసీ పుటేజ్‌ని స్వాదీనం చేసుకొని పరిశీలిస్తున్నారు. సింగర్‌ కేకేది అసహజ మరణం అని పోలీసులు భావిస్తున్నట్లు సమాచారం. సరైన వసతులు లేకపోవడం వల్లే కేకే మరణించారని పశ్చిమ బెంగాల్‌ బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు కేకే ముఖంపై గాయాలు ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై పోలీసులు ఇంకా స్పందించలేదు. కుటుంబ సభ్యులు వచ్చిన తర్వాత మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంది. 

(చదవండి: సింగర్‌ కేకే హఠాన్మరణం: విరహ గీతాలతో కోట్ల హృదయాలను కొల్లగొట్టి..​)

కాగా, కోల్‌కతాలో ఒక ప్రదర్శన కోసం వెళ్లిన  కేకే మంగళవారం అర్థరాత్రి అకస్మాత్తుగా చనిపోయారు. ప్రదర్శన అనంతరం హోటల్‌ గదిలోకి వెళ్లిన కేకే.. గుండెపోటుకు గురవడంతో కలకత్తా మెడికల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేకేగా ప్రసిద్దుడైన ఆయన ఎమోషనల్‌ సాంగ్స్‌కు పెట్టింది పేరుగా మారాడు. హిందీతో పాటు తెలుగు, కన్నడ, మలయాళం, మరాఠీ, బెంగాలీ తదితర భాషల్లో ఏన్నో పాటలు పాడారు.

తెలుగులో 20కి పైగా సూపర్‌ హిట్‌ సాంగ్స్‌తో సినీ ప్రియుల మనసు గెలుచుకున్నాడు. ఫీల్‌ మై లవ్‌(ఆర్య), చెలియ చెలియా(ఘర్షణ), దాయి దాయి దామ్మా(ఇంద్ర) ఏ మేరా జహా(ఖుషి)వంటి పలు పాటలను ఆయన ఆలపించాడు. కేకే మృతికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.అక్షయ్‌ కుమార్‌తో సహా పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు