Yatra- 2 Teaser .. తూటాల్లా పేలుతున్న డైలాగ్స్‌.. ఇవి గమనించారా..?

6 Jan, 2024 18:01 IST|Sakshi

యాత్ర- 2 టీజర్‌ విడుదలైంది. యూట్యూబ్‌ ట్రెండింగ్‌లో టాప్‌-1కు చేరిపోయింది. ఇందులో తెలుగు ఇండస్ట్రీకి చెందిన ఎలాంటి స్టార్‌ హీరోలు లేరు.. కానీ టీజర్‌కు విపరీతమైన ఆదరణ లభిస్తుంది. ఈ సినిమాకు సంబంధించిన డైలాగ్స్‌ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. కొన్ని లక్షల మంది వైఎస్సార్‌ అభిమానులు తమ మొబైల్స్‌లలో వాట్సప్‌ స్టేటస్‌లుగా యాత్ర-2 టీజర్‌ డైలాగ్స్‌ను పెట్టుకుంటున్నారు. ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో యాత్ర-2 సినిమా పేరు ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.

ఇంతలా ఈ సినిమాకు ఆదరణ పెరగడానికి ప్రధాన కారణం ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి.. ఆయన జీవితచరిత్ర ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుండటంతో వైఎస్‌ఆర్‌, ఆయన వారసుడు సీఎం జగన్‌మోహన్‌ రెడ్డిని అభిమానించే వారందరూ యాత్ర-2 టీజర్‌తో పండుగ చేసుకుంటున్నారు. టీజర్‌లో చూపించిన ప్రతి అంశం గడిచిన రోజుల్లో మన కళ్ల ముందు జరిగినవే.. కానీ డైరెక్టర్‌ మహి వి రాఘవ అద్భుతంగా తెరకెక్కించారు.

దేశంలోనే అత్యంత ఆదరణ ఉన్న ముఖ్యమంత్రుల్లో వైఎస్‌ జగన్‌ గారు ఒకరు.. అంతే కాకుండా ఆయనొక అగ్రెసివ్ రాజకీయ నాయకుడు, మాస్‌ లీడర్‌, ప్రజల్లో నుంచి పుట్టిన పార్టీకి అధినేత.. అంతలా ఇమేజ్‌ ఉన్న నాయకుడి గురించి తీసే బయోపిక్‌ను అంతే స్థాయిలో పొయెటిక్‌గా తెరమీదకు తీసుకురావడం డైరెక్టర్‌ మహి కే సాధ్యమైంది.

ఈ పాయింట్‌తోనే టీజర్‌ ప్రారంభం
అసలు టీజర్ స్టార్ట్ కావడమే ఎమోషనల్ నోట్‌తో ప్రారంభమైంది. ఆ షాట్‌ కూడా పులివెందుల పూలంగళ్ల సర్కిల్ వద్దే జరిగింది. ఈ టీజర్‌లో సీఎం జగన్‌ గారి జీవితంలో జరిగిన యథార్థ సంఘటనలనే తెరపైకి తీసుకొచ్చారు. దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి అనూహ్యంగా 2009, సెప్టెంబర్‌ 2న హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించడం జగన్‌ గారిని బాగా కలచివేసింది. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక ఎంతోమంది అభిమానులు హఠాన్మరణానికి గురికావడం ఆయనకు మరింత దుఃఖాన్ని కలిగించింది. తనలాగే కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబాలను ఓదార్చేందుకు జగన్‌ తదుపరి కర్తవ్యంపై దృష్టి పెట్టారు.

వైఎస్‌ మరణించిన పావురాలగుట్టను సందర్శించి నివాళులర్పించిన తరువాత నల్లకాలువ వద్ద జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ.. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక మరణించిన ప్రతీవ్యక్తి ఇంటికి వస్తానని.. వారి కుటుంబ సభ్యులను ఓదారుస్తానని భరోసా ఇచ్చారు. ఇలా ఇచ్చిన మాటే ఆయన కష్టాలకు తొలిమెట్టయింది. ఈ పాయింట్‌తోనే టీజర్‌ ప్రారంభం అవుతుంది. అనుకున్నట్లే వైఎస్‌ జగన్‌ గారు పాద​యాత్ర ప్రారంభించారు..

రోజురోజుకూ ఆయనకు పెరుగుతున్న ప్రజాదరణను చూసి జీర్ణించుకోలేకపోయిన కొందరు తండ్రి పోయాడనుకుంటే వారసుడొచ్చాడని.. దీనిని ఎలాగైనా ఆపాలని కాంగ్రెస్‌తో జత కట్టి దొంగదెబ్బ తీసేందుకు వార్నింగ్‌లు జారీచేశారు. అప్పుడు టీజర్‌లో వినిపించిన డైలాగ్‌ ఇదే... 'ఉన్నది అంతా పోయినా పర్వాలేదు అని తెగించిన జగన్ లాంటి వాడితో యుద్ధం చేయడం మనకే నష్టం' ప్రస్తుతం ఏపీలో కాంగ్రెస్‌ పరిస్థితి కూడా ఇదే.

ఎవరికీ తలవంచని ధైర్యం.. కష్టాలెన్ని ఎదురొచ్చినా ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలనే తపన.. నమ్మిన సిద్ధాంతం, విలువల కోసం దృఢంగా నిలబడే వ్యక్తిత్వం.. పెద్ద దిక్కు తండ్రిని పోగొట్టుకున్నా చెక్కుచెదరని ఆత్మవిశ్వాసం వైఎస్‌ జగన్‌ సొంతం. రాజీపడి ఎక్కే అందలాల కన్నా.. పోరాటాల ద్వారానే విజయ లక్ష్యాన్ని ఛేదించాలనుకోవడంలో ఆయనకు ఆయనే సాటి. ఈ క్రమంలో వచ్చిందే ఈ డైలాగ్‌ 'నాకు భయపడడం తెలియదు.. నేను వైఎస్సార్‌ కొడుకుని' అని చెప్పడం.

వైఎస్‌ జ‌గ‌న్ గారిపై అన్యాయంగా సీబీఐ, ఈడీ కేసుల‌ను న‌మోదు చేయించి, టీడీపీతో కుమ్మ‌క్కై రాజ‌కీయంగా మొగ్గ‌దశ‌లోనే వైఎస్సార్‌ వార‌సుడిని అంత‌మొందించేందుకు 16 నెల‌ల పాటు జైల్లో పెట్టిన తీరును యాత్ర- 2లో చూపించనున్నాడు డైరెక్టర్‌ మహీ. జగన్‌ గారి ఓదార్పు యాత్రకు ముందు ఆయన మీద ఒక్క కేసు కూడా లేదు.. ఎప్పుడైతే ఓదార్పు యాత్ర ప్రకటన వచ్చిందో ఒక్కొక్కటిగా కేసులు నమోదవుతూ వచ్చాయి.

రాజ‌కీయంగా వైఎస్సార్ వార‌సుడిని లేకుండా చేయాల‌ని కుట్ర ప‌న్నిన వారందరికీ వైఎస్‌ జగన్‌ అభిమానులు తగిన బుద్ధి చెప్పారు. ఆయన వెంట ఒక సైన్యంలా జనం కదిలారు. తండ్రి మాదిరే ఇచ్చిన మాట కోసం ఎన్ని కష్టాలు వచ్చినా.. పోరాడి నిలబడిన యోధుడిలా జగన్‌ జీవితం ఎప్పటికీ చరిత్రలో ఉంటుంది. అందుకే రాజన్నతో పాటు ఆయన బిడ్డ వైఎస్‌ జగన్‌ జీవితం గురించి సినిమాలు వస్తున్నాయి. వారి అసలైన జీవితాన్ని నేటి తరం యువకులకు తెలిసేలే కొందరు దర్శకనిర్మాతలు పూనుకున్నారు. ఈ క్రమంలోనే యాత్ర సినిమా ఇప్పటికే ప్రేక్షకుల హృదయాలకు దగ్గరైంది.. ఫిబ్రవరి 8న యాత్ర- 2 విడుదల కానుంది.

>
మరిన్ని వార్తలు